Koya Praveen: డాక్టర్ నుంచి డీఐజీ వరకు, సీమను వణికిస్తున్న ‘కోయ ప్రవీణ్ మార్క్’ పోలిసింగ్..!

కోయ ప్రవీణ్ మార్క్’ పోలిసింగ్..!

Share this :

ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థలో సంచలనాలకు, కఠినమైన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే పేరు డాక్టర్ కోయ ప్రవీణ్. ప్రస్తుతం కర్నూలు రేంజ్ డీఐజీగా (Kurnool) విధులు నిర్వహిస్తున్న ఆయన పగ్గాలు చేపట్టిన కొద్ది కాలంలోనే రాయలసీమలోని పాత ఫ్యాక్షన్ ముఠాలు, అసాంఘిక శక్తుల ఆటకట్టించారు. ఒకప్పుడు గ్యాంగ్ వార్లతో, రాజకీయ కక్షలతో అట్టుడికిన ప్రాంతాలు ఇప్పుడు ప్రశాంతంగా మారడం వెనుక ప్రవీణ్ తీసుకున్న సంచలన వ్యూహాలే కారణమని సామాన్య ప్రజల్లో సైతం చర్చలు నడుస్తున్నాయి.

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గ్రామానికి చెందిన కోయ ప్రవీణ్ చదువులో మొదటి నుండి టాపర్. కాకినాడలోని ప్రఖ్యాత రంగరాయ మెడికల్ కాలేజీ నుండి 2004లో ఆయన ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసి డాక్టర్ పట్టా పొందారు. అయితే సమాజంలో మరింత విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన సివిల్స్ వైపు అడుగులు వేశారు. మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు ఎంపికయ్యారు. కానీ ఖాకీ యూనిఫామ్ పై ఉన్న మక్కువతో శిక్షణ కాలంలోనే మళ్లీ పట్టుదలతో చదివి.. 2009 బ్యాచ్‌ లో నేరుగా ఐపీఎస్ హోదాను సాధించారు.

కోయ ప్రవీణ్ ఎందుకంత పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారనే దానికి ఆయన కెరీర్ ప్రొఫైలే నిదర్శనం. నక్సలైట్ల అణచివేతలో ప్రపంచంలోనే అత్యుత్తమ కమాండో దళంగా పేరున్న ‘గ్రేహౌండ్స్’ లో ఆయన అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్, కాజీపేట, పార్వతీపురం, విజయనగరం వంటి అత్యంత సమస్యాత్మక మరియు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అడిషనల్ ఎస్పీగా మరియు ఓఎస్డీగా క్షేత్రస్థాయిలో పనిచేశారు.

తీవ్రవాద నిర్మూలన కోసం పనిచేసే ప్రత్యేక విభాగం ‘ఆక్టోపస్’ లో కూడా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ కఠినమైన శిక్షణ, ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఆయనను ఏ క్షణంలోనైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగల ధీరుడిగా మార్చాయి. ఎస్పీగా విశాఖపట్నం రూరల్ బాధ్యతలు చూసినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి స్మగ్లింగ్ ముఠాల వెన్నులో వణుకు పుట్టించారు. విజయవాడ సిటీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన కాలంలో నగరంలో బ్లేడ్ గ్యాంగులు, రౌడీ షీటర్ల ఆటకట్టించి లా అండ్ ఆర్డర్‌ను పక్కాగా అమలు చేశారు.

కాకినాడ సీ పోర్ట్ డైరెక్టర్‌గా కూడా రవాణా భద్రతలో తన మార్క్ చూపించారు. రాయలసీమ లోని కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల పరిధి కలిగిన కర్నూలు రేంజ్ డీఐజీగా ప్రవీణ్ వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతో దాడులకు దిగేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పులివెందుల, కడప లాంటి ప్రాంతాల్లో జరిగే ఘర్షణలపై ఆయన స్పందిస్తూ “తాము గనుక రంగంలో లేకపోతే ఫ్యాక్షన్ నేతల తలలు ఎగిరిపోయేవి, చట్టం ముందు ఎవరైనా ఒకటే” అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి.

ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే.. నేరగాళ్లను నేరగాళ్లుగానే చూడటం, సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేసి అల్లర్లు సృష్టించే వారిపై పీడీ యాక్ట్‌లు పెట్టడం, మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం డీఐజీ కోయ ప్రవీణ్ శైలి. డీఐజీ కోయ ప్రవీణ్ వలన  నేడు రాయలసీమలో బాంబుల మోత, వేటకొడవళ్ల ఫ్యాక్షన్ సంస్కృతి అణచివేయబడి, సామాన్య ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని స్థానికులు కొనియాడుతున్నారు.