ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మళ్లీ రాజధాని అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ నేతలంతా అమరావతికి జై అంటుంటే.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా అమరావతి అంతా అవినీతిమయం.. అందుకే తాము అధికారంలోకి వస్తే.. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు నగరాలను కలిపి మావిగన్ అంటూ ప్రకటించారు. అలాగే 2029 ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ ప్రకటించారు. తమ అజెండా మావిగన్ అని.. ఎన్నికలకు ఇలాగే వెళ్తామన్నారు. జగన్ ప్రకటన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి విషయంలో చంద్రబాబు హీరో అవుతారా.. లేక జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా విలన్‌గా చరిత్రలో నిలిచిపోతారా.. అనే చర్చ నడుస్తోంది.
అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం విలన్‌గానే ఉన్నారు. ఇందుకు ఆయన అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలే కారణంగా చూపిస్తున్నారు. కానీ ఆయన కంటే పెద్ద విలన్ ఉన్నారనే మాట కూడా వినిపిస్తోంది. వాళ్లే సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ అని అమరావతి రైతులు విమర్శలు చేస్తున్నారు. విలన్‌ను బలవంతుడిని చేస్తున్నది ఈ ఇద్దరే అంటున్నారు. ఇందుకు ప్రధానంగా ఒక ఉదాహరణను ప్రస్తావిస్తున్నారు.
ఆయన సాధారణ అధికారి కాదు. దేశంలోనే అతి పెద్ద అర్బన్ డెవలప్మెంట్ సంస్థల్లో ఒకటైన ఎంఎంఆర్డీఏ కమిషనర్‌గా పనిచేశారు. ఆయన హయాంలో అటల్ సేతు, ముంబై మెట్రో, ధారావీ రీ డెవలప్మెంట్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ముందుకు సాగాయి. అర్బన్ డెవలప్మెంట్ రంగంలో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తి రిటైర్ అయిన తర్వాత, తన సొంత రాష్ట్రంలో నిర్మితమవుతున్న అమరావతికి సేవ చేయాలని వచ్చారు. కానీ పనిచేసే అధికారాలు లేకపోతే, నిర్ణయాల స్వేచ్ఛ లేకపోతే, అవసరమైన సిబ్బంది లేకపోతే, ఎంత సమర్థుడైనా ఫలితాలు ఎలా తీసుకురాగలరు..?
చివరకు ఎస్వీఆర్ శ్రీనివాస్ లాంటి అధికారి కూడా అవినీతిని అరికట్టలేక, ఏమీ చేయలేక, రాజీ పడలేక తప్పుకోవాల్సి వచ్చిందంటే.. సమస్య వ్యక్తిలో కాదు.. ప్రభుత్వ వ్యవస్థలో ఉందని అర్ధం అవుతోంది. రాత్రింబవళ్లు కష్టపడుతూ నిజాయతీగా పనిచేసే వారు, సీఎం చంద్రబాబుకు విధేయులు.. మంత్రి నారాయణకు అవసరం లేదనే విషయం సీఆర్డీఏ కమీషనర్ పోస్టు నుండి కాటమనేని భాస్కర్‌ను తప్పించినపుడే స్పష్టమైంది. అప్పుడు మంత్రి నారాయణ మాట విని, భాస్కర్‌ను అకారణంగా, అన్యాయంగా బదిలీ చేసినప్పుడే సీఎం చంద్రబాబు ప్రతిష్ట మంట గలిచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఎస్వీఆర్ శ్రీనివాస్ రాజీనామా ఉదంతం ఆ అభిప్రాయాన్ని మరింత బలపరిచింది.
ఒకప్పుడు సమర్థులైన అధికారులతో పనిచేయించి ఫలితాలు సాధించిన సీఎంగా చంద్రబాబుకు పేరు. ఇప్పుడు ఆయన చుట్టూ నిజాయతీ, సమర్ధత వున్న అధికారులు అరుదుగా ఉన్నారనేది బహిరంగ రహస్యం. కానీ ప్రస్తుతం అమరావతి రాజధాని పరిస్థితి చూస్తే, ఆ ప్రాధాన్యత, అప్పటి నాయకత్వం కనిపించడం లేదనే అభిప్రాయం కలుగుతోంది. ఏ ప్రభుత్వంలోనైనా పైస్థాయి నాయకత్వం ఒక ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటేనే వ్యవస్థ మొత్తం కదులుతుంది. ఆ ఆసక్తి, ఆ అత్యవసర భావన కనిపించకపోతే, పనులు కూడా అదే స్థాయిలో నెమ్మదిస్తాయి. అమరావతి పరిస్థితి ఈ ప్రశ్ననే లేవనెత్తుతోంది.
అమరావతిలో ఎక్కువగా కాంట్రాక్టులు ఇస్తున్నారు. కానీ అదే స్థాయిలో పనులు ఎందుకు జరగడం లేదంటే.. ఎక్కడో ఏవో తప్పులు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఆశించిన స్థాయిలో పురోగతి చూపని కాంట్రాక్టర్లకే.. మళ్లీ కొత్త పనులు ఎందుకు అప్పగిస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంట్రాక్టులు ఇవ్వడంలో కనిపిస్తున్న వేగం, పనులు పూర్తి చేయించడంలో ఎందుకు కనిపించడం లేదు..? జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికారంలో లేరు. అమరావతి నిర్మించే బాధ్యత కూడా ఆయనపై లేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. అమరావతి రాజధాని ప్రతిపాదన తెచ్చింది ఆయనే. ఆయన మాట నమ్మి వేలాది మంది రైతులు తమ భూములను స్వచ్చందంగా ఇచ్చారన్నది నిజం.
కాంట్రాక్టర్ల కోసం రైతులు భూములు ఇవ్వలేదు. ప్రపంచ స్థాయి రాజధాని కోసం భూములు ఇచ్చారు. అమరావతి విజయం సాధిస్తే.. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకే దక్కుతుంది. అమరావతి ఆలస్యమైనా కూడా ఆయనదే బాధ్యత. ఈ రోజు అమరావతికి ప్రధాన ప్రత్యర్థి ప్రతిపక్షం కాదు. అధికారంలో ఉన్న నాయకత్వం చూపిస్తున్న ప్రాధాన్యతా లోపమే అన్నది వాస్తవం. మంత్రి నారాయణను గుడ్డిగా నమ్మి.. విమర్శలు, ఆరోపణలను కొని తెచ్చుకున్నారా అనేది అమరావతి ప్రాంత రైతుల మాట.
