తెలంగాణ రాజకీయాల్లో కనీవినీ ఎరుగని వింత పరిణామం చోటుచేసుకుంది. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పార్టీని ప్రకటించిన కొద్దిసేపటికే.. కవిత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అప్పట్లో బీఆర్ఎస్కు ఊపిరిగా ఉన్న ‘టీఆర్ఎస్’ బ్రాండ్‌ను ఇప్పుడు కవిత తన ఖాతాలో వేసుకోవడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఒక భారీ ‘పొలిటికల్ మాస్టర్ ప్లాన్’ రచించారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. మేడ్చల్ సభలో కవిత మాట్లాడుతూ.. “ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. అప్పట్లో చేనేతల కోసం భిక్షాటన చేసిన కేసీఆర్.. ఇప్పుడు మన మనిషి కాదు. ఆయన ఒక ‘మర మనిషి’, మారిన మనిషి.
చుట్టూ ఉన్న గుంటనక్కల చేతిలో ఆయన ఖైదీ అయిపోయారు” అంటూ అత్యంత ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీని ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. “ప్రజలు గోస పడుతుంటే, వరదలతో రైతులు నష్టపోతుంటే కేసీఆర్ వచ్చారా?” అంటూ ఆమె తండ్రి వైఫల్యాలను ఎండగట్టడం అందరినీ విస్తుపోయేలా చేసింది.
రేవంత్ మాస్టర్ ప్లాన్..?
కవిత కొత్త పార్టీ పెట్టడం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్. ఆ పార్టీ ఓటు బ్యాంకును చీల్చకుండా రేవంత్ రెడ్డికి ప్రశాంతత ఉండదు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరుతో కవితను రంగంలోకి దింపడం ద్వారా.. బీఆర్ఎస్లో ఉన్న పాత టీఆర్ఎస్ సానుభూతిపరులను ఆకర్షించడం రేవంత్ ప్లాన్ కావచ్చు. విపక్ష ఓట్లు ఎంతగా చీలిపోతే, అధికార పక్షానికి అంత లాభం. కవిత విడిపోయేలా ప్రోత్సహించడం ద్వారా కేసీఆర్, కేటీఆర్ బలాన్ని సగానికి తగ్గించే వ్యూహం ఇందులో కనిపిస్తోంది.
వాస్తవానికి బీఆర్ఎస్ పేరును మళ్ళీ ‘టీఆర్ఎస్’ గా మార్చి సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలని కేటీఆర్ ప్లాన్ చేశారు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా, అన్న కంటే ముందే చెల్లెమ్మ ఆ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఇది పరోక్షంగా రేవంత్ రెడ్డికి ‘రెడ్ కార్పెట్’ పరిచినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత తన సొంత తండ్రి కట్టిన కోటను కూల్చేయడానికి సిద్ధమవ్వడం, రేవంత్ రెడ్డి వ్యూహాలకు బలం చేకూర్చడమే అని స్పష్టమవుతోంది.
