కాంగ్రెస్ కు శరద్ పవార్ షాక్..? ఎన్డియేలో చేరేందుకు రెడీ..!

డీలిమిటేషన్ కు పవార్ గ్రీన్ సిగ్నల్

Share this :

పార్లమెంట్‌లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వివాదాస్పద ‘డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లు’కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP – శరద్ పవార్ వర్గం) మద్దతు ఇవ్వడంపై ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే కీలక సంకేతాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న ఈ బిల్లులో అన్ని రాష్ట్రాల్లోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే నిబంధనను చేరిస్తే, తాము బిల్లుపై చర్చించి మద్దతు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

Also Read: వాడేసి వదిలేశారా..? ప్రశ్న రావణ్‌కు వైసీపీ హ్యాండ్..!

ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించిన సర్వపక్ష సమావేశానికి తాము హాజరైనట్లు సూలే వెల్లడించారు. కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచే ఫార్ములాను కేంద్ర మంత్రులు ప్రతిపాదించారని, అయితే బిల్లు పూర్తి ప్రతి తమ చేతికి వచ్చాక అధ్యయనం చేసి తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.

ఇదే సమయంలో శరద్ పవార్ నేతృత్వంలోని తమ పార్టీ త్వరలోనే బీజేపీ కూటమి (NDA) లోకి మారబోతోందంటూ వస్తున్న ఊహాగానాలను సుప్రియా సూలే తీవ్రంగా ఖండించారు. “మా పార్టీపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. మేం ఎక్కడికీ వెళ్లడం లేదు.. ఇండియా (INDIA) కూటమిలోనే గట్టిగా కొనసాగుతాం” అని ఆమె తేల్చిచెప్పారు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ప్రాంతీయ పార్టీలను బీజేపీ ఆకర్షిస్తోందన్న కాంగ్రెస్ నేత పి. చిదంబరం ట్వీట్ నేపథ్యంలో సూలే ఈ స్పష్టత ఇచ్చారు.

Also Read: అన్నా ఏంటి ఇది..? జగన్ పై వైసీపీ క్యాడర్ ఫైర్..!

గత ఏప్రిల్ నెలలో పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ లేకపోవడంతో ఈ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. అయితే, వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో సరికొత్త సవరణలతో ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగానే కేంద్రం ఈ 50% సీట్ల పెంపు ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

leave a reply