తాజా వార్తలు

AP Politics: జగన్ రెడ్డి మెప్పు కోసమా.. లేక..!

మత మార్పిడుల గుట్టు విప్పిన విజయసాయిరెడ్డి

Share this :

వైసీపీ నేతల తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల మెప్పు ఎంతో ముఖ్యం. అదే సమయంలో ఒక పార్టీ అండ కూడా ఉండాల్సిందే. అయితే పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నానా పాట్లు పడుతుంటారు. అధినేతలు చేసిన పనులను గొప్పగా ప్రచారం చేస్తారు. ఇంకా కొంతమంది అయితే పాలాభిషేకాలతో హోరెత్తిస్తారు. ఇప్పుడు ఇంకెంత మంది అయితే.. తమ ప్రాంతానికి అధినేతల పేర్లు పెట్టి.. స్వామి భక్తి చాటుతున్నారు. విగ్రహాల ఏర్పాటు అనేది చాలా పాత విషయం అయిపోయింది. కానీ వైసీపీ నేతల తీరు చూస్తే మాత్రం ఇప్పుడు ఆశ్చర్యమేస్తోంది.

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసు. పేరుకు మాత్రమే రెడ్డి కుటుంబం. కానీ వాళ్ల తాత రాజారెడ్డి కాలంలోనే క్రిస్టియానిటిని నమ్మిన కుటుంబం. అందుకే వాళ్ల ఇంట్లో అందరు క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. వాళ్ల కుటుంబాల్లోకి వచ్చే వారు కూడా అదే మతాన్ని ఆచరించాలి. మరో విషయం ఏమిటంటే.. అలా వచ్చే వారు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయి ఉండాలనేది ఓ నియమం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వివాహం చేసుకున్న విజయలక్ష్మి కుటుంబం, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివాహం చేసుకున్న భారతీ రెడ్డి కుటుంబం కూడా క్రైస్తవమతం స్వీకరించినట్లు అందరికీ తెలుసు. వైఎస్ఆర్ అల్లుడు అనిల్ కూడా క్రైస్తవమతం స్వీకరించారు. ఇక వైఎస్ కుటుంబంలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే.. క్రైస్తవమత ఆచారాల ప్రకారమే జరుగుతాయి. వివాహమైనా, అంత్యక్రియలైనా సరే..

వైఎస్ కుటుంబం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా.. సిఎస్ఐ అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంటు క్రైస్తవులు. రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన తరువాత 2004లోనూ, మళ్లీ 2009లోనూ కుటుంబ సమేతంగా బెత్లహాం యాత్రకు వెళ్ళి వచ్చారు. రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మత మార్పిళ్లను వైఎస్ కుటుంబం ప్రోత్సహించినట్లు ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే నిజమన్నట్లుగా కనిపిస్తున్నాయి.

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై వరకట్న వేధింపులు, గృహ హింస, హత్యాయత్నం కేసులు పెట్టిన ఆయన కోడలు మేఘన.. రెండు రోజుల క్రితం జోగి కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసింది. జోగి కుటుంబం హిందూ వ్యతిరేకం అని.. జోగి కుటుంబం క్రైస్తవమతం స్వీకరించినట్లు ఆరోపించారు. హిందూ దేవుళ్లను దూషించినట్లు కూడా ఆరోపించారు. అంతకు ముందు జోగి రమేశ్ కూడా తన భార్య బైబిల్ చదువుతుందని.. అందులో తప్పేమిటన్నారు. ఇక మరో వైసీపీ నేత ఎస్‌వీ మోహన్ రెడ్డి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్‌వీ మోహన్ రెడ్డి తన ఇంట్లో క్రైస్తవ మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో ఎస్‌వీ మోహన్ రెడ్డి అభిమానులు కూడా పాల్గొన్నారు. నిజానికి తొలి నుంచి ఎస్‍‌వీ మోహన్ రెడ్డి కుటుంబం హిందువులే. మోహన్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి హయాం నుంచి అహోబిలం, యాగంటి, మహానంది క్షేత్రాల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. అలాంటి మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలా క్రైస్తవ మత ప్రార్థనలు నిర్వహించడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు.

వైసీపీ అధినేత జగన్‌కు క్రైస్తవులంటే వల్లమాలిన ప్రేమ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ముఖ్యమంత్రి హోదాలో కూడా కనీసం ఒక్కసారి కూడా సతీసమేతంగా తిరుమల వెళ్లలేదు. ఆనవాయితీ ఉంది కాబట్టి.. ముఖ్యమంత్రి హోదాలో హిందూ ఆలయాలను జగన్ సందర్శించారు. అంతే తప్ప.. భక్తితో మాత్రం కాదనేది హిందూ ధార్మిక సంఘాల ఆరోపణ. ఇక సంక్రాంతికి, ఉగాదికి తాడేపల్లి ప్యాలెస్‌లోనే గుడి సెట్ వేశారు. ఇది అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు కూడా దారి తీసింది. ఇక జగన్ సొంత పిన్ని, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత రెడ్డి కూడా నిత్యం బైబిల్ చేతిలో పట్టుకునే కనిపించారు. జగన్ తిరుమల పర్యటనలో అయితే.. స్వామి వారి ఆలయంలోనే “జగన్ రక్షకా..” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అధినేత మెప్పు కోసం చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు హిందూ పండుగల కంటే కూడా క్రిస్మస్ వేడుకలనే ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే వేడుకలు నిర్వహించడం వేరు.. ఇలా క్రైస్తవమతంలోకి పూర్తిగా మారటం వేరు అనేది విశ్లేషకుల అభిప్రాయం. మతం మారిన వారికే జగన్ ప్రయారిటీ ఇస్తారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు వైసీపీ నేతలు ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.

leave a reply