ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఎవరు నచ్చుతారు..? చంద్రబాబు నాయుడు ఎవరినీ దగ్గరకు తీస్తారు..? సమర్థులైన అధికారులను మంత్రి నారా లోకేష్ పట్టించుకోవటం లేదా..? కష్టపడి పని చేసిన వారికి కూటమి సర్కార్‌లో సరైన గుర్తింపు రావడం లేదా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలే ఏపీ సచివాలయంలో, పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్నాయి. నిజాయితీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప.. అవి ఆచరణలో పాటించటం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇందుకు ప్రస్తుతం సీఎంఓలో పని చేస్తున్న కాలకేయుడి గురించే అంటున్నారు కూడా. కాలకేయ అధికారి గురించి మీడియాలో ఆధారాలతో సహా కధనాలు వస్తున్నాయి. పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు కూడా కాలకేయుడి గురించి అధినేతకు ఫిర్యాదులు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయినా సరే.. అవేవీ పట్టించుకోవటం లేదు.
సీఎంఓలో కాలకేయుడు ఉన్నాడనేది ఇప్పుడు కూటమి సర్కార్‌లో, సచివాలయంలో, తెలుగుదేశం పార్టీలో బాగా వినిపిస్తున్న మాట. ఈయన పైన ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. ఒకదశలో పార్టీకి చెందిన ఓ మహిళా ఎంపీతోనే దురుసుగా ప్రవర్తించారని నేరుగా అధినేత చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు కూడా. అయినా సరే.. సీఎం చంద్రబాబు మాత్రం కనీసం పట్టించుకోవటం లేదు. దీని వెనుక ఎవరి ఒత్తిడి ఉందో అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కాలకేయుడిని అటు చంద్రబాబు, ఇటు లోకేష్.. ఇద్దరు సన్నిహితంగానే భావిస్తున్నారట.
తాజాగా ఈ కాలకేయ అధికారి చేసిన మరో ఘనకార్యం గురించి సచివాలయంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నిజాయితీపరుడు, సమర్థవంతుడు అనే పేరుతున్న ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్. ఇంకా చెప్పాలంటే.. ముక్కుసూటిగా, రూల్స్ ప్రకారం పని చేస్తారు కూడా. అలాంటి కాటమనేని భాస్కర్‌ను బదిలీ చేయించేందుకు కాలకేయుడు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారట. ఆయన నిర్వహిస్తున్న శాఖలలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను కాటమనేనికి కూడా తెలియకుండా బదిలీ కాలకేయుడు చేయించారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ బదిలీల విషయం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‍కు కూడా తెలుసంటున్నారు.
భాస్కర్ నిర్వహిస్తున్న శాఖలలో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేసేటప్పుడు సీఎస్ సాయి ప్రసాద్ కూడా ఆయనకు కనీస సమాచారం ఇవ్వకుండా సైలెంట్‌గా పని చేసేశారంట. ఇంత రహస్యంగా బదిలీలు చేయటం వెనుక మర్మం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్. కాటమనేని భాస్కర్ నిర్వహిస్తున్న శాఖల్లో పని చేస్తున్న అధికారులను ఆయనకే తెలియకుండా బదిలీ చేయటం ఎంత మాత్రం సమంజసం కాదంటున్నారు సచివాలయ ఉద్యోగులు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బదిలీ చేసిన అధికారులందరూ సమర్థులు, కష్టపడి పని చేసే వారే అంటున్నారు. అసలు అలాంటి వారిని ఎందుకు బదిలీ చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కొసమెరుపు ఏమిటంటే.. కాటమనేని భాస్కర్ సెలవులో ఉన్నప్పుడే ఈ అధికారుల బదిలీలు జరిగాయి. అంటే కావాలని.. ఓ పధకం ప్రకారం ఆ అధికారులను కాలకేయుడు బదిలీ చేయించి ఉంటారని స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు సచివాలయంలో అందరి నోటా ఒకటే మాట.. పోయే కాలం దాపురించింది కాబట్టే.. కాలకేయుడు రెచ్చిపోతున్నాడంటున్నారు. వినాశకాలే.. విపరీత బుద్ధి.. చివరకు సీఎస్ సాయి ప్రసాద్ కూడా కాలకేయ అధికారికి సహకరిస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. తన సర్వీస్ పొడిగింపునకు కాలకేయుడు సహకరిస్తాడనే ఆశతో సీఎస్ సాయిప్రసాద్ ఉన్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అండగా ఉంటున్న వారు.. రేపు అండగా ఉంటారన్న నమ్మకం ప్రస్తుతం లేదు. కాబట్టి కాలకేయుడి భవిష్యత్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
