రాఘవ్ చద్దా ఎగ్జిట్ కు 2024లోనే పడ్డ పునాదులు..!

రాఘవ్ చద్దా ఎగ్జిట్

Share this :

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభం ఒక్క రోజులో పుట్టింది కాదు. దీని వెనుక రెండేళ్ల సుదీర్ఘ అసంతృప్తి, రాజకీయ వ్యూహాలు ఉన్నాయని జాతీయ మీడియా అంటుంది. ముఖ్యంగా రాఘవ్ చద్దా నేతృత్వంలో ఏడుగురు ఎంపీలు బీజేపీలో విలీనం అవ్వడం వెనుక 2024లో జరిగిన రెండు ప్రధాన పరిణామాలు కీలక పాత్ర పోషించాయి. 2024లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు ఊపందుకున్న సమయంలో, పార్టీ హైకమాండ్ దృష్టి అంతా ఢిల్లీ పైనే కేంద్రీకృతమైంది.

ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వ పనితీరును, అక్కడి ఎంపీల అభిప్రాయాలను పార్టీ నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టిందనే విమర్శలు ఉన్నాయి. పంజాబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘవ్ చద్దా వంటి నేతలకు ఢిల్లీ నిర్ణయాల్లో ప్రాధాన్యత తగ్గడం, వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయడం అంతర్గత విబేధాలకు దారితీసింది. అదే సమయంలో పంజాబ్ లోని భగవంత్ మాన్ ప్రభుత్వ పనితీరుపై పార్టీలోని ఒక వర్గం నాయకుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది.

శాంతిభద్రతల విఫల్యం, పాలనాపరమైన లోపాల వల్ల ప్రజల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని చద్దా బృందం భావించింది. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోగా, రివర్స్ లో చద్దాపైనే క్రమశిక్షణా చర్యల పేరుతో పదవుల కోత విధించడం అగ్నికి ఆజ్యం పోసింది. ఈ ఏడాది మార్చి 14న పంజాబ్‌లోని మోగాలో అమిత్ షా నిర్వహించిన ర్యాలీ ఈ సంక్షోభానికి ముగింపు పలికింది. ఆ ర్యాలీ సమయంలోనే అసంతృప్తితో ఉన్న ఆప్ నేతలకు బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామనే భరోసా లభించింది.

ఫలితంగా, రాజ్యసభలో ఆప్ బలాన్ని 2/3 వంతు చీల్చడం ద్వారా అనర్హత వేటు పడకుండా బీజేపీలోకి విలీనం అయ్యేలా పక్కా ప్లాన్ అమలు చేశారు. మొత్తానికి ఢిల్లీ పాలిటిక్స్ లో పంజాబ్ నేతలను తక్కువ చేసి చూడటం, అంతర్గత విబేధాలను పరిష్కరించడంలో కేజ్రీవాల్ వైఫల్యం చెందడం వల్లే నేడు రాఘవ్ చద్దా లాంటి కీలక నేతను ఆప్ కోల్పోవాల్సి వచ్చింది. ఇది రాబోయే ఎన్నికల్లో ఆప్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.