అమరావతి, డిసెంబర్ 1: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిరక్షణ సమితి అధ్యక్షడు కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) శుక్రవారం (డిసెంబర్ 1) ‘జడ శ్రావణ్ కుమార్‌కి సవాల్’ పేరిట ఒక ప్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు. గత శనివారం తాను నిర్వహించిన సమావేశాన్ని జడ శ్రావణ్ కుమార్ (Jada Shravan Kumar) అనే వ్యక్తి ఓ యూట్యూబ్ ఛానెల్ (Youtube Channel)లో మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించాడు. దీనిపై ఆయన స్పందిస్తూ తాజా ప్రెస్ నివేదిక విడుదల చేశారు. అందులో ఏమని ప్రస్తావించారంటే..
‘నవంబర్ 25వ తేదీన హైదరాబాద్ (Hyderabad)లోని గచ్చిబౌలి (Gachibowli)లో నేను ఓ సమావేశం నిర్వహించాను. ఈ సమావేశంలో ఆయన అమరావతిని ప్రారంభించిన నాయకుడే పూర్తి చేస్తాడు. ఆ సామర్ధ్యం కేవలం చంద్రబాబుకు (Chandrababu) మాత్రమే ఉందని చెప్పాను. ఆ రోజు సమావేశం పూర్తైన వెంటనే జడ శ్రావణ్ కుమార్ ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. అమరావతి (Amaravati) గురించి, చంద్రబాబు గురించి నేను మాట్లాడిన మాటలను తప్పుబడుతూ ప్రచారం చేశాడు. చంద్రబాబు అమరావతిని నాశనం చేశాడని, ఎవరైనా డిబెట్‌కి వస్తే నేను నిరూపిస్తానని సవాల్ విసిరాడు. ఆ వీడియోలో మేము నిర్వహించిన సభను కూడా విమర్శించారు. అయినప్పటికీ నేను మొదటి రోజు స్పందించలేదు’.

‘రెండో రోజు కూడా అదే యూట్యూబ్ ఛానెల్‌లో అతడు మరోసారి అమరావతి గురించి తీవ్రమైన విమర్శలు చేశాడు. రెండో వీడియో చూసిన తర్వాత అతని సవాల్‌ను స్వీకరించి తేదీ, సమయం, వేదిక నిర్ణయించమని ఫేస్‌బుక్ ద్వారా నేను స్పందించాను. ఈసారి మరింత తీవ్రమైన విమర్శలతో సవాల్ చేస్తూ.. హైదరాబాద్‌లో సభ నిర్వహించిన వాళ్లను ‘పేటీఎం కుక్కలు’ అని సంభోదించాడు. ఇప్పుడు చెబుతున్నాను.. హైదరాబాద్‌లో సభ నిర్వహించింది నేనే. కాబట్టి జడ శ్రావణ్ కుమార్ తన వీడియోలో ప్రశ్నించిన విధంగా డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు రాజధాని పరిధి తుళ్లూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు ఆహ్వానిస్తున్నాం’.
‘ఈ కార్యక్రమంలో 5 నిముషాలు అమరావతి గురించి, చంద్రబాబు గురించి నేను మాట్లాడుతాను. ఆ తర్వాత 30 నిమిషాలు చంద్రబాబు అమరావతిని ఏ విధంగా నాశనం చేశాడో జడ శ్రావణ్ కుమార్ చెప్పాలి. తదుపరి జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నలకు నేను సమాధానం చెబుతాను. అలాగే నా ప్రశ్నలకు జడ శ్రావణ్ కుమార్ సమాధానం చెప్పాలి. ఈ కార్యక్రమానికి జడ్జిగా మాజీ జడ్జి రామకృష్ణ వ్యవహరిస్తారంటూ’.. పత్రికా ప్రకటన వెలువరించారు. దీనిపై జడ శ్రావణ్ కుమార్ స్పందన ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
