ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీకేజీల వ్యవహారం రాజకీయంగా పెను తుఫాను సృష్టిస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ లోపలా, బయటా ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గతంలో దేశంలో ఇలాంటి పెద్ద సంక్షోభాలు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వ ప్రతిష్టను కాపాడేందుకు కేంద్ర మంత్రులు చూపిన “నైతిక బాధ్యత”, రాజీనామాల చరిత్ర మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
భారత రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఒకప్పుడు పాలకులు ప్రజాస్వామ్య విలువలకు, ప్రజల నమ్మకానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. 1956లో తమిళనాడులోని అరియలూర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా సమర్పించారు. స్వయంగా ప్రధాని నెహ్రూ నిరాకరించినప్పటికీ, శాస్త్రి గారు తన నిర్ణయానికే కట్టుబడి ఉండి నైతికతను చాటుకున్నారు. అదేవిధంగా, 1993లో వరుస విమాన ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి మాధవరావు సింధియా తక్షణమే తప్పుకున్నారు.
ఆ తర్వాత 1999లో అటల్ బిహారీ వాజపేయి హయాంలో గైసల్ రైలు ప్రమాదం జరిగినప్పుడు, అప్పటి రైల్వే మంత్రి నితీష్ కుమార్ కూడా ప్రమాద తీవ్రతకు చలించి నైతిక బాధ్యతతో రాజీనామా చేశారు. ఈ నాయకులెవరూ స్వయంగా వెళ్లి ఆ తప్పులు చేయకపోయినా.. తమ శాఖ పరిధిలో వ్యవస్థ విఫలమైనందుకు బాధ్యత వహించారు. కానీ, ప్రస్తుత ఢిల్లీ పరిణామాలను చూస్తే నాటి రాజకీయ నైతికతకు, నేటి పాలకుల వ్యూహాలకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్త నీట్ పరీక్షల లీకేజీల వల్ల విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ అస్సలు ఇష్టపడటం లేదు. ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి మంత్రి చేత రాజీనామా చేయిస్తే అది ప్రభుత్వం బ్యాక్‌ఫుట్‌లోకి వెళ్లిపోయిందనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని బీజేపీ భావిస్తోంది. అందుకే నిరసనకారులను శాంతింపజేయడానికి హోం మంత్రి అమిత్ షాను కాకుండా, సున్నితంగా మాట్లాడే కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను చర్చల కోసం రంగంలోకి దించారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి