సామాజిక సేవలో ఎవ్వరికీ తీసిపోడు. ఆపదలో ఉన్నాను అంటే చేయందించడంలోనూ అందరికంటే ముందే ఉంటాడు. ప్రజా ప్రతినిధిగా తన నియోజకవర్గ ప్రజలకు బాసటగానూ ఉన్నాడు. ఆయనకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరైనా ఆయనకు సమానమే. సమాదరించడమే ఆయన నైజం. ఇదంతా ప్రవృత్తి. ఇక వృత్తిలోనూ అమేయ నట వైదుష్యాన్ని ప్రదర్శించగల దిట్ట. వందకు పైగా సినిమాలలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న ఘనుడు. కళారాధనే దైవారాధనగా భావించే కుటుంబ నేపధ్యం. సొంతంగా సినిమాలనూ నిర్మించాడు. స్టూడియోలనూ నిర్వహించాడు. కానీ.. ఎప్పుడూ ఏ అవార్డునూ ఆయన కోరుకోలేదు. ఇది కావాలని ఆశించనూ లేదు.. ఎవరినీ యాచించనూ లేదు. కానీ ప్రతిభకు పట్టం కట్టాల్సిన వారు.. గుర్తించాల్సిన వారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్న. ఇదే ఇప్పుడు ఆయన అభిమాన జనాన్ని పార్టీలకు అతీతంగా వేధిస్తున్న అతి పెద్ద సందేహం.
Also Read : RRR రచ్చబండ: సిద్ధం సభ ఖర్చు ఎవరిది? ప్రభుత్వానిదా?… పార్టీదా?
కళాకారులను, కళారాధకులను, కళా ప్రోత్సాహకులను ఎన్నో సంస్ధలు పురస్కారాలతో సన్మానిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ప్రతి ఏడాది ప్రద్మశ్రీలతో గౌరవ పురస్కారాలను అందజేస్తూ వస్తోంది. అయితే ఎంత మందికి నిజమైన గౌరవం లభిస్తోంది..? ఎంత మందిని ప్రభుత్వం గుర్తించి సన్మానిస్తోంది. దీనికి ఏఏ ప్రామాణికాలను పరిగణలోకి తీసుకుంటున్నారు అన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా పద్మశ్రీ అవార్డుల ప్రకటనపై అనేక రకాల విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పలుకుబడితోనే పురస్కారాలు లభిస్తున్నాయన్న అపవాదులు ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి వంశానిది చెరిగి పోని ప్రతిష్ట. ఓ పెద్ద అధ్యాయం. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఘనతను సాధించిన నటుడు వారి కుటుంబంలో నందమూరి బాలకృష్ణే. బాలనటునిగా సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటి వరకు దాదాపు 110 చిత్రాలలో విభిన్న పాత్రలను పోషించాడు. తండ్రి అంశను పుణికి పుచ్చుకున్న నటునిగా పౌరాణిక పాత్రలనూ సమర్ధవంతంగా పోషించాడు. రాముడు, కృష్ణుడు, అర్జునుడు ఇలా ఎన్నో పాత్రల్లో నటించి ఆశేష జనాన్ని మెప్పించాడు. తనకంటూ ఓ స్ధాయిని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే నిర్మాణ విషయంలో, స్టూడియోల నిర్వహణలోనూ ఆయనకు ఎంతో ప్రవేశం ఉంది. ఇదంతా ఓ పార్శ్వం.
Also Read : యూట్యూబ్ ఫ్రాంచైజీ పేరుతో రూ. 3 కోట్లు వసూలు..పరారీ
మరోకోణంలో చూస్తే .. బాలకృష్ణది చాలా జాలిగుండె. తల్లి పేరిట ఏర్పాటు చేసిన బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి వైద్య సేవలను అందు బాటులోకి తెచ్చారు. పేద వారికి వైద్యాన్ని సరసంగా అందిస్తున్నారు. ఇక ప్రజా ప్రతినిధిగా కూడా తనదైన ముద్ర వేసుకున్న నటుడు బాలకృష్ణ. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. తన నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. చేస్తున్నాడు కూడా. ఇప్పటి వరకు రెండుసార్లు ఆయనను అక్కడి వారు గెలిపించుకున్నారు. పైకి అమిత కోపిష్టిగా కనిపించినా.. చాలా మెతక స్వభావి బాలకృష్ణ. ఎవరు ఏది అడిగినా కాదనని స్వభావం. కానీ.. ఆయన సేవాగుణానికి కానీ.. నటనా వైదుష్యానికి కానీ ఇప్పటి వరకు పద్మశ్రీ లభించక పోవడం దురదృష్టకరం. ఎవరినీ ఏదీ ఆశించని.. యాచించని వ్యక్తి ఆయన. ఎవరైనా ప్రతిభను గుర్తించి పురస్కారాన్ని ఇవ్వాలే గానీ.. అడిగి.. ఒత్తిడి పెంచి తీసుకోకూడదన్నది ఆయన సూత్రం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కోరితే ఏ పురస్కారాన్ని అయినా సులభం తీసుకోగల సమర్ధత ఉంది. అంతటి పలుకుబడి.. ప్రభావం చూపగల వ్యక్తి. కానీ.. ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వాలు మాత్రం ఎవరెవరికో అందిస్తున్న అవార్డు .. బాలకృష్ణ వరకు రాకపోవడం నిజంగా దురదృష్టమే. కళామతల్లికి జరుగుతున్న అన్యాయమే.
Also Read : RRR Formula: గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్?
ఇక ఓసారి పూర్వాపరాలు పరిశీలన చేస్తే.. 1965లో చిత్తూరు వి. నాగయ్యతో తెలుగు సినీ పరిశ్రమలో పద్మశ్రీలను అందుకోవడం ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య, భానుమతికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. వారి తర్వాతనే నందమూరి తారక రామారావును పద్మశ్రీ వరించింది. అంటే పురస్కారాల ప్రదానం ఎంత పారదర్శకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆయన తర్వాతనే శివాజీగణేశన్, వైజయంతీమాల, ఘంటశాల, జెమినీ గణేశన్, బాలచందర్, మోహన్ బాబు పద్మశ్రీలను అందుకున్నారు. అయితే నటనలో పరకాయ ప్రవేశం చేసి .. ఆయా పాత్రలను రక్తికట్టించిన ఘనులు సామర్లకోట వెంకట రంగారావు (ఎస్వీ రంగారావు), మహానటి సావిత్రి, కన్నాంబ, కైకాల సత్యనారాయణ లాంటి మేటి ఘనులకు ఎలాంటి పురస్కారాలు లభించక పోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టనిదే. వారంతా 500 పై చిలుకు సినిమాలలో నటించిన వారే. తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆరాధించే వాళ్ళే. కానీ.. వారికి దక్కిన గౌరవం ఏంటి..? వారు ఎప్పుడూ ఎవరి ప్రాపకాన్ని కోరుకోలేదు. ఎవరినీ నాకిది కావాలని అడగనూ లేదు. ఏ ప్రభుత్వాలపై వత్తిడి తీసుకురానూ లేదు. అందుకే వారంతా పద్మాలు దక్కని మహా నటులుగానే మిగిలి పోయారు. ఇప్పుడు బాలకృష్ణ పరిస్ధితి కూడా అదే.
