తాజా వార్తలు

అరే బామ్మర్ది..యాడ ఉండావ్..రాయచోటి తెలుగుదేశం టికెట్ ఓరికిస్సారంట?

ఈడ లీడర్లు, కార్యకత్తలు జుట్లు పీక్కుంటాండరు

Share this :

రేయ్… బామ్మర్ది… మన రాయచోటి తెలుగుదేశం టికెట్ ఓరికిస్సారంట… ఎప్పుడు సెప్తారంట రా… టికెట్లు ఎవరికిస్సారో అర్థం గాక ఈడ లీడర్లు, కార్యకత్తలు జుట్లు పీక్కుంటాండరు… తొందరగా సెప్పమని ఆ పెద్దాయప్పకు సెప్పండిప్పా

అరే బామ్మర్ది… యాడ ఉండావ్…

ఈడ్నే కిరికెట్ ఆడతాండ బావ…

యాపచెట్టు అరుగు కాడికి రారా… సరే బావా…

ఏంది బావా ఇషయం…

రాయచోటి తెలుగుదేశం టికెట్ ఓరికంట బామ్మర్ది…

తెలుగుదేశంలో బావా… ఇంసార్జ్ గా, మాజీ ఎమ్మెల్యే గా ఉండే రెడ్డెప్పగారి. రమేష్ కుమార్ రెడ్డి అన్న,

వైసీపీలో ఉండలేక చానా రోజుల కింద టీడీపీ లోకి వొచ్చిన రాంప్రసాద్ రెడ్డి అన్న,

లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి అన్న టీడీపీ టికెట్ కోసం ఫుల్లుగా పయత్నాలు చేస్సాండరు బావ…

అది కాదు బామ్మర్ది… టీడీపీ లో ఉండే రమేష్ రెడ్డి అన్న ఇప్పుటికే రెండు సార్లు ఓడిపోయి నియోజకవగ్గం ఇన్సార్జ్ గా ఉండాడు…

ఆరు మండలాల్లో పాట్టీ సెప్పిన అన్ని పనులు బూత్ లెవెల్లో సేసినారంట కదా… రాట్టంలో రెండు సానంలో ఉండాడు అంటాండరు… నిజమేనా బామ్మధ్ధి…

ఈయన్న మింద గూడ కేసులు పెట్టిచ్చిన్యారా బామ్మద్ది…

అవును బావా నిజమే…

పాట్టీ సేసిన సర్వేల్లో జనాలు బాగనే ఒప్పు కున్యారంట…

అవును బావా…

ఇన్సార్జ్ గా అంతా తిరగుతా పాట్టీ పనులు అన్నీ సెస్సాండడు…

రెండు మాట్లు ఓడిపోయి… చానా లెక్క పోగొట్టు కున్యాడు… అని జనాలు సెప్తాండరు…

ఓడిపోతామని తెలిసీ కోట్లు కోట్లు ఖచ్చు సేసి ఎలచ్చన్లలో పాట్టీ పెద్దాయన సెప్పినాడని పోటీ సెస్సా వచ్చినాడు అంటాండరు బామ్మద్ది…

ఇప్పుటిదాకా జనాల కాడికి బాగనే తిరిగినాడు అని సెప్తాండరు…

ఇన్నేళ్ల మంచి పాట్టీ కోసం కార్యకత్తల కోసం లెక్కలు ఖచ్చు పెట్టుకుంటా ఉండాడు అంటాండ్రు బామ్మద్ది…

నిజమే బావా…

ఇంతగా కట్టం సేస్సా నేనుంటే పక్కోల్లకు టికెట్ యెట్టిస్సారు అని ఈయన్న పెశ్నిస్సాండరు…

ఖచ్చితంగా మా యన్న కే టికెట్ ఈయాలని రమేశన్న మనుసులు గెట్టిగా అడుగుతాండరు బావా…

అవునా బామ్మర్ది…

అవును బావా…

ఇంగ రెండో ఆయప్ప …

మండిపల్లి. రాంప్రసాద్ రెడ్డి అన్న… ఈయన్ను అంతా రాముడు అని పిలుచ్చారు బావా…

ఈన సీఎం జగన్ పెట్టిన వైసీపీ పాట్టీలో ఉన్యాడు… వైసీపీ పెభుత్వం వచ్చినాక ఈడ ఉండే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తో సరిపోక పాట్టీ నుంచి బైటికి వచ్చేసినాడు…

చానా రోజులు ఏ పాట్టీ లోకి పోకుండా ఒంటరిగా ఉంటా జనాల కాడికి పోయి చేతనైన కాడికి మండిపల్లి ట్రస్ట్ పేరుతో సాయం సేస్సా ఉన్యాడు…

ఈడ రాసిట్లో కాలేజీ భూమి కోసం ఈన జనాల్తో పెద్ద ఊరేగింపు సేశినాడు బావా…

మళ్ళ ఎవరో… న్నా… నిన్ను పక్కదారి పట్టిచ్చినారున్నా…

నువ్వు ఇట్ట సేసినావ్ వాళ్ళ ఓట్లు అన్ని పక్కకు పోతాయని సెప్పినారాని ఊళ్ళో సెప్తాండరు బావ…

మళ్ళ నువ్వు సిప్పింది నిజమే బ్బీ అని… ఈయన్న గూడ మళ్ళ సద్దుబాటు చేసుకున్యాడు అని సెప్తారు బావా… ఇపుడు ఒళ్లతో గూడ బాగానే ఉండాడు అని బావా…

మల్ల టీడీపీ పెద్దాయన తో మాటాడి తెలుగుదేశంలో సేరినాడు బావా…

నాకు పెద్దాయన టికెట్ ఇస్సా అని సెప్పినాడు… ఆ నమ్మకంతోనే పాట్టీ లో పని సేస్సాండడు… పాట్టీ లు మారేదేమీ ఉండదు అని ముందు సెప్పినాడు… అని ఒళ్లోల్లు సెప్తాండరు…

కరోనా వచ్చిండ్లా అప్దు వొల్ల చిన్నమండెంలో మంది సమస్య అని పోతే కేసు పెట్నారు…

మళ్ళ సెంద్రన్న సారు పోగ్రాములో మళ్ళా కేసు పెట్నారు… ఈయన్న మింద రెండు మూడు కేసులు పెట్నారు… బావా…

తెలుగుదేశం పెద్దసారు… సెంద్రన్న సారు జైల్ కు పోయినప్పుడు పెభుత్వనికి యతిరేఖంగా పాట్టీ సెప్పిన పనులు రాముడన్న, రమేషన్న ఇద్దరూ సేశినారు…

నేను జనాల్లోనే ఉండా, జనం కోసమే తిరగతాండా, నాకు మాట ఇచ్చినారు… నాకే టికెట్ వస్సాది అని ఈన ధీమా గా ఉండాడు బావా…

ఇంగ మూడో ఆయప్ప…

గడికోట. ద్వారకనాథ రెడ్డి అన్న… ఈయప్ప లక్కిరెడ్డి పల్లి కి ఎప్పుడో ఎమ్మెల్యే గా ఉన్యాడు… ఈయన వైసీపీ పెద్ద సార్లలో విజయసాయి రెడ్డి సారు కు బంధువు.. నెలరోజుల కింద వరకు వైసీపీ లో ఉన్యాడు… ఇప్పుడు తెలుగుదేశం లో చేర్నాడు… నాకు టికెట్ వస్సుంది… నేనే పోటీ సేస్సా అని చెప్తాండడు…
ఈయప్ప ఒళ్ల బందువులాయమ్మ సెంద్రన్న సారు ఒళ్ళ అత్తగారింట్లో పెళ్లి సేసుకున్యాదంట… ఆయమ్మ కు పాపం నట్టం జరిగింది బావా…

లోకేష్ బాబు యువగలం యాత్ర మొదులు పెట్నపుడు ఆ యాత్రలో తారక రత్న సారు ఇబ్బంది పడి… మళ్ళ రోన్ని రోజులకు కాలం సేసినాడు…

ఆ ఆడబిడ్డకు దేవుడు అన్నాయం సేసినాడని అందురూ బాధ పడ్నారు బావా…

ఆయమ్మ ద్వారకన్న కు మేనకోడలు… అప్పుడు తారకరత్న సారు ఒళ్ళ ఇంట్లో ఏ సమస్యలు రాకుండా ద్వారకన్న సూసుకున్యాడని ఊళ్ళో సెప్తారు బావా…

ఈ పనే ద్వారకన్నకు టికెట్ ఇచ్చే దానికి కారణమేమో అని ఊళ్ళో ఓల్లు సెప్పుతాండరు బావా…

ఈయన్న మాజీ ఎమ్మెల్యే గా ఉన్యా రాయచోటి నియోజక వగ్గంలో లీడల్లతో పరిశయాలు ఉండాయి కానీ జనాలతో లేవని మిగిలినోల్లు సెప్తాండరు…

పస్సుతం ఈన వగ్గమంతా ఎమ్మెల్యే సీకాంత్ రెడ్డి ఎనకాల ఉంది అంటాండరు… టికెట్ లు చెప్పే లోపల వగ్గం ఈయన్న కాడికి వస్సుందా?

ఈయన్న మాత్తం పాట్టీలోకి వచ్చి రోన్ని రోజులే అయ్యింది బావా….

ఈడ రాయచోటిలో ఎవరు గెలసాలన్న సుగవాసి కుటుంబం వాళ్ళతో కలిసి ఉండాల బావా…

ఎందుకంటే ముందు నుంచి రాయచోటి కి సుగవాసి. పాలకొండ రాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే గా, ఒక సారి ఎంపీగా గెలిచి ఉండారు…

ఇపుడు ఓల్ల ఇద్దరు కొడుకుల్లో చిన్నాయప్ప ప్రసాద్ బాబు ఎమ్మెల్యే టికెట్ కోసం సూసినాడు… కానీ పాట్టీ పెద్దోళ్ళు ఈనకు టికెట్ లేకుండా ఈయన అన్న సుగవాసి. బాలసుబ్రమణ్యం కు రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చినారు బావా… ఈయన్న గూడ పజల్లో తిరుగుతాండడు బావా…

ఈల్లకు సుట్టూ ఊళ్ళల్లో వగ్గం ఉంది బావా…

ముందు ఉన్నిండ్లా లక్కిరెడ్డిపల్లి నియోజక వగ్గం లో ఉండే మూడు మండలాలు రమేశన్న కు, ద్వారకన్న కు పట్టు ఉంటాయి… కానీ ద్వారకన్న రాజకీయాల్లో ఉన్యా డైరెక్ట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేయక చానా రోజులు అయ్యింది… దీంతో ఈనకు టికెట్ ఇస్సే చానా కట్ట పడాల్సి వస్తుంది…

రమేశన్న రెండు మాట్లు పోటీ చేసి ఓడిపోయినా జనాలతో ఉంటా ఉన్యాడు… దీంతో ఈడ ద్వారకన్న కు రోంత సమస్య అయితాది…

అట్నే రాయచోటి నియోజక వగ్గంలోని మూడు మండలాల్లో రాముడి కుటుంబానికి పరిచయాలు ఉండాయి… ఒళ్ల నాయన నాగిరెడ్డి రెండు మాట్లు, వోల్ల అన్న నారాయణ రెడ్డి రెండు మాట్లు ఎమ్మెల్యే గా ఉన్యారు…

రామునికి టికెట్ ఇచ్చే… ముందు ఉన్య లక్కిరెడ్డి పల్లి నియోజక వగ్గం లోని మూడు మండలాలు ఇబ్బంది తెచ్చాయి… ఈడ రమేశన్న, ద్వారకన్న సాయం సేయాల…

ముందు రాముడు గూడ ఎమ్మెల్యే గా పోటీ సేస్నా గెలచలేక పోయినాడు…

కానీ వగ్గాన్ని కాపాడు కుండే దానికి పయత్నాలు సేస్సా జనంలోనే ఉంటాండడు…

రమేశన్న మాత్తం రాయచోటి నియోజక వగ్గానికి పదేండ్లు గా ఇంశార్జ్ గా ఉండాడు…

వైసీపీ పెభుత్వం మాట సెప్పినట్టు మందు నిషేదం లేకపోవడం, ఇసిక, పల్లెల్లో దౌజన్యాలు, సెంద్రన్న అరెస్టు, పాయిశ్రామిక అభిఉద్ది, ఉద్యోగులకు అన్నాయం సేసినారాని రోడ్ల మింద ఉద్యోగులు సేసిన ర్యాలీలు, ధర్నాలు, పెట్టరోలు , కరెంట్ బిల్లులు పెంచినారని ఇట్టా రకరకాల కారణాలతో రాట్టం లో యతిరేఖత పెరిగి పోయిందన్న ఇమర్షలు ఉండాయి…

రాట్టంలో యాడ సూసినా టీడీపీ టికెట్ల కోసం లీడర్లు పరుగులు పెడతాండరు…

మన రాయచోటి లో గూడ బావా… గెలుస్సామనే నమ్మకంతో పోటీ బాగా పెరిగిపోయింది…

ఈడ రమేశన్న కు టికెట్ ఇస్సే రెండుసార్లు ఓడిపోయాడని సానుభూతి ఉంది బావా… సుగవాసి కుటుంబం తో బాగానే కలిసి మెలిసి తిరుగుతాండడు ఇప్పటికే…

రాముడన్నను, ద్వారకన్నను కలుపుకు పోతే ఇజయం ఇంగా రోంత సులభం అయితాది…

కాదని రాముడన్నకు ఇచ్చినా రమేశన్నను, సుగవాసి కుటుంబాన్ని, ద్వారకన్నను కలుపుకుని పోవాలి…

ఎక్కడా ఎవ్వరినీ వదిలి పెట్టకూడదు… ఎవర్ని ఎవరు నిర్లక్ష్యం చేశ్నా అందరూ కలిసి గుండు కొట్టిచ్చు కావాల…

ఏదేమైనా… తెలుగుదేశం పెద్దాయప్ప సెంద్రన్న టికెట్ ఇచ్చినా కలిసి గెలిపిచ్చు కోవాల…

అంతే తప్ప ఎవరికో ఇస్సే మాకెందుకు అనుకుంటే… మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు రోడ్ల మింద అడక్కు తినే పరిస్సితి వస్సుంది…

మా లీడర్ గెల్చాలని దెబ్బలు తిని, కేసులు పెట్టిచ్చుకుని జైళ్లకు పోయేది కార్యకత్తలే… టీడీపీ పెబుత్వం వస్సుందని కార్యకత్తలు, సిన్న లీడల్లు సంతోసంగా ఉండారు… పెద్ద లీడల్లు ఎన్నుపొట్లు పొడుసుకుంటే … నమ్ముకున్నోల్లు గోవిందా… గోవిందా అంటూ తిరుమలకు కాదు అస్సాం పోవాల అంతే…

సరే బావా పోయోస్సా… పోన్ వచ్చింది… ఐప్డు నేను బ్యాటింగ్ కు పోవాలంట… చానా రన్నులు కొట్టాలంట… సునీలు సెప్తాండడు…. పోయోస్సా బావో..

– సముద్రవాణి