ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. నేడు చంద్రబాబు నాయుడిని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ వెళ్లారు. దాదాపు ఆయనతో 40 నిమిషాల భేటీ తర్వాత బయటకు వచ్చారు. ఈసారి జరిగే ఎన్నికల్లో పొత్తులపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ సీఎం చంద్రబాబు ని కలిశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్. 40 నిమిషాల ములాఖత్ తర్వాత ఆయన బయటకు వచ్చి రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయంపై మీడియాతో మాట్లాడారు. ‘ఏడాది నుంచి ఈ రెండు పార్టీలు కలిసే వెళ్తాయని నేను చెబుతూనే ఉన్నాను. దరిద్రం పాలన అంతానికి ఈరోజుతో ఆరంభం… పసుపు, ఎరుపు కలిస్తే కాషాయం అవుతుంది. మూడవ పార్టీ కూడా కలుస్తుందనేది నమ్మకం… కలవాలని కోరుకుందాం. టిడిపి, జనసేన పొత్తుతో తక్కువలో తక్కువగా 160 స్థానాలలో విజయం ఖాయం అన్నారు. సంజయ్ మంచి పాటగాడే .. కానీ ఆయనలో మంచి పోలీస్ ఆఫీసర్ ను చూడలేకపోతున్నాం. 17A చట్టం ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి అర్థం కాలేదు… పైకోర్టుకు అర్థమయ్యేలా చెబుతాం, ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారు. బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేస్తాం’ అన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలన్నది ఎప్పటి నుంచో తన కోరిక.. మరి బీజేపీ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అరాచక శక్తులన ఎదుర్కొనేందుకు విడి విడిగా పోటీ చేస్తే పనిచేయదు.. సమిష్టిగానే ఎదుర్కొవాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడబోతున్నాం.. అందుకు ప్రజలు మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాలని కోరుతాం. తెలంగాణ నుంచి ఏపీకి రావాలంటే సరిహద్దులో రెండు వందల మంది పోలీసులను పెట్టి ఆపారంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ అన్నారు. తమ ఇద్దరి భవిష్యత్ గురించి కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు పవన్ కళ్యాణ్.
