Actor Chandra Mohan Passes Away హైదరాబాద్, నవంబర్ 11: ‘జుమ్మంది నాదం..’ పాటకు తన నటనతో ప్రాణం పోసిన ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ (82) (Chandra Mohan) ఇకలేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శనివారం (నవంబరు 11) తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్ పార్థివదేహాన్ని (Actor Chandra Mohan Passes away) ఆసుపత్రి నుంచి ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. కాగా చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలున్నారు.
అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె మధుర మీనాక్షి వచ్చాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు కృష్ణప్రసాద్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత నాలుగేళ్ల నుంచి చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం 8 గంటలకు అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 9.45 గంటలకు చంద్రమోహన్ (Actor Chandra Mohan) మృతి చెండినట్లు ఆయన మేనల్లుగు కృష్ణప్రసాద్ మీడియాకు తెలిపారు.
చదవండి: YSRCP Diwali Shopping Bag: చెప్పేస్తే పోలా… ఎన్నాళ్ళీ ముసుగులో గుద్దులాట!
నటుడు చంద్రమోహన్ స్వస్థలం కృష్ణా జిల్లా పమిడిముక్కల. 1943 మే 23న చంద్రమోహన్ జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన సినిమాలపై మక్కువతో 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. తెలుగుతోపాటు తమిళ సినిమాలోనూ పలు సినిమాల్లో ఆయన నటించారు.

ఇలా ఆయన‘ఆత్మీయులు’, ‘తల్లిదండ్రులు’, ‘సంబరాల రాంబాబు’, ‘జీవన తరంగాలు’, ‘గంగామంగా’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘సిరి సిరి మువ్వ’, ‘సీతా కల్యాణం’, ‘శుభోదయం’, ‘పక్కింటి అమ్మాయి’, ‘రాధా కల్యాణం’, ‘ఇంటి గుట్టు’, ‘సువర్ణ సుందరి’, ‘ఆఖరి పోరాటం’ ‘ఆదిత్య 369’, ‘పెద్దరికం’, ‘గులాబి’, ‘చంద్రలేఖ’, ‘ఇద్దరు మిత్రులు’, ‘7జీ బృందావన్ కాలనీ’, ‘ఢీ’, ‘కింగ్’, ‘లౌఖ్యం’ వంటి చిత్రా (movies)ల్లో ఆయన నటించారు. హీరోగానే కాకుండా కమెడియన్, సహాయనటుడిగానూ విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన మరణం తీరనిశోకాన్ని మిగిల్చింది.
సినిమాల్లో ఆయన ప్రతిభకుగానూ ఫిలింఫేర్, నంది అవార్డులు కూడా అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు, ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా చంద్రమోహన్ నంది అవార్డు అందుకున్నారు. ఆయన చివరగా 2017లో వచ్చిన ‘ఆక్సిజన్’ సినిమాలో నటించారు.
మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.

Comments are closed.