ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan kalyan) తీసుకుంటున్న తాజా నిర్ణయాలు ఇప్పుడు సొంత పార్టీ ప్రజాప్రతినిధుల్లో గుబులు రేపుతున్నాయి. ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన జనసేనాని.. ఇప్పుడు పాలనపై, అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా, పరిపాలనాపరంగా వేగం పెంచడమే కాకుండా.. తమ సొంత పార్టీ నేతలపై అంతర్గతంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి లభించిన అఖండ విజయం ఎంత గొప్పదో.. దాన్ని అంతే పద్ధతిగా కాపాడుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఆయన తన పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ఒక కన్నేసి ఉంచారు. ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వస్తున్నాయా? ఇసుక, భూ వివాదాల్లో ఎవరైనా జోక్యం చేసుకుంటున్నారా? అధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? అనే విషయాలపై పవన్ ప్రత్యేకంగా సమాచారం సేకరిస్తున్నట్లు టాక్. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, కేవలం పైరవీలకు పరిమితమయ్యే ఎమ్మెల్యేల గ్రాఫ్స్ దెబ్బతింటే ఊరుకునేది లేదని ఆయన ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు భోగట్టా.
కేవలం ఎమ్మెల్యేలే కాకుండా, పార్లమెంట్ సభ్యుల (MP) వ్యవహారశైలిపై కూడా జనసేనాని నిఘా పెట్టడం విశేషం. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు, కేంద్ర మంత్రులతో జరుపుతున్న సంప్రదింపులపై పవన్ కళ్యాణ్ ప్రతి వారం నివేదికలు తెప్పించుకుంటున్నారు. పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఎవరైనా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కఠినమైన పర్యవేక్షణ కారణంగానే జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
గతంలో లాగా పార్టీని కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయకుండా, ఒక పక్కా కేడర్ బేస్డ్ పార్టీగా మార్చడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా ఉండాలంటే.. ముందు తమ పార్టీ నేతలు నీతిగా, నిజాయితీగా పని చేయాలని ఆయన నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు, సొంతంగా నియమించుకున్న ప్రత్యేక బృందాల ద్వారా నియోజకవర్గాల వారీగా డేటాను సేకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఈ అడ్మినిస్ట్రేటివ్ స్పీడ్, నో కాంప్రమైజ్ ఆటిట్యూడ్ చూస్తుంటే.. జనసేన ప్రజాప్రతినిధుల్లో ఒక వైపు భయం, మరోవైపు బాధ్యత రెండు రెట్లు పెరిగాయని స్పష్టమవుతోంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి