MP Raghu Rama Krishna Raju: ‘ఆ రూ.7 వేల కోట్లు ఏమైనట్టు?.. ఏ పెద్దరెడ్డి మింగారో చెప్పాలి’ ఎంపీ రఘురామ

రచ్చబండ కార్యక్రమంలో మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫైర్‌

Narasapuram MP Raghu Rama Krishna Raju Narasapuram MP Raghu Rama Krishna Raju
Share this :

అమరావతి, నవంబర్‌ 3: గత తెలుగుదేశం (TDP) ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక పంపిణీ వల్ల ఏడాదికి రూ.706 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ (CID) పోలీసులకు, ఏపీ మైనింగ్ శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి (Director of Mining Department Venkat Reddy) ఫిర్యాదు చేశారు. ఏడాదికి రూ.700 కోట్లంటే… ఐదేళ్లకు దాదాపు రూ.3 వేల కోట్లు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఇసుక ఉచిత పంపిణీ వల్ల రాష్ట్ర ఖజానాకు పదివేల కోట్ల నష్టం వాటిలినట్లుగా సాక్షి దినపత్రిక వార్తలు వండివాడ్చింది. మరి మిగిలిన ఏడు వేల కోట్ల రూపాయలను సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్వాహా చేశారని సాక్షి దినపత్రిక సెల్ఫ్ కన్ఫర్మేషన్ చేసిందా ? అని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Narasapuram MP Raghu Rama Krishna Raju) ప్రశ్నించారు. ఏడు వేల కోట్ల రూపాయలు ఎవరు మింగారో, ఏ పెద్ద రెడ్డి మింగారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 3) నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో (RRR Rachabanda latest) ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన (MP Raghu Rama Krishna Raju) ఏమన్నారంటే.. సెల్ఫ్ గోల్ ఇలాగే ఉంటుంది.

Also Read: TDP Nilayapalem Vijay Kumar Flagged on CM Jagan: ‘కృష్ణా జలాల పంపిణీలో ఏపీకి అన్యాయం జరుగుతున్నా సీఎం జగన్‌ ఎందుకు నోరెత్తడం లేదు?’

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే, ఇసుకాసురులు కొట్టివేసింది 7వేల కోట్ల రూపాయలని సాక్షి దినపత్రిక ద్వారా వారికి వారే సర్టిఫై చేసుకున్నారు. ఇసుక (sand)ఉచితంగా పంపిణీ చేయడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరిగింది. నిర్మాణరంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితంగా పంపిణీ చేసినా, ట్రాన్స్‌పోర్ట్‌ ఛార్లీల పేరుతో లారీకి రూ. 6 వేల నుంచి 7 వేలు, ట్రాక్టర్‌కు రూ.2 వేల వరకు వసూలు చేసేవారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరింది . జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇసుక ధరలు రూ.40 వేలకు చేరుకున్నాయి. దీనితో నిర్మాణరంగం కుదేలయింది. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. పారదర్శకంగా ఇసుక విక్రయాలు చేపడుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ, గత ప్రభుత్వ హయాంలో ఇసుక ఎలా లభించిందో… ఈ ప్రభుత్వ హయాంలో ఇసుక కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలకు తెలుసునని రఘురామ అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పేరిట సీఎం జగన్‌ తన పెద్ద తండ్రి జార్జి రెడ్డి తనయుడు అనిల్ రెడ్డికి నాకింత… నీకింత అనే పద్ధతిలో ఇసుక మైనింగ్ అప్పగించారు.

ఇసుక ఉచిత పంపిణీ ప్రజాసేవ కాదా?

సాక్షి దినపత్రిక (Sakshi News paper)ను కొలుగోలు చేయడానికి రాష్ట్రంలోని వాలంటీర్లకు నెలకు రూ.200 రూపాయల చొప్పున ఏడాదికి రూ.2400 కోట్లు కేటాయిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . పత్రిక కొనుగోళ్ల పేరిటనే ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు దోచేశారు. జగనన్న పింఛన్ ఇచ్చాడని, రేషన్ బియ్యం ఇచ్చాడని చెప్పడానికి నియమించిన వాలంటీర్ల పేరిట పేపర్ కొనుగోళ్ల కోసం రూ.12 వేల కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టగా లేనిది, ఐదేళ్లలో ఉచిత ఇసుక పంపిణీ వల్ల మూడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేయగానే, సీఎం జగన్‌ ఆదేశాలతో, సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలతో రఘురామిరెడ్డి కేసు నమోదు చేశారు. వాలంటీర్ల పేరిట నీ పార్టీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

అనంతరం స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి మాట్లాడుతూ.. రిమాండ్ రిపోర్ట్ క్వాష్ పిటిషన్ పై ఈనెల ఏడవ తేదీన తీర్పు వస్తుంది. అన్ని మబ్బులు తొలగిపోతాయి. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుందని, ఆ ప్రకారంగానే తీర్పు వెలువడుతుందనే ఆశాభావాన్ని రఘురామ వ్యక్తం చేశారు. గతంలో విధించిన షరతుల మేరకే తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ ను కొనసాగిస్తున్నట్లుగా న్యాయస్థానం స్పష్టం చేసిందని రఘురామ తెలిపారు. కోర్టు విధించిన షరతులను కాదని అదనపు షరతులను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇద్దరు డీఎస్పీలను చంద్రబాబుకు కాపలాగా ఉంచాలని, ఎవరితో మాట్లాడకూడదని, దేని గురించి మాట్లాడకూడదని, ఆయన ఒక ఖైదీ అంటూ కోర్టు ముందు వాదనలు వినిపించగా… కోర్టు ఆయన వాదనలను పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించింది. చంద్రబాబు బెయిల్ రద్దుకు వైసీపీ చేస్తున్న కుట్ర అని ఆయన అన్నారు.

Also Read: Varun Tej-Lavanya Tripathi Wedding Photos: వేద‌మంత్రాల సాక్షిగా ఒక్కటైన వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి.. ఫొటోలు వైరల్

సీఎం జగన్‌ ఆర్థిక నేరాభియోగ కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలి

జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాభియోగ కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కోర్టు నెంబర్ మూడు లో జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ ముందుకు శుక్రవారం ఐటమ్ నెంబర్ 1 గా వచ్చింది. పిటీషన్ విచారించిన న్యాయస్థానం సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ, జనవరికి కేసు వాయిదా వేశారు. జగన్మోహన్ రెడ్డి పై మోపబడిన 11 ఛార్జ్ షీట్లలలో విచారణకు హాజరు కాకుండా 3071 సార్లు వాయిదా కోరగా, సీబీఐ అభ్యంతరం చెప్పలేదు గానీ కోర్టు అభ్యంతరం తెలిపిందన్నారు. ఒక వ్యక్తి 71 సార్లు వాయిదా కోరితేనే సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. మరొకసారి వాయిదా అడిగితే, బెయిల్ రద్దు చేసి జైలు లో వేయాలని ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి గత పదేళ్లుగా బెయిల్‌పై ఉంటూ, కోర్టుకు హాజరు కాకపోవడాన్ని చూస్తుంటే.. న్యాయస్థానాలలో అందరికీ న్యాయం ఒకేలా ఉండటం లేదన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒకలా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మరొక రకంగా ఉండడం సముచితం కాదన్నారు. దీనివల్ల న్యాయవ్యవస్థ పై ప్రజలకు అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉందనే సదుద్దేశంతోనే పిటిషన్ దాఖలు చేశానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

Also Read: YCP Samajika Sadhikara Yatra: ‘వైసీపీ సాధికార యాత్రలో న్యాయం లేదు..’ జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్