అంతర్జాతీయ మార్కెట్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ‘అబుదాబి’ సావరిన్ వెల్త్ ఫండ్స్ భారతదేశంపై తమ నమ్మకాన్ని మరింత పెంచుకున్నాయి. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ముబదాలా, ADQ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో తమ పెట్టుబడులను వేగంగా విస్తరిస్తున్నాయి. 2000 సంవత్సరం నుండి ఇప్పటివరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి భారత్‌కు వచ్చిన మొత్తం పెట్టుబడులు 25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2.10 లక్షల కోట్లు) దాటడం విశేషం.
సాధారణ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను బట్టి లాభాలు స్వీకరించి వెనక్కి తగ్గుతుంటారు. కానీ, ఈ సావరిన్ ఫండ్స్ అలా కాకుండా కొన్ని దశాబ్దాల సుదీర్ఘ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్థిరమైన పెట్టుబడులు పెడతాయి. ప్రస్తుతం బ్యాంకింగ్, ఎయిర్‌పోర్టులు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, హెల్త్‌కేర్, రిన్యూవబుల్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఉత్పాదక రంగాల్లో ఈ నిధులు విస్తరిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక భాగస్వామ్యం మాత్రమే కాదు.. భారతదేశ తదుపరి వృద్ధికి అవసరమైన కీలక రంగాల్లో వ్యూహాత్మక యాజమాన్యం అని నిపుణులు చెబుతున్నారు.
భౌగోళిక అనిశ్చితులు ఉన్నప్పటికీ, 2026 క్యాలెండర్ ఇయర్ మొదటి ఆరు నెలల్లోనే గల్ఫ్ సావరిన్ ఫండ్స్ భారతదేశంలో 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. ఇది గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన $700 మిలియన్లతో పోలిస్తే రెండింతలు కంటే ఎక్కువ. ఇందులో భాగంగా బ్యాంకింగ్ రంగానికి $3 బిలియన్లు, నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కు $1 బిలియన్, మరియు రిటైల్ హౌసింగ్ ఫైనాన్స్ కోసం మరో $1 బిలియన్ కేటాయించారు. సాంకేతిక రంగంలో అబుదాబికి చెందిన G42 సంస్థ భారత్‌లో భారీ AI సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇప్పటివరకు డిజిటల్ మరియు ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో యూఏఈ పెట్టుబడులు 8 బిలియన్ డాలర్లు దాటాయి.
అయితే భారీ సావరిన్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతున్నాయని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు బ్లైండ్‌గా ఆయా రంగాల షేర్లను కొనుగోలు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సావరిన్ నిధుల లక్ష్యాలు, కాలపరిమితి వేరుగా ఉంటాయి. అబుదాబి పెట్టుబడులు భారతదేశ ఆర్థిక సామర్థ్యానికి ఒక గట్టి ధృవీకరణ మాత్రమే. కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీల బలాలు, సంపాదన మరియు కార్పొరేట్ గవర్నెన్స్ ఆధారంగా మాత్రమే రీసెర్చ్ చేసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 100 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా, 2032 నాటికి దీనిని 200 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఇరు ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి