కెనడాలో భారత విద్యార్థులకు వర్క్ పర్మిట్ షాక్..!

కఠిన నిబంధనలతో ఇమ్మిగ్రేషన్ శాఖ హెచ్చరికలు!

Share this :

కెనడాలో ఉన్నత విద్యాభ్యాసం ముగించుకుని అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలని భావిస్తున్న వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కెనడా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. కొన్ని కళాశాలలు తాము ఆఫర్ చేసే కోర్సులకు పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ (PGWP) లభిస్తుందని తప్పుగా ప్రచారం చేయగా, విద్యార్థులు చదువు పూర్తి చేశాక ఆ కోర్సులు వర్క్ పర్మిట్‌కు అర్హమైనవి కాదంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించారు. ఈ ఇమ్మిగ్రేషన్ ఇబ్బందుల నేపథ్యంలో, కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ (IRCC) సంస్థ అంతర్జాతీయ విద్యార్థులు మరియు విదేశీ పౌరుల కోసం అత్యంత కీలకమైన హెచ్చరికలతో కూడిన ఒక నూతన మార్గదర్శకత్వాన్ని విడుదల చేసింది.

Also Read: జోగి రమేష్ ను వదిలేశారా..?

అధికారిక అనుమతులు లేకుండా కెనడాలో ఉద్యోగాలు చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐఆర్‌సీసీ (IRCC) స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే దేశం నుండి బహిష్కరించడంతో పాటు, కెనడాలోకి తిరిగి రాకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. అంతేకాకుండా, వారి ఇమ్మిగ్రేషన్ రికార్డులో శాశ్వతంగా ఫ్రాడ్ ఫ్లాగ్‌ను ఉంచుతామని, దీనివల్ల భవిష్యత్తులో వారికి ఎలాంటి వీసాలు లేదా పర్మనెంట్ రెసిడెన్సీ (PR) లభించే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది. విజిటర్ వీసా లేదా ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఉన్నంత మాత్రాన కెనడాలో పని చేసే హక్కు రాదని అధికారులు గుర్తుచేశారు.

Also Read: ప్రధాన్.. మోడీ రాడార్‌లోనే ఉన్నారా..?

ఈ నూతన అడ్వైజరీలో విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేసుకునే నిబంధనలను కూడా ఐఆర్‌సీసీ స్పష్టం చేసింది. స్టడీ పర్మిట్ నిబంధనల్లో అనుమతి ఉంటేనే విద్యార్థులు కెనడాలో పని చేయాలని, క్లాసులు జరిగే సమయంలో క్యాంపస్ వెలుపల వారానికి గరిష్టంగా 24 గంటలు మాత్రమే పని చేయడానికి అనుమతి ఉంటుందని వెల్లడించింది. నిర్ణీత సమయం కంటే ఎక్కువ గంటలు పని చేస్తే కెనడాలో వారి స్టూడెంట్ స్టేటస్ రద్దవుతుందని పేర్కొంది. ఉద్యోగ ఆఫర్లు లేదా వర్క్ పర్మిట్ల పేరుతో సోషల్ మీడియా ద్వారా డబ్బులు లేదా పత్రాలు అడిగే ఇమ్మిగ్రేషన్ మోసగాళ్లను నమ్మి మోసపోవద్దని, అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే కోర్సుల అర్హతలను సరిచూసుకోవాలని విద్యార్థులకు సూచించింది.