( మస్తాన్ . గగ్గుటూరి. రాయచోటి, అన్నమయ్య జిల్లా )
రాష్ట్ర ప్రజలను ఆకర్షించిన రాయచోటి..!
మంత్రి పదవి పొందడంలో రాముడు సక్సెస్..?
చాకిచక్యమా ?… అదృష్టమా ?
రాయచోటి… అత్యంత వెనుకబడిన ప్రాంతం. పెద్ద ప్రాజెక్టులు గానీ, పరిశ్రమలు గానీ లేని నియోజకవర్గం. అలాంటి రాయచోటి నియోజకవర్గం యావత్ రాష్ట్ర ప్రజల చూపును తన వైపు తిప్పుకుంది. ఇందుకు కారణం ఏడు దశాబ్దాల అనంతరం అమాత్య పదవిని సాధించడమే.
2024 సార్వత్రిక ఎన్నికల ముందు రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వానికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇంఛార్జి గా ఉన్న రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి, ప్రసాద్ బాబు లు టికెట్ సాధించేందుకు గట్టిగా పోటీ పడ్డారు. ఇంఛార్జి ఉన్న రమేష్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని ఆశించినా రాంప్రసాద్ రెడ్డి పార్టీ లోని పెద్దలతో నిత్యం టచ్ లో ఉంటూ తన చాకిచక్యమైన ఆలోచనలతో టికెట్ సాధించడంలో సక్సెస్ అయ్యాడు. రాయచోటి లో టీడీపీ టికెట్ సాధించడంతో రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించినట్లు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఉప ఎన్నిక సహా నాలుగు సార్లు గెలిచిన వైసిపి మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గంలో గట్టిగా పాతుకుపోయారు. శ్రీకాంత్ రెడ్డిని ఓటమి పాలు చేసేందుకు రాంప్రసాద్ రెడ్డి వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతూ వచ్చారు. రాయచోటిలో మూడు దశాబ్దాలకు పైగా రాజకీయ శత్రువులు గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబులతో కలిసి ప్రచారం నిర్వహించారు. మరో వైపు అసంతృప్త మాజీ ఎంఎల్ఏ లు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి, గడికోట ద్వారకనాథ్ రెడ్డి లు రాముడి ప్రచారాలకు దూరంగా ఉంటూ వచ్చారు. రమేష్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డితో సైతం రాయబారాలు నడిపినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఒంటరి పోరాటం తప్పదని భావించిన రాముడు అన్నింటికీ సిద్ధమై తానే ప్రజాక్షేత్రంలోకి దిగాడు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రజలతో మమేకమవుతూ వచ్చారు. అంతవరకూ పార్టీలో స్తబ్దుగా ఉన్న రమేష్ రెడ్డి వైసిపి కండువా కప్పుకోవడంతో అప్పటి వరకు వేచిచూసిన ఆర్.ఆర్ వర్గానికి చెందిన హార్డ్ కోర్ టీడీపీ శ్రేణులు రాముడి పంచన చేరాయి. రమేష్ రెడ్డి వైసిపి లో చేరిన వెంటనే రాముడి ప్రచారానికి అంతవరకూ దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాద్ రెడ్డితో రాంప్రసాద్ రెడ్డి రాయబారం పంపారు. ఏకంగా అధినేత చంద్రబాబుతో మాట్లాడించి ద్వారకనాథ్ రెడ్డి ని ప్రచారంలో పాల్గొనేలా చేసి సక్సెస్ అయ్యాడు.
రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మి ప్రసాద్ రెడ్డి గాలివీడు మండలం లో అంతా తానై రాత్రింబవళ్ళు ప్రజలతో గడిపారు. స్థానిక నేతలు, అధికార పక్షంలోని అసంతృప్త నేతలను బుజ్జగించి తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కారమయ్యే సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరిస్తూ పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. అలాగే మాజీ ఎంఎల్ఏ పాలకొండ రాయుడు తో కలిసి రాంప్రసాద్ రెడ్డి చేసిన రోడ్డు షో సైతం రాముడి విజయానికి కలిసి వచ్చింది. అందరినీ కలుపుకుంటూ తనదైన వ్యూహంతో, పార్టీ పెద్దల ఆలోచనలు వారి సహకారంతో వైసీపీకి దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చాడు. నాలుగు సార్లు వైసిపి ఎంఎల్ఏ గా గెలిచి రాయచోటి తన సొంత జాగీరులా వ్యవహరించిన గడికోట శ్రీకాంత్ రెడ్డికి పీచమనిగేలా ఓటమి రుచిని చూపించాడు. నువ్వా నేనా అంటూ సాగిన కౌంటింగ్ లో శ్రీకాంత్ రెడ్డికి బీపీ పెరిగేలా చేశాడు. రాయచోటి ప్రజలు ఇచ్చిన తీర్పు శ్రీకాంత్ రెడ్డికి కలలో సైతం రాముడు (రాంప్రసాద్ రెడ్డి ) కనిపించేలా నిద్రలో పడుకోబెట్టారు.
ఎట్టకేలకు రాంప్రసాద్ రెడ్డి తన ప్రత్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి పై విజయం సాధించి రాయచోటి టీడీపీ శాసనసభ్యుడు అయ్యారు. ఇంతవరకూ బాగానే ఉన్నా మంత్రివర్గ విస్తరణలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో రాయచోటి ఆనందం కట్టలు తెంచుకుంది. 72 ఏళ్ల తర్వాత తొలిసారి మంత్రి పదవి రావడం, అదీ రాంప్రసాద్ రెడ్డి కి దక్కడంతో నియోజకవర్గ ప్రజల్లో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాయచోటిలో సంతోషాలు వెల్లివిరుస్తుంటే పార్టీలోని సీనియర్ నాయకులు మంత్రి పదవి ఎలా వచ్చిందని జుట్టు పెరుక్కుంటున్నారు. తొలిసారి గెలిచిన వ్యక్తి ఎలా అమాత్య పదవి సాధించాడని ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలోని రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. కొందరు నేతలు అదృష్టం తలుపు తట్టిందని చెప్తున్నా మరికొందరు సీనియర్ లు మాత్రం రాంప్రసాద్ రెడ్డి తన రాజకీయ చతురత తోనే అమాత్య పదవి సాధించాడని చెబుతున్నారు. తాము సీనియర్లమని కళ్లు తలకెక్కడం, చాపకింద నీరు లా పార్టీలోని అత్యంత పెద్దలను( సీఎంతో సమానం) ప్రసన్నం చేసుకుని మంత్రి పదవి వ్యవహారంలో విజయం సాధించాడు.
ఇన్నాళ్లు నియోజకవర్గంలో రాముడు కి కోపం ఎక్కువ, నోటి కొచ్చినట్లు తిడతాడు అన్న అపవాదులు ఉన్నాయి. తన మొండి వ్యవహార శైలి, ముక్కుసూటి తనం తనకు రాజకీయాల్లో మరింత ఇబ్బంది పెడతాయని చాలా మంది భావించారు. కానీ తనపై ఉన్న ఆరోపణలను పటాపంచలు చేస్తూ తనలోని రాజకీయ చతురత, గోప్యత రాజకీయాలను రాంప్రసాద్ రెడ్డి ప్రజలకు తెలిసేలా కొత్తగా ఆవిష్కరించారు.
” కృషితో నాస్తి దుర్భిక్షం ” అన్న నానుడి మంత్రి రాంప్రసాద్ రెడ్డి విషయంలో నిజమైంది.
