ఉరవకొండలో వైసీపీ రచ్చ రచ్చ.!

ఆర్ధిక మంత్రి ఇలాకాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు

Share this :

ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దేవాలయ భూముల పరిరక్షణ పేరిట ధర్నాకు పిలుపునిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వేశ్వర్‌రెడ్డి అరెస్టు వార్త తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ శ్రేణులు మరియు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున అరాచకానికి దిగారు. గుంతకల్ సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్-30 అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ వైసీపీ మూకలు పట్టణంలో తీవ్ర హంగామా సృష్టించాయి.

Also Read: యుద్ధం వద్దు.. శాంతి ముద్దు: ట్రంప్ కొత్త కబుర్లు

ఈ ఆందోళనల క్రమంలో వైసీపీ కార్యకర్తలు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోకి చొరబడి, రోగుల అత్యవసర వైద్య సేవలకు ఉపయోగించే ప్రాణాధారమైన ఆక్సిజన్ సిలిండర్లను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఆ ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుపై పడేసి, వాటితోనే రాస్తారోకో చేస్తూ వీరంగం సృష్టించారు. ఆసుపత్రి ఆస్తులను రోడ్డుపైకి తెచ్చి ఇలా నిరసన తెలపడంపై స్థానిక ప్రజలు, రోగుల బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఉద్రిక్తతల్లోనూ కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వ వైద్య సామాగ్రిని రోడ్డుపై పడేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: అర్ధమైందా రాజా..? లోకేష్, పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.!

మరోవైపు విశ్వేశ్వర్‌రెడ్డిని తరలిస్తున్న పోలీసు వాహనాలకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అడ్డుపడ్డాయి. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, జీపులను ముందుకు కదలకుండా రోడ్డుపై బైఠాయించి తీవ్ర ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి, నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉరవకొండ పట్టణమంతటా భారీగా పోలీస్ లను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.