తెలుగు సినిమాకిదేం తెగులు..? చంద్రబాబు అరెస్టుపై అచేతనం..
తెలుగు సినిమా హీరోలు తెరపై పేరుకే హీరోలా..? తెరవెనుక అచేతనులా..? వారి విన్యాసాలన్నీ తెరకే పరిమితమా..? వాస్తవ ప్రపంచంలో మాత్రం సాధారణ పౌరుల కంటే అచేతనులా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అడ్డగోలుగా టికెట్ల ధరలు తగ్గిస్తే అగ్ర హీరోలు, దిగ్గజ దర్శక-నిర్మాతలు పొలోమంటూ వెళ్లి చేతులు కట్టుకుని నిలబడతారు.. పరిశ్రమ బాగుకు కనీసం పదిపైసలు ఇవ్వని వారి దగ్గరా సాగిలపడతారు.. కష్టపడి పైకి వచ్చినవారు కూడా.. తమ హోదాను మరిచి హుందాతనాన్ని వీడి.. పాలకులను వేడుకుంటారు. ఏదైతే అదయింది.. దీటుగా ఎదుర్కొందామనే ధోరణిని వీడి.. శరణం ప్రభూ అనేలా వ్యవహరించడం సినీ అభిమానులందరినీ కలచివేస్తోంది.
కళ గురించి నాయకులకేం తెలుసు..?
సినిమా అనేది అద్భుతమైన కళ. ఒక వ్యక్తి లేదా ఒక సమాజం గమనాన్ని ఊహించుకుని దానికి సమాంతరంగా ఊహా ప్రయాణం సాగిస్తూ సినిమాను తెరకెక్కించడం అంటే అది ఎంతటి గొప్ప కళనో తెలుసుకోచ్చు. ఒక సినిమా నిర్మాణం వెనుక వేలాది కుటుంబాల శ్రమ ఉంటుంది. ఏడాదికి ఓ 150 సినిమాలు విడుదలైతే అందులో హిట్ లు నాలుగో ఐదో. మిగతావాటిలో సాదాసీదాగా ఆడేవి పది పోగా అన్నీ లాభాలు రానివే. అందుకే అత్యంత సున్నితమైన కళగా సినిమాను పేర్కొంటారు. అలాంటి కళ విలువ అర్థమైనది కొందరు రాజకీయ నాయకులకే.
నాడు అహోఓహో అని కీర్తించి..
ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. విభజిత ఏపీలో కాని సినిమా పరిశ్రమకు పెద్దపీట వేసింది, గౌరవం ఇచ్చింది తెలుగు దేశం ప్రభుత్వమే. కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ గౌరవం, విలువ దక్కినా అది సీఎంల తీరును బట్టి ఉండేది. అయితే, టీడీపీ సహజంగానే నట రత్న నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ కావడంతో సినిమా రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇదే ఒరవడిని కొనసాగించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు అధికారంలో ఉండగా.. అహో ఒహో అని కీర్తించిన సినీ పరిశ్రమ వర్గాలు ఇప్పుడతాయన అక్రమ కేసులో జైలు పాలైతే కిమ్మనడం లేదు. కనీసం సానుభూతి కూడా చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
అక్రమ అరెస్టుపై నోరెత్తరా?
తెలుగు సినిమ పరిశ్రమ అచేతన స్థితిలో ఉందా..? కనీసం చంద్రబాబు అక్రమ అరెస్టుపై స్పందించలేని స్థితిలో ఉందా? బాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దర్శనానికి అర్రులు చాచిన బడా నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు మొహం చాటేశారా?? అంటే ఔననే చెప్పాల్సి వస్తోంది. సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ సభలకు చంద్రబాబు వస్తేనే పులకించి పోయిన వారు ఇప్పుడు కనీసం పలకరించడం లేదేమని ప్రశ్నిస్తున్నారు. విభజిత ఏపీలో బాబు సీఎం కాగానే .. స్టూడియోలు కడతాం అంటూ క్యూ కట్టిన నిర్మాతలు నేడు చేతులు ముడుచుకు కూర్చోవడాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
టెకీలు, ప్రవాసులకున్నంత విశ్వాసమూ లేదా?
సైబరాబాద్ నిర్మించి ఉపాధి కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్న టెకీలు.. దేశం కాని దేశంలో స్థిరపడి చంద్రబాబు చేసిన మేలును గుర్తుకుతెచ్చుకుంటున్న ప్రవాసులు.. వారికి ఉన్న విశ్వాసమైనా తెలుగు సినీ పరిశ్రమ వారికి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టెకీలు, ప్రవాసులను చూసి సిగ్గు తెచ్చుకోవాలన్న సూచన వస్తోంది.
లబ్ధి పొంది.. మౌనంగా ఉంటారా?
నిక్కచ్చి మనిషి అని చెప్పుకొనే ఒక మాజీ ప్రజాప్రతినిధి, ఓ బడా నిర్మాత పెద్ద కేసులో ఇరుక్కుంటే కాపాడింది చంద్రబాబు కాదా? అని తాజా పరిణామాలను దగ్గరగా చూస్తున్నవారు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలుగు సినీ పరిశ్రమ ఇలా విరాజిల్లుతోంది అంటే అది చంద్రబాబు కృషి కాదా? అని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు విజనరీని పసిగట్టి గ్రేటర్ అవుతల ఫాంహౌస్ లు కట్టుకున్న వారు ఇప్పుడెందుకు బయటకు రావడం లేదనే డిమాండ్ వస్తోంది. చంద్రబాబు విజనరీతో వేలల్లో ఎకరాలు కొని కోట్లలో లబ్ధి పొందినవారి నోరు మూగబోయిందా? అనే ప్రశ్న వస్తోంది.
పొరుగు సినీ పరిశ్రమ వారు స్పందిస్తున్నా..?
‘‘అన్నం తినే ఓ సినీ ప్రముఖుల్లారా.. మీది నిజంగా ఓ బతుకే అయితే ఆ పెద్దాయన పరిస్థితి పై ఆలోచన చేయండి.. నినదించండి..’’ అంటూ ప్రజలు కోరుతున్నారు. వాస్తవానికి చంద్రబాబుకు బాసటగా సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నోరు మెదిపారు. ఆ మాత్రం సోయి కూడా తెలుగు సినీ పెద్దలకు లేకపోయింది. నిర్మాతల్లో అశ్వనీదత్, దర్శకుల్లో రాఘవేంద్రరావు మాత్రమే బాబుకు బాసటగా నిలిచారు. మరి మిగతావారికి ఏమైంది..? ఆస్తులు పోతాయనా? అంతస్తులు కూలతయనా? భయమెందుకు?
పవన్ ను చూసి పోరాటం నేర్చుకోండి..
2019 ఎన్నికల్లో దారుణ పరాజయం.. నాలుగున్నరేళ్లుగా అనేక విమర్శలు.. వ్యక్తిగతంగా దూషణలు.. ఆఖరికి ఏకైక ఆదాయ వనరు అయిన ‘సినిమా’ విడుదలలోనూ అడ్డంకులు.. నీచ ప్రయత్నాలు.. కానీ వీటిని తట్టుకుంటూ ముందుకు సాగారు జన సేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. సినిమాల్ని ఆపుకొంటారా? ఆపుకోండి. అసలు ‘‘మనల్నెవడ్రా ఆపేది?’’ అని. అలాంటాయనే చంద్రబాబును జైల్లో నేరుగా కలిసి మద్దతు ప్రకటించారు. ఈ మాత్రం ధైర్యం కూడా సినీ పరిశ్రమకు లేదంటే అది పిరికితనం కాదు.. పచ్చి అవకాశ వాదం.
