యుద్ధం వద్దు.. శాంతి ముద్దు: ట్రంప్ కొత్త కబుర్లు

ఇరాన్‌పై భారీ దాడిని నిలిపివేసిన ట్రంప్..

Share this :

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత కొద్దిరోజులుగా నెలకొన్న యుద్ధ వాతావరణం అనూహ్య మలుపు తిరిగింది. ఇరాన్‌పై శుక్రవారం రాత్రి జరపాల్సిన భారీ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. “తాను ప్రజలను చంపాలని అనుకోవడం లేదని”, యుద్ధం వల్ల ఇరువైపులా భారీగా ప్రాణనష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు ఇరాన్‌తో సోమవారం మధ్యాహ్నం నుండే మధ్యవర్తుల ద్వారా సరికొత్త దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కానున్నట్లు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణిస్తున్న సందర్భంగా ట్రంప్ స్వయంగా మీడియాకు వెల్లడించారు.

Also Read: హెచ్‌ఐవీ నివారణకు సరికొత్త టాబ్లెట్..!

ఈ యుద్ధాన్ని నివారించడంలో గల్ఫ్ దేశాల తెరవెనుక దౌత్యం అత్యంత కీలక పాత్ర పోషించింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్ మరియు ఒమన్ దేశాల అధినేతలు శని, ఆదివారాల్లో ట్రంప్‌తో జరిపిన అత్యంత రహస్య చర్చల ఫలితంగానే అమెరికా తన దాడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) సముద్ర రవాణా మార్గాన్ని ఎటువంటి రుసుములు లేకుండా 60 రోజుల పాటు స్వేచ్ఛా వాణిజ్యం కోసం తెరిచి ఉంచడానికి ఇరాన్ అంగీకరించిందని ఖతార్ అధికారులు ట్రంప్‌కు సమాచారం అందించారు. అలాగే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సైతం ట్రంప్‌తో ఫోన్ లో మాట్లాడి సైనిక చర్య వద్దంటూ నచ్చజెప్పారట.

Also Read: అర్ధమైందా రాజా..? లోకేష్, పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.!

మరోవైపు ఇరాన్ అణ్వాయుధ సంపత్తి రద్దు మరియు సముద్ర జలాల భద్రతపై ఒక శాశ్వత ఒప్పందానికి వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఈ చర్చలపై గల్ఫ్ మిత్రదేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ అరేబియా శాంతిని కోరుకుంటుండగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మాత్రం ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ పై కఠినమైన సైనిక చర్య తీసుకుంటేనే వారు దారికి వస్తారని అమెరికాపై ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనప్పటికీ, నేటి నుండి ప్రారంభం కాబోతున్న ఈ శాంతి చర్చలు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో సరికొత్త రక్షణ వ్యూహాలకు దారితీయనున్నాయి.