(మస్తాన్ . గగ్గుటూరి, రాయచోటి. అన్నమయ్య జిల్లా)
ఒక్కో నాయకుడు నాలుగు సార్లు గెలిచినా అమాత్య పదవి దక్కని వైనం..!
కనీసం ఈ సారైనా నియోజకవర్గానికి మంత్రి పదవి లభించేనా ?
కడప జిల్లా… దేశ రాజకీయ చిత్రపటంలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన జిల్లా. ఈ జిల్లాలో ఓ నియోజకవర్గం సైతం దేశ ఎన్నికల సంస్కరణల్లో కీలక మార్పులు తెచ్చింది. రాజకీయాల్లో పలు మార్పులకు కారణమైన ఈ నియోజకవర్గానికి నేటికీ అమాత్య పదవి దక్కలేదంటే ఆశ్చర్యం కలిగిస్తోంది కదా! ఇంతకూ ఎందుకు ఆ నియోజకవర్గానికి మంత్రి పదవి వరించలేదు? పార్టీల అధినాయకత్వాలు ఎందుకు ఆ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాయి? వెనుకబాటుతనంతో కొట్టుమిట్టాడుతున్న నియోజకవర్గ అభివృద్ధికి కోసం మంత్రి పదవి ఈసారైనా దక్కనుందా? అవును మీరు చదువుతున్నది పూర్తి వాస్తవం కథనం. ఇంతకీ ఆ నియోజకవర్గం కథ ఏంటో మీరు ఒకసారి చదవండి.
కడప జిల్లాలో 2009 నాటికి ముందు 11 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం పదకొండు నియోజకవర్గాల్లో 9 నియోజక వర్గాలను మంత్రి పదవులు వరించాయి. మంత్రి పదవులు పొందిన నియోజకవర్గాలు, అభ్యర్థులను ఓసారి పరిశీలిస్తే… కడప అసెంబ్లీకి
ఆంధ్రరాష్ట్రం గా ఉన్నపుడు కడప కోటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అహమ్మదుల్లా, టీడీపీ నుంచి సీ.రామచంద్రయ్య, ఖలీల్ బాషా, వైసిపి నుంచి అమ్జద్ భాష లు మంత్రి పదవులు చేపట్టారు. మైదుకూరు నియోజకవర్గం నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి, జమ్మలమడుగు నుంచి పొన్నపురెడ్డి శివారెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి లు అమాత్య పదవులు అలంకరించారు. పులివెందుల లో వైఎస్ఆర్, వైఎస్ జగన్ లు ముఖ్యమంత్రులు కాగా వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. బద్వేల్ నియోజకవర్గం నుంచి బిజీవేముల వీరారెడ్డి మంత్రి ఐతే కమలాపురం నుంచి ఎం.వీ. మైసూరా రెడ్డి మంత్రి అయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన లో కనుమరుగైన లక్కిరెడ్డిపల్లి నుంచి రెడ్డెప్పగారి రాజగోపాల్ రెడ్డి మంత్రి కాగా రాజంపేట నుంచి బండారు రత్న సభాపతి, పసుపులేటి బ్రహ్మయ్య లు మంత్రులు అయ్యారు. రైల్వేకోడూరు లో తొలిసారి గెలిచిన సోమినేని. సరస్వతి కి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గా చంద్రబాబు అవకాశమిచ్చారు.
ఇక మిగిలిన రెండు నియోజక వర్గాలైన ప్రొద్దుటూరు, రాయచోటి లకు నేటి వరకు మంత్రి పదవి దక్కలేదు.
ప్రొద్దుటూరు ఇప్పటికే వ్యాపార రంగంలో దూసుకు పోతోంది. బంగారు, వస్త్ర రంగాల వ్యాపారాలతో బాగా అభివృద్ధి చెంది రెండో ముంబై గా ప్రసిద్ధి చెందినది. ఇప్పటికీ ఈ నియోజకవర్గాన్ని మంత్రి పదవి వరించలేదు.
ఇక అమాత్య పదవి దక్కని మరో నియోజకవర్గం రాయచోటి. అత్యంత వెనుకబడిన నియోజకవర్గ ప్రాంతం. వ్యవసాయం కోసం పెద్ద ప్రాజెక్టులు గానీ, నిరుద్యోగం రూపుమాపడం కోసం పెద్ద పెద్ద పరిశ్రమలు గానీ లేని ప్రాంతం. తాగేందుకు చుక్క మంచి నీటిని సైతం కొనే దారుణ పరిస్థితులను ఎదుర్కొన్న నియోజకవర్గం. బతుకుదెరువు కోసం పనులు లేక వర్షాలు కురవక… కరువు పరిస్థితులతో ఇతర ప్రాంతాల కు వలస వెళ్ళి దారుణ పరిస్థితులను కళ్ళారా చూసిన ప్రాంతం. గిరిజన యువతులు ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్లి తమ ఒళ్ళు అమ్ముకుని కుటుంబాలను పోషించుకున్న దౌర్భాగ్య స్థితులను మొండి గా ఎదుర్కొన్న నియోజకవర్గం రాయచోటి. గతంలో ఉన్న పలు పార్టీల శాసనసభ్యులు నియోజవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారు. కానీ అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందలేదు. 1952లో ప్రారంభమైన రాయచోటి నియోజకవర్గం ఆరున్నర దశాబ్ద కాలంలో రాయచోటి శాసనసభ్యులకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదు. నాలుగు సార్లు ఎంఎల్ఏ గా పని చేసిన సుగవాసి. పాలకొండరాయుడు అభివృద్ధి కోసం పాకులాడి తన చేతనైనంత అభివృద్ధి చేశారు. నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉన్నా ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే ఉండటం, మంత్రి హోదా లేకపోవడం అభివృద్ధి కుంటుపడిందన్న ఆరోపణలు ఉన్నాయి. పాలకొండరాయుడికి మంత్రి పదవి దక్కక పోవడానికి ఆయనకు పెద్దగా చదువు లేకపోవడమే కారణమని ఆయన సహచరులు అంటుంటారు. మరో ఎంఎల్ఏ మండిపల్లి నాగిరెడ్డి కి సైతం విద్యార్హత లేకపోవడంతోనే మంత్రి పదవి రాలేదన్న వాదనలు ఉన్నాయి. నాలుగు సార్లు ఎంఎల్ఏ గా గెలిచిన గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చారు. మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని భావించినా చీఫ్ విప్ పదవితో సరిపెట్టారు. దీంతో శ్రీకాంత్ రెడ్డి హయాంలో సైతం అభివృద్ధి అంతంత మాత్రంగానే సాగింది. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు అత్యంత సమీపంలో ఉండటం, రవాణా కు అనుకూలంగా ఉంది. జిల్లాల పునర్విభజనతో రాయచోటి జిల్లా కేంద్రం అయింది. రాయచోటిని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు మంత్రి పదవి తప్పనిసరి. గ్రామీణ ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడాన్ని నిరోధించడానికి, రాయచోటి నియోజకవర్గంలో 20 ఏళ్లకు పైగా అధికారానికి దూరమైన టీడీపీ కేడర్ ను సంస్థా గతంగా బలపరచడం. టీడీపీ కేడర్ ను ఆర్థికంగా బలపరచడం లాంటి చర్యలు తీసుకోవాలి. రాయచోటి ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెంచడానికి పరిశ్రమలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడానికి అమాత్య పదవి కచ్చితంగా కావాలి. నియోజకవర్గంలో లభించే సహజ సంపదతో చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పి మహిళా శక్తిని పెంపొందించేలా చేయడం.
ఏదేమైనా కొత్తగా ఏర్పడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం సుమారు ఆరున్నర దశాబ్ద కాలం తర్వాతైనా తొలిసారి రాయచోటి అభివృద్ధి కోసం మంత్రి పదవి కేటాయిస్తుందని రాయచోటి నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రతిపక్ష నేతలు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
బెస్ట్ ఆఫ్ లక్ రాయచోటి💐💐
