త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించనున్నట్లు వైసీపీ మాజీ ఎంపీ, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. 2024 ఎన్నికల తర్వాత నెమ్మదిగా వైసీపీకి దూరం జరిగిన విజయసాయిరెడ్డి.. సరిగ్గా 8 నెలల తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి టార్గెట్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్లుగా విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారు. ముందు జగన్ చుట్టూ కోటరీ ఉందని.. అందుకే జగన్ ఓడిపోయాడన్నారు. ఆ కోటరిని దూరం పెట్టకపోతే.. మళ్లీ గెలిచే పరిస్థితి లేదన్నారు కూడా. రాజీనామా సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన సాయిరెడ్డి.. ఆ తర్వాత మాత్రం పొలిటికల్ కామెంట్లు చేస్తూ.. వైసీపీ నేతలను ఇరుకున పెడుతూనే ఉన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించిన నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు. వైసీపీ ప్లీనరీ సమయంలో తనపై సజ్జల చెయ్యి చేసుకున్నాడని తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ముందు జగన్ జాగ్రత్త పడాలని సూచనలు చేసిన సాయిరెడ్డి.. ఆ తర్వాత నుంచి వైసీపీని కార్నర్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభం అని ప్రకటించిన సాయిరెడ్డి.. సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వైసీపీని కార్నర్ చేస్తున్నారు.
తాజాగా ఓ పాత వీడియోను సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి పోస్టు చేశారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ముందు చేసిన ప్రసంగాలను వీడియోలో ప్రస్తావించారు. ఓ క్రైస్తవుడిని సీఎం చేసుకుంటే.. రాష్ట్రానికి మేలు జరుగుతుందని.. క్రైస్తవులంతా ఇందుకు సహకరించాలంటూ ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే చేసిన ఈ ప్రసంగంపై రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, ఇతర రాజకీయ పార్టీలు తమ స్టాండ్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే వైసీపీలో కీలక నేతలను సాయిరెడ్డి ఇరుకున పెట్టేలా మరో ప్రశ్న వేశారు. “అంతేకాకుండా, గతంలో ఎంతమంది నాయకులు తమ ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఆ తర్వాత ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం, జగన్ గారిని ఆకట్టుకునేందుకు మతం మార్చుకున్నారో.. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్లో నంబర్ వన్ ఎవరైతే వారు సమాధానం చెప్పాలని కోరుతున్నా..” అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిజానికి ఈ ప్రశ్న నేరుగా పార్టీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసినట్లుగా ఉందనే మాట బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీలో జగన్ తర్వాత స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. వినాయకచవితి పండుగ పూజ కూడా సజ్జల నిర్వహించారు. అందుకే సజ్జలను వైసీపీలో నంబర్ వన్ అని సాయిరెడ్డి సెటైర్లు వేసినట్లు ఉంది.
ఇక సాయిరెడ్డి ప్రశ్న.. వైసీపీలో చాలా మంది నేతలను సూటిగా ప్రశ్నించినట్లు ఉంది. మంత్రి పదవి కోసమే మాజీ మంత్రి జోగి రమేశ్ మతం మార్చుకున్నారనే అపవాదు ఇప్పటికే వినిపిస్తోంది. తాజాగా జోగి కుటుంబ వివాదంలో కూడా ఆ ఇంట్లో బైబిల్ చదువుతారంటూ కోడలు మేఘన ఆరోపించారు. ఆ తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా తన కార్యాలయంలో ప్రార్థనలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా క్రైస్తవ మతానికి అనుకూలంగా సమావేశంలో మాట్లాడటం.. జగన్ను క్రైస్తవుడు అంటూ వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపుతోంది. జగను కుటుంబం మొదటి నుంచి క్రైస్తవ మతాచారాలను అనుసరిస్తున్నప్పటికీ.. వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు మాత్రం.. మా రెడ్డి.. మా కులపోడు అంటూ ఇప్పటి వరకు నెత్తిన పెట్టుకున్నారు. కానీ.. తాజాగా ద్వారంపూడి వీడియోతో జగన్ రెడ్డి కాదు.. అసలు సిసలు క్రైస్తవుడనే విషయం రెడ్డి సామాజిక వర్గం నేతలతో పాటు హిందూ సామాజిక వర్గం ప్రజలకు కూడా అర్థమైంది. మరి విజయసాయిరెడ్డి పోస్టు చేసిన వీడియోకు వైసీపీలో నంబర్ వన్ ఎవరైతే ఉన్నారో.. వారు సమాధానం చెప్తారా.. లేదా.. అనేది వేచి చూడాల్సి ఉంది.
