పాండవులు ఉన్న లక్క ఇల్లు తగలబెట్టారు. మోసం చేసి జూదక్రీడలో ఓడించారు. ద్రౌపదిని నిండు సభలో వివస్త్రని చేశారు. అయినా సరే అన్నీ భరించారు. చివరకి ఐదు ఊళ్లు ఇచ్చినా సర్దుకుంటామన్నారు. యుద్ధం వద్దని హితం చెప్పారు. కానీ ధుర్యోధనుడు, కర్ణుడు వినలేదు. యుద్ధమే కావాలన్నారు. యుద్ధంలో పాండవులను అంతం చేస్తే తప్ప తమ కసి చల్లారదు అనుకున్నారు. యుద్ధమే వస్తే కౌరవ పక్షాన ఒక్కరు కూడా మిగలరు. కేవలం ధుర్యోధనుడి వ్యక్తిగత పగ చల్లారటం కోసం కురుక్షేత్రానికి వెళితే ధుర్యోధనుడు మాత్రమే కాదు అతనిని నమ్ముకుని రణరంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కడూ నాశనం అయిపోతాడని శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి చెప్పాడు. వినాశకాలే విపరీతబుద్ది.
వ్యక్తిగత పగల కోసం అధికారాన్ని వాడుకుంటే ఏం జరుగుతుంది? ధుర్యోధనుడికి లాభమే. ఎలా అంటే పాండవులను కష్టాలు పెట్టాడు. వారు బాధలు పడుతుంటే చూసి సంతోషించాడు. పాండవులను అడవుల పాలు చేశాడు. ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టాడు. ఓ రకంగా కొంతవరకు ధుర్యోధనుడి పగ తీరింది. కాని అతన్ని నమ్ముకుని కురుక్షేత్రంలోకి వచ్చిన రోజు అతని వెనుక ఉన్న ఒక్కడు కూడా మిగల్లేదు. ఏపీలో చంద్రబాబును, రామోజీరావును, తన ప్రత్యర్థులు అనుకున్నవారిని ఈరోజు అధికారం ఉంది కాబట్టి అనేక కష్టాల పాలు చేయవచ్చు. అంత పెద్దవాళ్లనే ఇంతగా వేపుకుతింటున్నాడు రేపు అధికారం ఇస్తే మనం బతకగలమా అని జనంలో ఆలోచన మొదలైంది. జగన్ సభల నుంచి జనం పారిపోయేది అందుకే. బలవంతంగా తెచ్చినా, అధికారులతో బెదిరించి తెచ్చిన జనం నిలబడట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికల సమయంలో అధికారం చేతిలో లేని నాడు జగన్ సభల వైపు జనం తొంగిచూస్తారా? జగన్‌ను నమ్ముకుని అడ్డదారిలో వెళ్లేవారు రేపు ఎన్నికల కురుక్షేత్రంలో సమిధలు కాక ఏం అవుతారు?
జగన్ పగతీరవచ్చు కాని అతన్ని నమ్మి తమ రాజకీయ భవిష్యత్తును ఆ పార్టీలో పెట్టుబడిగా పెట్టిన వారి జీవితాలు బుగ్గిపాలు అవుతాయి. వైసీపీ నుంచి ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ఎన్నికల ఫలితాల రోజు నుంచే ప్రతీకార దాడులు మొదలవుతాయి. ఇంతకాలం వైసీపీ వేపుకుని తిన్న వాళ్లు అందరూ అదను కోసం చూస్తారు. అధికారం చేతిలో నుంచి జారిన మరుక్షణం వేట మొదలవుతుంది. భవిష్యత్‌ను గుర్తించి ఇప్పుడే వైకాపా శిబిరం నుంచి దూరంగా పోయిన వారు సేఫ్‌గా ఉండగలుగుతారు. ఇంకా వైకాపా వైపే ఉన్న వారు అందరూ ఆహారం అయిపోతారు. తాము ఈ నాలుగున్నరేళ్లలో అణిచిపెట్టిన జనం అంతా తిరగబడతారు. మరల వారు జీవితంలో కోలుకోలేనంత మూల్యం చెల్లించుకుంటారు. ధర్మయుద్ధం చేసే వారు మాత్రం మిగులుతారు. అధికార మదంతో జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం ఇతరుల కళ్లలో నీరు తెప్పించిన ప్రతి ఒక్కరు రేపు ఒక్కసారి తమ భవిష్యత్ ముఖచిత్రాన్ని దర్శించగలిగితే మంచిది. హితం చెబితే అర్థం కాదు. కాలం కళ్లు మూసి తెరిచేలోపు వచ్చి కాటేస్తుంది. జాగ్రత్త.
