‘పుష్ప’ గ్యాంగ్‌పై పవన్ కళ్యాణ్ గురి.!

జీరో టాలరెన్స్ అమలుకు డిప్యూటీ సీఎం ఆదేశం

Share this :

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శేషాచలం అడవులను కొల్లగొడుతున్న ఎర్రచందనం స్మగ్లర్ల వేటపై ప్రత్యేక దృష్టి సారించారు. సినిమా స్టైల్‌లో సాగుతున్న ‘పుష్ప’ బ్యాచ్‌ అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం మాఫియా మూలాలను పూర్తిగా నిర్మూలించాలని, స్మగ్లింగ్ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టకుండా ‘జీరో టాలరెన్స్’విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Also Read: ఇంచార్జ్ మంత్రులకు చంద్రబాబు చురకలు.!

అడవుల్లో కేవలం సిబ్బందితో నిఘా పెట్టడమే కాకుండా, స్మగ్లర్ల కదలికలను ముందే పసిగట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని డిప్యూటీ సీఎం సూచించారు. శేషాచలం అడవుల వ్యాప్తంగా డ్రోన్లు, అధునాతన నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి బందోబస్తును మరింత పటిష్టం చేయాలన్నారు. కేవలం అడవుల్లో నరికే కూలీలను మాత్రమే కాకుండా, ఈ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న కింగ్‌పిన్స్, తెరవెనుక ఉండి కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్న ఫైనాన్షియర్లపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 Also Read: రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

కేవలం ఏపీలోనే కాకుండా దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమ నిల్వలు ఉన్నా.. అంతర్రాష్ట్ర పోలీసుల సమన్వయంతో వాటిని పట్టుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ శాఖ అధికారులు గత రెండేళ్లలో సాధించిన పురోగతిని పవన్ కళ్యాణ్‌ కు వివరించారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి గత రెండేళ్ల కాలంలో మొత్తం 506 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లలో ఏకంగా 1,239 మంది స్మగ్లర్లను, కూలీలను అరెస్ట్ చేశామని, అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ సీఎంకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మార్క్ కఠిన నిర్ణయాలతో రాబోయే రోజుల్లో ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు పూర్తిగా బ్రేకులు పడతాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.