మంత్రి పదవులు ఇచ్చిన తీరు పై.. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరర్రావు చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పెద్ద దుమారం రేగుతోంది. అనూహ్యంగా బొండా ఊమాకు టీడీపీలోనే 90 శాతం పైగా మద్దతు లభించడం పార్టీ పెద్దల నిర్ణయాలపై విమర్శలకు కారణమవుతోంది కూడా. టీడీపీలో కాపు కులానికి చెందిన నేతగా, సీనియర్‌గా బోండా ఉమాకు గుర్తింపు ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టార్గెట్ బోండా అన్నట్లుగా వైసీపీ సర్కార్ కేసులు పెట్టింది. చివరికి మాచర్లలో బోండా ఉమా కారుపై దాడితో పాటు హత్యాయత్నం కూడా జరిగింది. అయినా సరే.. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగిరేలా చేశారు ఉమా.
అలాంటి కాపు నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారాయి. మంత్రి పదవికి అర్హతలు ఏంటి..? పార్టీకి విధేయులుగా ఉండాల్సిన అవసరం లేదా..? పార్టీలు మారిన వారే మంత్రి పదవులకు అర్హులా..? చంద్రబాబు పై విమర్శలు, ఆరోపణలు చేసిన వారే మంత్రి పదవులకు అర్హులా..? పార్టీ కోసం కష్టపడి పనిచేయాల్సిన అవసరం లేదేమో..! అంటూ ఉమా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో సుమారు 20 మంది ఎమ్మెల్యేలు అయ్యారనే ప్రచారంతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. ఆఖరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వటమే కాకుండా.. ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత మంత్రి పదవులు ఇచ్చారని.. ఆ విధంగా పదవులు పొందిన వారే ఎక్కువగా ఉన్నారంటూ ఉమా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
టీడీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా కాపు కులానికి చెందిన బోండా ఉమా పార్టీలోనే కొనసాగారు. 2008లో ప్రజారాజ్యం పెట్టిన తర్వాత కృష్ణా జిల్లాలో పార్టీని నడిపేందుకు బోండా ఉమా సరైన వ్యక్తిగా భావించిన చిరంజీవి.. పార్టీలో చేరాలంటూ ఉమాను చిరంజీవి స్వయంగా ఆహ్వానించారు. కానీ బోండా మాత్రం ప్రజారాజ్యం పార్టీలో చేరకుండా.. టీడీపీలోనే కొనసాగారు. ఇదే విషయం టీడీపీలో ఉన్న నేతలందరికీ తెలుసు కూడా. అలాంటి బోండాకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వారికే మంత్రి పదవి కూడా ఇచ్చి.. బోండా ఉమాను అవమానించారని టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలే అంటున్నారు.
మంత్రి పదవులపైన బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు మెజారిటీ టీడీపీ వర్గాల నుంచే మద్దతు వస్తోంది. మంత్రి పదవులి ఇవ్వటంలో సీఎం చంద్రబాబు పైన తీవ్ర వత్తిడి తెచ్చారని.. అందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులకు మంత్రి పదవులు వచ్చాయనే ఆరోపణలున్నాయి. వైసీపీకి చెందిన వారికి పదవులివ్వటం టీడీపీలో ఏ ఒక్కరికీ మింగుడుపడటం లేదు. మంత్రి పదవులపై టీడీపీ కాపు ఎమ్మెల్యే బోండా ఉమా అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన చేసిన కామెంట్లను బట్టి తెలుస్తోంది. బోండా ఉమా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. పార్టీలు మారిన నేతలకు పదవులు ఇచ్చారనే మాట ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతోంది.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన, కొలుసు పార్ధసారధి ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, ఆనం రామనారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు మరికొంత మంది ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. ఈ నేపథ్యంలో బోండా ఉమా వ్యాఖ్యలు పార్టీ పెద్దల తీరును తప్పుబట్టేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలా లేదని.. టీడీపీ, వైసీపీ కూటమి ప్రభుత్వంలా ఉందనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
