హైదరాబాద్, డిసెంబర్ 6: తెలంగాణ (Telangana) రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే (Kodangal MLA) ఎనుముల రేవంత్‌రెడ్డిని (A Revanth Reddy) ఏఐసీసీ (AICC) అధికారికంగా ప్రకటించింది. దీంతో సీఎం అభ్యర్ధి ఎవరనే విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లైంది. బరిలో నిలిచిన సీఎల్పీ మాజీ నేత భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka), పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)లను అగ్రనేతలు సముదాయించారు. ప్రభుత్వంలో ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో పెద్దగా అవరోదాలు లేకుండానే కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి పదవి (Telangana chief minister Post) విషయంలో రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసింది.
ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 5) సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ (Congress) అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ ఈ నెల 7వ తేదీ గురువారం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో కార్యక్రమానికి హైదరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రేవంత్ సహా 9 లేదా 18 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు మంత్రివర్గ కూర్పుపై అగ్రనేతలతో చర్చించేందుకు రేవంత్ మంగళవారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. డీకే శివకుమార్, మాణికం ఠాగూర్లతో భేటీ అయ్యారు. ఇక బుధవారం ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.

అభిప్రాయ సేకరణ అనంతరం సీఎం అభ్యర్ధి ప్రకటన
ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు, సీనియర్ల అభిప్రాయాలతో పార్టీ పరిశీలకులు అధిష్ఠానానికి నివేదిక సమర్పించారు. దీనిపై మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, ఠాక్రే సమావేశమయ్యారు. శాసనసభ్యుల అభిప్రాయాలు, ఇతర అంశాలపై కూలంకషంగా చర్చించిన అగ్రనాయకులు చివరకు రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా నిర్ణయించారు. దీంతో మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
చదవండి: Actress Thulasi Nair: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
తూటాల్లాంటి మాటలు, ముక్కు సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుండే ప్రసంగాలు కాంగ్రెస్‌లో అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పదవిని ఎనుముల రేవంత్‌రెడ్డి అందుకోగలిగారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో నవంబరు 08, 1969 సంవత్సరంలో రేవంత్‌రెడ్డి జన్మించారు. రేవంత్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి అప్పట్లో గ్రామానికి పోలీస్ పటేల్‌గా వ్యవహరించేవారు. తల్లి రామచంద్రమ్మ గృహిణి. వీరిది వ్యవసాయ కుటుంబం. రేవంత్ హైస్కూల్ విద్య వనపర్తిలోని జడ్పీ బాలుర పాఠశాలలో కొనసాగింది. 1983-1985లో వనపర్తిలోనే ఇంటర్ బైపీసీ చదువుకున్నారు. ఏబీవీపీలో రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1992 నుంచి చురుకైన కార్యకర్తగా పనిచేసేవారు. 2004లో కొంతకాలం బీఆర్ఎస్లో పనిచేశారు. 2009లో కొడంగల్ నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి రాజకీయ కురువృద్ధుడు గుర్నాథ్‌రెడ్డిని ఓడించారు. అప్పట్లో రేవంత్ గెలుపు చర్చనీయాంశమైంది.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడు పద్మనాభరెడ్డి కుమార్తె గీతను ఆయన ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నైమిషా రెడ్డి సంతానం. 2014లో కొడంగల్ నుంచే టీడీపీ అభ్యర్థిగా మరోమారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 2017లో తెలుగుదేశాన్ని వీడారు. అదే ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన స్వల్ప కాలంలోనే 2018లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌లో బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి బరిలో దిగి విజయం సొంతం చేసుకున్నారు. లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతూనే.. రాష్ట్ర పార్టీలో ప్రత్యేకత చాటుకుంటూ వచ్చారు. అధిష్ఠానం అభిమానం చూరగొని 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జులై 7న బాధ్యతలను స్వీకరించారు.
2023 ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ఏడాదిన్నర ముందునుంచే ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. బీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలో 21 రోజుల పాటు సాగిన రాహుల్ గాంధీ జోడోయాత్రను విజయవంతం చేయడం ఆయన రాజకీయంగా ఎదగడంలో దోహదం చేసింది. తాజా ఎన్నికల్లో (2023) పార్టీకి సారథ్యం వహించిన ఆయన.. 64 మంది అభ్యర్థులు గెలవడంతో అధికారాన్ని దక్కించుకున్నారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
