మన దేశంలో అంతరిక్ష పరిశోధనలు అనగానే అందరికీ ఇస్రో (ISRO) మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇస్రో ఉద్యోగాలను వదిలేసి, సొంతంగా రాకెట్ తయారు చేయాలనే పిచ్చితో ఇద్దరు స్నేహితులు మొదలుపెట్టిన స్టార్టపే ఈ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace). హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఈ స్టార్టప్.. ఇప్పుడు విక్రమ్-1 రాకెట్‌ను సక్సెస్‌ఫుల్‌గా నింగిలోకి పంపి హిస్టరీ క్రియేట్ చేసింది. మన ఇండియాకు కూడా సొంతంగా ఒక ‘SpaceX‘ లాంటి ప్రైవేట్ రాకెట్ సంస్థను తెచ్చి చూపించారు ఈ ఫౌండర్స్.
ఈ అద్భుతాన్ని సాకారం చేసిన ఆ ఇద్దరు యువ శాస్త్రవేత్తల పేర్లు పవన్ కుమార్ చందన మరియు భరత్ దాకా. వీరిద్దరూ ఐఐటీ లలో చదువు పూర్తి చేసుకుని, ఆ తర్వాత ఇస్రోలో సైంటిస్టులుగా జాయిన్ అయ్యారు. పవన్ కుమార్ చందన ఇస్రోలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్‌పై రీసెర్చ్ చేసేవారు. అయితే మన దేశంలో కూడా ప్రైవేట్ అంతరిక్ష రంగానికి అద్భుతమైన ఫ్యూచర్ ఉందని నమ్మిన వీరిద్దరూ, చేతిలో ఉన్న లగ్జరీ ప్రభుత్వ ఉద్యోగాలను ధైర్యంగా వదిలేశారు. అలా 2018లో కేవలం ఇద్దరితో మొదలైన ప్రయాణం ఈరోజు దేశం గర్వించే స్థాయికి చేరింది.
పవన్, భరత్ ల పర్యవేక్షణలో రూపొందిన ‘విక్రమ్-1’ రాకెట్ సాంకేతికంగా ఎంతో పవర్ఫుల్. చిన్న చిన్న కమర్షియల్ ఉపగ్రహాలను (దాదాపు 350 కేజీలు) అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో పంపడానికి ఈ రాకెట్‌ను డిజైన్ చేశారు. అంతరిక్షంలో సాటిలైట్లను కరెక్ట్ ప్లేస్‌లో ఉంచడానికి వీరు వాడిన ప్రత్యేక లిక్విడ్ టెక్నాలజీ ఈ రాకెట్ సొంతం. గ్లోబల్ స్పేస్ మార్కెట్లో ఎలన్ మాస్క్ కంపెనీకి గట్టి పోటీ ఇచ్చే రేంజ్లో ఈ హైదరాబాద్ స్టార్టప్ దూసుకుపోతోంది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇండియన్ స్పేస్ పాలసీ 2023’ మరియు రూ. 1000 కోట్ల వెంచర్ ఫండ్ కూడా ఈ స్టార్టప్‌కు బాగా ప్లస్ అయ్యాయి. ఇస్రో ల్యాబ్స్, లాంచ్ ప్యాడ్స్ వాడుకుంటూ కఠినమైన రూల్స్ అన్నింటినీ దాటి స్కైరూట్ సాధించిన ఈ సక్సెస్.. దేశంలోని మిగతా ప్రైవేట్ స్టార్టప్‌లకు సరికొత్త జోష్ ఇచ్చింది. ఈ ఇద్దరు మిత్రులు కన్న కల ఈరోజు అంతర్జాతీయ వేదికపై మన దేశం కాలర్గై ఎగరేసేలా చేసింది.