Fake TCs in Railways: ‘నల్ల కోటు ఇచ్చి రైలెక్కిస్తే నమ్మేశారట..’ అడ్డగోలుగా ప్రయాణికులను దోచుకుంటున్న ముఠా గుట్టురట్టు

ముగ్గురు నకిలీ టీసీలు అరెస్ట్‌

Share this :

Fake TCs in Railways గుంటూరు, నవంబర్‌ 30: కోటు వేసుకున్నారు.. టిప్ టాప్‌గా రెడీ అయ్యారు. భుజానికి బ్యాగ్ తగిలించుకున్నారు. రైల్వే స్టేషన్ల (Railway Station)లో ప్రయాణికులకు తారసపడుతున్నారు. అక్కడక్కడ ప్రయాణీకుల వద్ద టికెట్ ఉందో లేదో చెక్ చేస్తున్నారు. టికెట్ లేని ప్రయాణీకులకు ఫైన్ కూడా వేస్తున్నారు. అయితే వీరి హాడావుడి చూసి అనుమానం వచ్చిన వ్యక్తులు నిలదీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. చివరికి రైల్వే పోలీసులు (Railway Police) వారిని (Fake TCs in Railways) అరెస్ట్ చేశారు.

బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన సాయి అనే వ్యక్తి గత కొంతకాలంగా తెనాలిలో ఉంటున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జి గణేష్, కల్యాణ్, ప్రవీణ్‌లు ఉద్యోగాలు కావాలంటూ సాయి వద్దకు వచ్చారు. దీంతో ఒక్కొక్కరి వద్ద లక్షల రూపాయల నగదు తీసుకొని వారికి రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని సాయి చెప్పాడు. వారివద్ద నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత వారికి రైల్వేలో టీజీ (Railway TC Job) ఉద్యోగాలు వచ్చాయని చెప్పాడు. అంతటితో ఆగలేదు. వారికి ఐడీ కార్డులు ఇచ్చాడు. ఫైన్‌లు రాసే రశీదు బుక్స్ కూడా చేతికందించాడు. శిక్షణలో భాగంగా ప్రతి రోజు విజయవాడ నుంచి ఒంగోలు వరకూ వివిధ రైళ్లలో ప్రయాణిస్తున్న టికెట్ లేని ప్రయాణీకులు వద్ద నుంచి ఫైన్‌లు వసూలు చేయాలని చెప్పాడు. ఇదంతా శిక్షణలో భాగమని ఆ తర్వాత అసలైన పోస్టులు వస్తాయని చెప్పాడు.

చదవండి: Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌.. 63.94 శాతం పోలింగ్‌ నమోదు

దీంతో ఆ ముగ్గురు ప్రతి రోజు రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణీకుల వద్ద నుంచి ఫైన్స్ వసూలు చేస్తున్నారు. సాయంత్రానికి తెనాలి వచ్చి అక్కడ సాయికి వచ్చిన డబ్బులు అప్పగించేవారు. ఈ దందా గత కొంతకాలంగా సాగుతుంది. అయితే రెండు రోజుల క్రితం చీరాలలో ఫైన్స్ రాస్తున్న గణేష్‌ను… టీటీఈ రాజేష్ గమనించాడు. వెంటనే అతని వద్దకు వెళ్లి ఐడీ అడిగాడు. అయితే గణేష్ ఇచ్చిన ఐడిపై అనుమానం రావడంతోనే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. గణేష్‌ను విచారించగా తనతో పాటు మరో ఇద్దరూ కూడా ఉన్నారని చెప్పగా వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే తమకి సాయి అనే వ్యక్తి ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. దీంతో సాయి కోసం రైల్వే పోలీసులు గాలింపు చేపట్టారు. దర్యాప్తు కొనసాగుతుండగానే వీరి ముగ్గురు చెబుతున్న అంశాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాయి టీసీ ఉద్యోగాలు ఇచ్చాడంటే నమ్మి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తారన్న ప్రశ్న వ్యక్తం అవుతుంది. ఇదంతా ఒక ముఠా పనే అయి ఉండవచ్చనే అంటున్నారు. అయితే పోలీసులకు దొరికిన వీరు ముగ్గురు మైనర్లు కావడంతో రైల్వే పోలీసులు ఆశ్చర్య పోతున్నారు. సాయి దొరికితే గాని పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని రైల్వే పోలీసులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.