నిందితుడి నుంచి నియంత వరకూ..

కక్ష సాధింపు రాజకీయాలకు తెరలేపిన ముఖ్యమంత్రిగా ఖ్యాతి! నాడు అలా.. నేడు ఇలా..

Share this :

యుద్ధంలో విజయమో.. వీర స్వర్గమో అన్నట్లు వీరోచితంగా పోరాడే వాడే రాజు. గెలిచిన తర్వాత ప్రజలందరినీ నా వాళ్లు అనుకుని సౌమ్యంగా, ఆప్యాయంగా పాలించేవాడే రాజు. అహాన్ని, పగను, ప్రతీకారాన్ని దరిదాపులకు కూడా రానివ్వని వాడే రాజు. మాటతప్పని, మడమతిప్పని వాడే నాయకుడిగా చిరకాలం వర్థిల్లుతాడు. కానీ ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారం చేపట్టిన ఏపీ సీఎం జగన్ తీరు మరోలా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తొలినాళ్లలో ప్రేమను, ఆప్యాయతను ప్రదర్శించి మీ కోసమే నా పోరాటం అని ప్రజలను నమ్మించి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తన పగ, ప్రతీకారాన్ని తీర్చుకోవడానికే సీఎం పీఠం అధిష్టించినట్లు వ్యవహరిస్తున్నారనేది ప్రతిపక్షాల వాదన. ముఖ్యమంత్రిగా గెలిచిన మరుసటి రోజు నుంచే ప్రతీకార కాంక్షతో రగిలిపోతున్నట్లు ఏపీ సీఎం జగన్ చేస్తున్న పనులు ఉన్నాయంటున్నారు.

ప్రజా వేదిక కూల్చివేత నుంచి చంద్రబాబు అరెస్టు వరకూ ప్రతి దశలోనూ జగన్‌ను నడిపించింది పగ, ప్రతీకారమేనని, తానొక తిరుగులేని రారాజుగా, వ్యవస్థలకు, ప్రజాస్వామ్యానికి అతీతుడిగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షనేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా అన్నట్లు తనకు గిట్టని వారిని.. తనకు పట్టనివారిని.. పోలీసులతో వెంటాడి వేధిస్తున్నారని అంటున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే జడ్జీలను మొదలుకుని, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు.. ఇలా ఏ ఒక్కరిని వదిలి పెట్టడం లేదంటున్నారు. సుప్రీం కోర్టు చీప్ జస్టీస్‌గా చేసి పదవీ విరమణ పొందిన జడ్జీని సైతం వదలక పోవడమే అందుకు నిదర్శనంగా ఎత్తి చూపుతున్నారు. సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎల్వీ సుబ్రమణ్యం లాంటి సీనియర్ ఐఏఎస్ లను, సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు, ఉద్యోగ సంఘం నాయకుడు సూర్యనారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వ్యవస్థను, ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులను ఇబ్బంది పెడుతూనే వస్తున్నారని అంటున్నారు.

ప్రజా సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే విషయంలో సర్వాధికారాలు సీఎం జగన్‌కు ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అయితే తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి స్థాయిలో కక్ష సాధింపు తీరునే కనబరచడం చూస్తుంటే తనకు ఎదురు చెప్పే వారే ఉండకూడదన్న నియంత ధోరణి కనిపిస్తోందంటున్నాయి ప్రతిపక్షాలు. అవసరాలకు మించి పోలీసు వ్యవస్థను వాడుకున్న ఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా అదే చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తండ్రి మరణంతో అంతులేని అవినీతి ఆరోపణలు రావడం, కేసులు, జైలుకు కూడా వెళ్లివచ్చారు. కాంగ్రెస్‌ను కాదని తాను పార్టీ పెట్టే నాటికే ఆయనొక నిందితుడు. ప్రస్తుతం నియంతలా మారాడు. నిందితుడి నుంచి నియంత వరకూ జగన్ చేసిన ప్రయాణం అంతా డ్రామాలు, అబద్దాలు, కుట్రలు, కుతంత్రాలేనని విమర్శలు వస్తున్నాయి. రాజధానిని మార్చే ప్రసక్తే లేదు. ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాను.. అని ఎన్నికల ముందు నమ్మించిన జగన్.. పోలవరం పూర్తి చేసే బాధ్యత నాదే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకురాకపోతే నేను మీ బిడ్డనే కాదని శపదాలు పలికిన జగన్.. రత్నాల్లాంటి పథకాలను ప్రజలకు చూపించి, దారుణంగా వంచించారని పలు పార్టీనేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

కోడి కత్తి కేసును దాచడం ద్వారా తానెంత డ్రామా ఆడాడో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బాబాయి హత్యకు గురైతే.. చివరికి శవంతో కూడా రాజకీయం చేశారని, అదో పెద్ద కుట్ర అని, అందులో అతి పెద్ద కుట్రదారి వారి కుటుంబమేనన్న నిజాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయంటున్నారు. ఇవన్నీ జనాలకు గుర్తు లేక కాదని, కేవలం అధికారంలో ఉన్నారన్న కారణంతో అతి కొద్ది మంది లీడర్లు తనకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే తప్ప.. చాలా మంది వైపీసీ నేతలు బయటకు రావడానికి సిద్దంగా ఉన్నారని ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బయటకు వచ్చారని గుర్తు చేస్తున్నారు.

‘శత్రువును బంధించి యుద్దానికి రమ్మని సవాల్ విసరడం వీరోచితం కాదు’. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నిజంగానే నిధులు తప్పుదోవ పట్టిఉంటే.. అది ప్రభుత్వం గుర్తించి ఉంటే.. కేసు పెట్టడం పెద్ద వింతేమీ కాదు. కానీ జైల్లో బంధించిన చంద్రబాబును ఇక బయటకు రాకుండా చేయడం కోసం పావులు కదపడం, తప్పుడు కేసులు బనాయించడం చూస్తుంటే.. జగన్‌ తీరు ఖచ్చితంగా కక్ష్యసాధింపేనని అనుకుంటున్నారంతా! నియంతలు రాజ్యం ఏలవచ్చునేమో కానీ.. అలా నిర్మించిన రాజ్యం ఎక్కువ కాలం నిలవదనేది చరిత్ర చెప్పే పాఠం. ఇక పతనమే సరైన పరిష్కారం. రాబోయే ఎన్నికల్లో అదే జరగబోతుందని ప్రతిపక్షాలు జ్యోష్యం చెబుతున్నాయి.