ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా భారతదేశ ఆర్థిక రంగానికి మరో భారీ అంతర్జాతీయ ముప్పు ముంచుకొస్తోంది. ఇప్పటికే హార్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తుండగా, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గంపై ఇరాన్ అనుకూల హౌతీ రెబెల్స్ కన్నేశారు. ఎర్ర సముద్రం (Red Sea) మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను అనుసంధానించే అత్యంత వ్యూహాత్మకమైన ‘బాబ్-ఎల్-మండేబ్ జలసంధి’ని (Bab-el-Mandeb Strait) పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి హౌతీలు స్కెచ్ వేశారు.
ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే అంతర్జాతీయ కార్గో నౌకల నుండి భారీగా రక్షణ పన్నులు (Transit Fees) వసూలు చేయాలని హౌతీలు భావిస్తున్నారు. ఈ మార్గాన్ని గనుక వారు అడ్డుకుంటే గ్లోబల్ ట్రేడ్‌తో పాటు, భారతదేశానికి వచ్చే క్రూడాయిల్ సప్లై పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ హౌతీలు ఈ బాబ్-ఎల్-మండేబ్ జలసంధిని బ్లాక్ చేస్తే, అది నేరుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన సూయజ్ కాలువను (Suez Canal) పూర్తిగా నిరుపయోగంగా మార్చేస్తుంది.
ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 12 శాతం వ్యాపారం కేవలం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. హౌతీల దాడుల భయంతో ఈ రూట్ గనుక క్లోజ్ అయితే.. సముద్ర నౌకలన్నీ ఆఫ్రికా ఖండం చివరన ఉండే ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల నౌకలు గమ్యస్థానానికి చేరడానికి అదనంగా కనీసం 14 రోజుల సమయం పట్టడమే కాకుండా, దాదాపు 7,000 కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తుంది. ఫలితంగా షిప్పింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆకాశాన్నంటుతాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ అంతర్జాతీయ సంక్షోభం భారతదేశాన్ని ఇంధన పరంగా దారుణంగా దెబ్బకొట్టే అవకాశం ఉంది. భారతదేశం తన మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు 25 నుండి 35 శాతం కేవలం ఈ సూయజ్ కాలువ మార్గం ద్వారానే నిర్వహిస్తుంది. మన దేశం తనకు కావలసిన మొత్తం ఇంధన అవసరాలలో 85 శాతాన్ని విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది, అందులో చాలా భాగం ఈ రూట్ ద్వారానే వస్తుంది. ఒకవేళ ఈ సముద్ర మార్గం మూతబడితే, నౌకలు ఆలస్యంగా రావడం వల్ల దేశంలో ముడిచమురు కొరత ఏర్పడి, పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. చమురు ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి దేశీయ మార్కెట్లలో ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు పొంచి ఉంది.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి