రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి చమర్తి జగన్మోహన్ రాజును నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయం, స్థానిక సామాజిక సమీకరణాలను తలకిందులు చేసేలా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బలిజ, రెడ్డి సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో, సామాజికంగా తక్కువ జనాభా ఉన్న క్షత్రియ వర్గానికి నాయకత్వం అప్పగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజంపేట రాజకీయ చరిత్రను గమనిస్తే, ఇక్కడ బలిజ మరియు రెడ్డి వర్గాలే ఎప్పుడూ ఆధిపత్యం చలాయిస్తూ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆకేపాటి అమరనాథ్ రెడ్డి (రెడ్డి సామాజిక వర్గం) ఎమ్మెల్యేగా ఉండగా, గతంలో టీడీపీలో బత్యాల చెంగలరాయుడు, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం (బలిజ సామాజిక వర్గం) బలమైన నేతలుగా ఉండేవారు. ఇప్పుడు సుగవాసి వైదొలిగిన తర్వాత, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తారని క్యాడర్ ఆశించింది. అయితే, అనూహ్యంగా చమర్తి జగన్మోహన్ రాజును తెరపైకి తేవడం బలిజ వర్గాల్లో కొంత అసహనానికి దారితీసిందని స్థానికంగా చర్చ నడుస్తోంది.
రాజంపేటలో బలిజ సామాజిక వర్గం ఓట్లు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ రాజుల జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ, చమర్తి జగన్మోహన్ రాజుకు పదవి ఇవ్వడం వల్ల రాజుల పెత్తనం మొదలైందనే భావన బలిజ సామాజిక వర్గంలో కలగడం పార్టీకి ప్రమాదకరంగా మారిందనే మాట వినపడుతోంది. బలిజ నేతల మద్దతు లేకుండా రాజంపేటలో విజయం సాధించడం టీడీపీకి కత్తిమీద సామేనని, ఒకవేళ బలిజ వర్గం దూరం జరిగితే అది నేరుగా వైసీపీకి గానీ లేదా జనసేనకు గానీ లాభం చేకూర్చే అవకాశం ఉంది.
గత రెండు మూడు నెలలుగా చమర్తి జగన్మోహన్ రాజు రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌తో పలు నిరసన కార్యక్రమాలు చేపట్టి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసారు. తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా చమర్తి నియోజకవర్గంలో “ప్రజా దర్బార్” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు పుట్టినరోజును రాజంపేటలో చమర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించి, పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
అయితే, నియోజకవర్గంలోని బలమైన బలిజ నేతలు ఆయనకు ఎంతవరకు సహకరిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అత్యధిక జనాభా కలిగిన బలిజ సామాజిక వర్గాన్ని కాదని రాజుల (క్షత్రియ) వర్గానికి బాధ్యతలు ఇవ్వడంపై ఆ వర్గ నేతలు నేటికీ రగిలిపోతున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బతిన్న ఈ పరిస్థితుల్లో, అందరినీ కలుపుకుపోవడమే చమర్తి ముందున్న అతిపెద్ద సవాలు. ఒకవేళ క్యాడర్లో ఉన్న ఈ సామాజిక అసంతృప్తిని అధిష్టానం సకాలంలో సరిదిద్దకపోతే, రాబోయే ఎన్నికల్లో టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
