తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టహాసంగా ముగిసింది. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1,875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నారు. మొత్తం 24 లక్షల మంది వర్చువల్‌గా భాగస్వామ్యం అయినట్లు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ అట్టహాసంగా ప్రకటించారు. అలాగే ఈ మహానాడును మహిళలకు అంకితం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్త్రీ శక్తి మహానాడు అని అభివర్ణించారు.
రెండు రోజుల పాటు సాగిన మహానాడులో ఎంతో మంది ప్రసంగించారు. చాలా మంది చంద్రబాబు, లోకేష్‌పైన పొగడ్తల వర్షం కురిపించారు. అయితే మహానాడు మొత్తానికి ఒక ఎమ్మెల్యే ప్రసంగం మాత్రం హైలెట్‌గా నిలిచింది. మహానాడు వేదిక పైన ఏ ఒక్కరూ ఊహించని వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఒక్క రోజులోనే టీడీపీ కార్యకర్తలకు అత్యంత ఇష్టమయ్యారు. కార్యకర్తలను ఎలా మరిచిపోయారనేనే విషయాన్ని, ఆయన పరోక్షంగా గుర్తుచేశారు. పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్న వారికి పెద్ద పీఠ వేయాలన్న కోటంరెడ్డి కామెంట్‌లు.. ఎమ్మెల్యేలను ఆలోచనలో పడేశాయి.
అధికారం లోకి వచ్చాక మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ గెలుపు కోసం కృషి చేసిన వారిని మర్చిపోయి, సొంత మనుషులకు, వైసీపీ నుండి టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. నిజానికి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేల మీద అనేక విమర్శలు కూడా వచ్చాయి. అసలు విషయం ఏమిటంటే.. మహానాడు వేదిక పై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కొత్తగా కొన్ని కీలక సూచనలు చేశారు. ఆయన నేరుగా పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను ఉద్దేశించి కూడా వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికలకు సరిగ్గా 16 నెలల ముందు మాత్రమే వైసీపీ నుంచి టీడీపీలో చేరినట్లు స్వయంగా వెల్లడించారు. ఇంకా అనేక మంది అయితే ఎన్నికలకు కొన్ని రోజులు ముందు టీడీపీలో చేరి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారన్నారు.
కానీ మొదటి నుంచి టీడీపీలో ఉన్న కార్యకర్తలే తమని ఆధరించి, రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి, అఖండ మెజారిటీతో గెలిపించారని కోటంరెడ్డి వెల్లడించారు. వారి ఋణాన్ని అందరూ తీర్చుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించిన కోటంరెడ్డి.. తాను మాత్రం తన గెలుపు కోసం కష్టపడిన వారందరి రుణం తీర్చుకునేందుకు.. రాభోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎంపిక పార్టీ పెద్దలే చేయాలని.. అలా ఎంపిక చేసిన వారిని గెలిపించే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు కూడా. కష్టపడిన వారికే పదవుల విధానం.. ముందుగా తన నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని కోటంరెడ్డి ప్రకటించారు.
నిజానికి కోటంరెడ్డి చేసిన ప్రకటన చంద్రబాబు, లోకేష్‌ల పైన పెద్ద భారం మోపినట్లు అయ్యింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి పార్టీ సభ్యత్వం లేని వారికి కూడా పదవులు ఇచ్చారనే అపవాదును చంద్రబాబు, లోకేష్ మూటగట్టుకున్నారు. కార్యకర్తలను పట్టించుకోవటం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అధికారులతో చంద్రబాబు, సందర్శకులతో లోకేష్ బిజీ బిజీగా గడిపేస్తున్నారని.. కార్యకర్తల గోడు పట్టించుకునేందుకు సమయం ఇవ్వటం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు వేదిక నుంచి కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు.. నిజమైన టీడీపీ కార్యకర్తలకు సంతృప్తిని కలిగించాయంటున్నారు.
