ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇష్టాలు చాలా విచిత్రంగా, గమ్మత్తుగా ఉంటాయనేది సన్నిహితుల మాట. ఆయన నమ్ముతున్న ఐఏఎస్ అధికారులతో పాటు, సీఎంఓలో కూడా వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారుల్లో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, విధేయులతో పాటు వైసీపీ అభిమానులైన అధికారులే ఎక్కువగా ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మాయాబజార్ సినిమాలో మాయా పేటిక అంటూ ఒకటి చూపిస్తారు. దానిని తెరిచిన వెంటనే.. అందులో వారికి ఇష్టమైన మనుషులు, వస్తువులు కనిపిస్తాయి. చివరగా శ్రీకృష్ణుడు తెరిచి చూడగా.. ఆయనకు ఇష్టమైన అర్జునుడి బదులుగా.. జూదానికి ఆహ్వానిస్తూ శకుని కనిపిస్తాడు.
ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయనకు ఇష్టమైన వారు ఎవరో.. అయిష్టులు ఎవరో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉందని ఆయన సన్నిహితులే వ్యాఖ్యానిస్తున్నారు. అసలు చంద్రబాబు మెచ్చిన వారు ఎవరో తెలియాలంటే.. మళ్లీ ఆ మాయా పేటిక తీసుకురావాలేమో అనే సెటైర్లు కూడా వేస్తున్నారు. ఎందుకంటే.. ఆయన చుట్టూ ఉన్న వారిలో.. ఆయన చుట్టూ చేరిన వారిలో ఎక్కువగా వైసీపీ అభిమానులే ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరిన వైసీపీ వారే చంద్రబాబుకు అత్యంత ఇష్టంగా మారినట్లు తెలుస్తోంది.
ఇదంతా ఎందుకంటే.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అత్యంత అవినీతి పరులు, చంద్రబాబు బద్ద వ్యతిరేకులుగా పేరున్న అధికారులే ప్రస్తుతం సీఎంకు, సీఎంఓ అధికారులకు నచ్చుతున్నారట. అలాంటి వారినే ప్రాధాన్యత పోస్టులలో నియమించి, విమర్శలు అనే నిప్పుతో చంద్రబాబు, లోకేష్ చేతులు కాల్చుకుంటున్నారు కూడా. ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా టీడీపీ అనుకూల మీడియా లోనే కధనాలు వస్తున్నాయి. అలా వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి విమర్శలు రావడంతో.. ప్రభుత్వ పెద్దల పరువు పోతుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా.. కథనాలు వచ్చిన తర్వాత.. పరువు పోయిన తర్వాత.. చేసిన తప్పులను సరి చేసుకుంటున్నారు.
వైసీపీ అభిమానులైన ఐఏఎస్ అధికారులే, సీఎంఓలో పనిచేస్తున్నారనేది బహిరంగ రహస్యం. నాడు వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఏలుబడిలో ఆ పార్టీ పెద్దలకు అనుకూలంగా.. టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యవహరించిన అధికారులకే ఇప్పుడు మళ్లీ ఉన్నతస్థానాల్లో పోస్టింగ్ ఇస్తున్నారనే అపవాదును కూటమి పెద్దలు మూటగట్టుకుంటున్నారు. టీడీపీ అభిమాన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెట్టి.. వైసీపీ అభిమాన అధికారులనే మళ్లీ అందలం ఎక్కిస్తున్నారనే చెడ్డపేరు కూటమి సర్కార్‌కు కావాల్సినంత వచ్చింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా కూడా.. కొంత మంది అధికారుల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సీఎంఓ అధికారులను అదే స్థానాల్లో కొనసాగిస్తున్నారు తప్ప.. వారిని తప్పించటం లేదు. ఇందుకు ప్రధాన కారణం.. చంద్రబాబుకు నిజాయతీపరులు నచ్చరేమో అనే ప్రచారం కూడా సచివాలయంలో బాగా ఉంది.
