YS Jagan: జగన్ నవ్వుతూ శాంతి కథ అల్లారా..? పేర్ల కుటుంబాన్ని వైఎస్ వేధించలేదా?

జగన్ నవ్వుతూ శాంతి కథ అల్లారా..?

Share this :

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాయలసీమ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది. తమ కుటుంబానికి శత్రువులైన వారిని తాము క్షమించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం పాత కక్షలను తవ్వి తీస్తోందని జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. అప్పట్లో వైఎస్ కుటుంబం చేసిన ఫ్యాక్షన్ వేధింపుల చరిత్రను కూటమి నేతలు మరియు బాధితులు మళ్లీ తెరపైకి తెస్తున్నారు.

పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ తాత రాజారెడ్డిని దారుణంగా హత్య చేసిన నిందితులను కూడా తాము క్షమించామని, వారిపై ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పులివెందులలో ఎవరికీ అన్యాయం చేయలేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తూనే వైఎస్సార్సీపీ కేడర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు, అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై రాజారెడ్డి హత్య కేసు నిందితుల కుటుంబాలు మరియు రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. జగన్ చెబుతున్న ‘క్షమించే గుణం’ కేవలం అబద్ధమని, వాస్తవానికి అప్పట్లో వైఎస్ కుటుంబం చేతిలో తాము అనుభవించిన నరకం అంతా ఇంతా కాదని వారు గుర్తుచేస్తున్నారు. 1998 మే నెలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి వేంపల్లి సమీపంలో బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పెండేకంటి చంద్రశేఖర్ రెడ్డి, పేర్ల పార్థసారథి రెడ్డి సహా పలువురిని అప్పట్లో వైఎస్ కుటుంబం రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్రంగా వేధించిందనే ఆరోపణలు ఉన్నాయి.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి కోర్టులు శిక్షలు ఖరారు చేసినప్పటికీ, జైలు లోపల మరియు బయట వారి కుటుంబ సభ్యులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని బాధితులు చెబుతున్నారు. వైఎస్సార్ హయాంలో పేర్ల పార్థసారథి రెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులను ధ్వంసం చేయడం, వారి అనుచరులపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా పులివెందుల, వేంపల్లి ప్రాంతాల నుండి వారిని వెలివేసేలా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపారని నాటి చరిత్రను గుర్తుచేస్తున్నారు.

తాము అందరినీ క్షమించామని జగన్ ఇప్పుడు చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని, అధికారం కోల్పోయిన తర్వాత సానుభూతి కోసమే ఆయన ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారని ప్రత్యర్థులు ధ్వజమెత్తుతున్నారు. కేవలం రాజారెడ్డి హత్య కేసు నిందితులే కాకుండా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సొంత చెల్లెళ్లు షర్మిల, సునీతలను జగన్ ప్రభుత్వం ఎలా వేధించిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారని వారు గుర్తుచేస్తున్నారు. గత ఐదేళ్ల వైరి కక్షల పాలనలో పులివెందులలో టీడీపీ వైపు నిలబడిన ప్రతి సామాన్య కార్యకర్తను ఇళ్ల నుండి తరిమేసి, వ్యాపారాలు మూయించి వేధించిన జగన్.. ఇప్పుడు శాంతి వచనాలు పలకడం హాస్యాస్పదంగా ఉందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు.