ఆంధ్రప్రదేశ్‌లో సొంత పార్టీ ఎమ్మెల్యేల ఏకపక్ష వైఖరి, సొంత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినకుండా చూసేందుకు తెలుగుదేశం పార్టీ (TDP) అధినాయకత్వం ఒక సంచలన వ్యూహాన్ని అమలు చేయబోతోంది. నియోజకవర్గాల్లో పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తూ, అధిష్ఠానం మాట వినని ప్రజాప్రతినిధులకు కళ్లెం వేయడమే లక్ష్యంగా సరికొత్త నియామకాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లాలోని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, అలాగే నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే నియోజకవర్గాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పార్టీ తరఫున ప్రత్యేక ‘పర్యవేక్షక ఇన్‌ఛార్జ్‌లను’ (Constituency Coordinators) నియమించబోతున్నారనే వార్త ఇప్పుడు కూటమి వర్గాల్లో సంచలనంగా మారింది.
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలో ఎమ్మెల్యేలదే సర్వాధికారం ఉంటుంది. కానీ, గుంటూరు మరియు కావలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరుల జోక్యం, ఇసుక మరియు భూముల వ్యవహారాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అధిష్ఠానం రూట్ మార్చింది. అక్కడ నియమించబోయే కొత్త ఇన్‌ఛార్జ్‌లు నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గ పనులను పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీ, స్థానిక బదిలీలు, మరియు పార్టీ క్యాడర్ సమన్వయం అంతా ఈ ఇన్‌ఛార్జ్‌ల చేతుల మీదుగానే సాగేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఏకపక్ష అధికారాలకు పూర్తిగా బ్రేక్ పడనుంది.
త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ నష్టపోకుండా ఉండేందుకే చంద్రబాబు ఈ కఠిన నిర్ణయానికి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ ప్రవర్తనను మార్చుకోకపోతే, నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను పూర్తిగా ఇన్‌ఛార్జ్‌లకే అప్పగించనున్నారు. అంతేకాదు, రాబోయే 2029 సాధారణ ఎన్నికల్లో సదరు ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించి, ఇప్పుడు నియమించే ఇన్‌ఛార్జ్‌లకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేలా ఒక బలమైన సంకేతాన్ని పంపబోతున్నారు. అధిష్ఠానం తీసుకోబోయే ఈ ‘ఇన్‌ఛార్జ్’ అస్త్రం ఇప్పుడు తమ్ముళ్లలో వణుకు పుట్టిస్తోంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి