తన సతీమణి జానకిలక్ష్మికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసిందంటూ వస్తున్న వార్తలపై విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన మీడియా వేదికగా స్పష్టతనిచ్చారు. తన భార్యకు వ్యక్తిగతంగా ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని పత్రికల్లో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నోటీసులకు, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి (AP Liquor Scam) ఎలాంటి సంబంధం లేదని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేసారు.
Also read:Summer Heat: తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ సెగ..? గుడ్ల కొరత తప్పదా..?
కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవహారంలో భాగమైన కంపెనీకి మాత్రమే ఈడీ నుంచి నోటీసులు వచ్చాయని ఆయన వివరించారు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో గతంలో వ్యాపార సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈడీ నోటీసులు అందాయని, అందులో భాగంగానే తమ కంపెనీకి కూడా నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. గతంలో తాము జరిపిన వ్యాపార లావాదేవీల వివరాలను ఈ సందర్భంగా ఎంపీ బయటపెట్టారు. తాను, రాజ్ కేసిరెడ్డి కలిసి ఒక సైట్ డెవలప్ చేయాలని అనుకున్నామని ఆయన తెలిపారు.
Also read:Chandrababu: కూటమి రాజ్యసభ రేసు, చంద్రబాబు మార్క్ లెక్కలు..!
2020-21 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆ సైట్ డెవలప్మెంట్లో భాగంగా కేవలం రూ.35 లక్షల మేర మాత్రమే లావాదేవీలు జరిగాయని స్పష్టం చేశారు. ఆ వ్యాపార లావాదేవీల గురించిన వివరాలు అడగడానికే ఈడీ నోటీసులు పంపిందని ఆయన వెల్లడించారు. రాజ్ కేసిరెడ్డితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. తాము చట్టప్రకారమే వ్యాపారం చేశామని, ఇందులో దాచడానికి ఏమీ లేదని అన్నారు. ఈడీ పంపిన నోటీసులకు తాము పూర్తి ఆధారాలతో, చట్టపరంగా సమాధానం ఇస్తామని ప్రకటించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజానిజాలు త్వరలోనే దర్యాప్తులో తేలుతాయని ఎంపీ కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు.
