కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలాంటి తిరుమల వెంకన్నకు కోపం వస్తే.. ఇప్పుడు ఇదే మాట రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. తిరుమల వెంకన్నతో పెట్టుకున్నారు కాబట్టే జగన్ ఘోరంగా ఓడిపోయారనేది భక్తుల నమ్మకం. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి వినియోగం, దర్శనం పేరుతో నిలువు దోపిడీ, వెంకన్న పేరుతో రాజకీయాలు.. ఇలా లెక్కలేనన్ని తప్పులు చేశారు కాబట్టే.. ఘోరంగా ఓడిపోయారు. ఇదే మాటను సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నారు కాబట్టే.. అడ్రస్ గల్లంతు అయ్యింది.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా వెంకన్నకు ఆగ్రహం తెప్పిస్తున్నారా.. అనే అనుమానం కలిగిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసింది కొందరైతే.. చేసిన వారు మరికొందరు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, గోవిందరాజ స్వామి ఆలయ గోపురం బంగారం తాపడం విషయంలో 50 కేజీల బంగారం మిస్సింగ్.. ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈ విషయాలు జగన్ మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందా.. తెలియకుండా జరిగిందా అనే విషయం కంటే కూడా.. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు కారకులు ఎవరనే విషయం ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది కూటమి సర్కార్. నిజానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో అన్ని వేళ్లు అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఇందుకు తగిన ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ బృందం సేకరించింది. అయినా సరే.. చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారనే ప్రశ్న బాగా వినిపిస్తోంది.
సిట్ అధికారులు ఇచ్చిన నివేదికలో అసలు కారకుల పేర్లు లేవనే ప్రచారం జరిగింది. కల్తీ నెయ్యి సరఫరాకు అనుమతి ఇచ్చేలా చేసిన తెర వెనక ఉన్న ముఖ్య కారకులైన వారిని వదిలేసి.. సరఫరా చేసిన వారినే సిట్ అధికారులు గుర్తించటం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. రాజకీయ నాయకులను వదిలేసి అధికారులనే దోషులుగా సిట్ అధికారులు చూపించే ప్రయత్నం చేస్తుంటే.. కొండను తవ్వి ఎలుకను పట్టటం అనే విమర్శలు వస్తున్నాయి. సిట్ అధికారులపై కేంద్ర అధికార పెద్దలు ఒత్తిడి తెచ్చి.. వైసీపీ నాయకుల పేర్లను నివేదికలో లేకుండా చేయించారని.. ఆ విషయం ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
కల్తీ నెయ్యి సరఫరాకు కారకులు ఎవరెవరో సిట్ అధికారులు ఇప్పటికే నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక పై దినేష్ కుమార్ ఆధ్వర్యంలో మరో కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో కూడా ఎవరెవరు ఉన్నారో.. అలాంటి వారిపై ఏయే చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మరో కమిటీ వేసి వారం రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మూడు వారాలు గడిచినా.. అధికారులు రిపోర్టు ఇవ్వకపోవటం వెనుక అర్ధం, పరమార్ధం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కావాలనే అధికారుల కమిటీ కాలయాపన చేస్తుందా..? ఈ విషయంలో చంద్రబాబు కూడా సీరియస్‌గా తీసుకోకపోవటానికి కారణం ఏమిటి..? అనే అనుమానాలు వస్తున్నాయి.
కల్తీ నెయ్యి సరఫరాకు జగన్ మోహన్ రెడ్డి కారణమని పరోక్షంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అటు సిట్ అధికారులు ఇచ్చిన నివేదిక ఇచ్చి ఆరు నెలలు గడిచింది. ఇటు దినేష్ కుమార్ నివేదిక వచ్చి నెల రోజులు పైగా గడిచింది. మరో కమిటి వేసి మూడు వారాలు గడిచింది. కానీ ఈ కేసు విచారణ మాత్రం.. ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి స్పష్టంగా కన్పిస్తుంది. అసలు నిందితులను గాలికొదిలేసి.. తప్పు చేసిన నిందితులకు శిక్షలు పడకుండా ఇంకెంత కాలం కాలయాపన చేస్తారని ప్రజలు నిలదీస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా విమర్శలు, ఆరోపణలు చేయటమే తప్ప.. కల్తీ నెయ్యి సరఫరాకు కారకులైన నిందితులపై చర్యలు ఇప్పటికీ తీసుకోలేదు.
తనకు కల్తీ నెయ్యితో ప్రసాదం చేసి పెట్టారు కాబట్టే.. వెంకన్నకు కోపం వచ్చి వైసీపీ ప్రభుత్వానికి ఘోరమైన ఓటమి చూపించారని.. జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఘోరమైన శిక్ష వేశారని అంటున్నారు. కల్తీ నెయ్యి సరఫరా నిందితులకు శిక్ష పడకపోతే.. అదే వెంకన్నకు మళ్లీ కోపం వస్తుందంటున్నారు కూడా. కాలయాపన చేయకుండా నిందితులకు కఠిన శిక్ష వేసి తిరుమల వెంకన్నగారి ఆశీస్సులు పొందలని కోరుకుంటున్నారు. ఇప్పటికైనా విమర్శలు, ఆరోపణలకు ఫుల్ స్టాప్ పెట్టి.. నిందితులకు తొందరగా శిక్షలు వేయాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.
