నారా లోకేష్ అరెస్టు అయితే.. జరిగేది ఇదే!

లోకేష్‌ అరెస్ట్‌కు పావులు కదుపుతోన్న ఏపీ సర్కార్.. టీడీపీ వ్యూహం ఏంటంటే..

Share this :

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లే ఆయన తనయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను A14గా చేర్చుతూ CID అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో కూడా లోకేష్ నిందితుడిగా ఉన్నారు. వీటికి తోడు యువగళం పాదయాత్రలో లోకేష్ మీద మరికొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో ముందస్తు బెయిల్‌కు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తే, వరస అరెస్టులతో తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో కురుకుపోయే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నందమూరి బాలకృష్ణలను తెరమీదకి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఆయన మీద వరుస కేసులను నమోదు చేస్తున్నారు. మూడు, నాలుగు నెలల పాటు చంద్రబాబును జైల్లోనే ఉంచాలి అన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పాత కేసులను తిరగతోడుతున్నారు. కేసులతో చంద్రబాబు నాయుడును ఇరికించి ఆయనను ఎన్నికల వరకు వెలుపలకు రాకుండా చూడాలనే వ్యూహరచనలో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారు.

చంద్రబాబు అరెస్టు కావడంతో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. పార్టీలో దిశా నిర్దేశం చేయగలిగే నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ద్వితీయ స్థాయి నాయకత్వం ఎదగకుండా చర్యలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 అంటూ ఎవరూ లేరు. ఒకవేళ ఉంటే అది ఆయన కుమారుడు లోకేష్ మాత్రమే. లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజల్లో మమేకమవుతున్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ఆయనకు అనేక అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అనేక గుణపాఠాలు నేర్చుకొని ఒక నాయకుడిగా రాటుతేలుతున్నారు. ముద్దపప్పు అన్న ప్రచారం నుంచి లోకేష్ క్రమంగా బయటపడుతున్నారు. పరిణితి గలిగిన ఒక రాజకీయ నాయకుడిగా తయారవుతున్నారు. పాదయాత్రలో ఎక్కడ సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అన్ని వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని, ఎక్కడికక్కడ హామీలను ఇస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్‌కు భారీ ఆదరణ లభించడంతో పార్టీలో నంబర్ 2గా నారా లోకేష్ ఎదుగుతున్నారు.

ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్ కూడా తొందరలోనే అరెస్టు చేస్తారని వైసీపీ శ్రేణులు విసృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ కూడా సీఐడీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నారా లోకేష్ హస్తినలో ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులను కలిసి మద్దతు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రాగానే అరెస్టు తప్పదని పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. లోకేష్ అరెస్ట్‌కు తెలుగుదేశం పార్టీ నాయకులు మానసికంగా సిద్ధమయ్యారు.

నారా లోకేష్ అరెస్టు చేస్తే పార్టీని ముందుండి నడిపే నేత కోసం అన్వేషణ సాగుతోంది. ఇటీవల మొట్టమొదటిసారిగా నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమై బాబు అరెస్టు తరువాత తాజా పరిస్థితులపై చర్చలు జరిపారు. అనంతరం ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నందమూరి తారక రామారావు మనవరాలు, నందమూరి బాలకృష్ణ కుమార్తె, నారా చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ప్రభుత్య వైఖరిని ఎండగడుతున్నారు. బ్రాహ్మణి సూటిగా, నిశితంగా విమర్శలు చేస్తున్నారు. ఎక్కడా తడుముకోకుండా చేస్తున్న వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. లోకేష్ అరెస్ట్ అయితే ఒకవైపు నారా బ్రాహ్మణి, మరోవైపు నందమూరి బాలకృష్ణ, మరోవైపు నారా భువనేశ్వరి బాధ్యతలు తీసుకొని రాష్ట్రం మొత్తం పర్యటించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం శ్రేణులకు తాను అండగా ఉంటానని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.

చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక లోకేష్ కూడా అరెస్టు అయితే యువగళం పాదయాత్రకు పుల్‌స్టాప్ పడే అవకాశం ఉంది. కావున జగన్ జైలుకు వెళ్ళినప్పుడు ఆయన సోదరి షర్మిల పాదయాత్రను పూర్తి చేసిన విధంగా, తెలుగుదేశం పార్టీలో కూడా నారా బ్రాహ్మణి పాదయాత్రను పూర్తిచేసే అవకాశం ఉందని ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నేత అన్నయపాత్రుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై పార్టీలో వాడి వేడి చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీని ఈ సంక్షోభం నుంచి రక్షించుకోవడానికి నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణలు ప్రజల వద్దకు వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వ అవినీతి అక్రమాలను వివరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే తేదేపాకు సానుభూతి వెల్లువెత్తే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో తెదేపా విజయానికి ఈ సానుభూతి బాగా ఉపయోగపడుతుంది. భువనేశ్వరి, బ్రాహ్మణిలను జగన్ మీద ప్రయోగించడానికి తెదేపా నాయకులు ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. లోకేష్ అరెస్టు కాగానే భువనేశ్వరి, బ్రాహ్మణిలు ప్రజల్లోకి వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు.