కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ఆయన పాడె మోయడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో పార్టీకి చెందిన ఎంతో మంది ముఖ్య నేతలు, మంత్రులు మరణించినప్పుడు కనీసం చివరి చూపుకు కూడా రాని జగన్, ఇప్పుడు ముద్రగడ విషయంలో ఇంతలా ఎమోషనల్ కావడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం ఉందంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల వెల్లువ కురుస్తోంది. కేవలం కాపు సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకే జగన్ ఈ విధమైన డ్రామాలు ఆడుతున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందినప్పుడు జగన్ ఆయన అంత్యక్రియలకు హాజరైనప్పటికీ పాడె మోయలేదు. అలాగే పార్టీ కోసం మొదటి నుంచి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఎంతో మంది దళిత, వెనుకబడిన వర్గాల (BC) సీనియర్ నాయకులు మరణించినా జగన్ ఇటువంటి ఆత్మీయతను ఎప్పుడూ ప్రదర్శించలేదని గుర్తు చేస్తున్నారు. సొంత పార్టీ మంత్రులను, నమ్మిన బంటులను కాదని, కేవలం ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి పాడె మోయడం వెనుక ఉన్న కపటత్వాన్ని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు.
దీనికి తోడు, సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైనప్పుడు జగన్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా నెటిజన్లు తీవ్రంగా ఎండగడుతున్నారు. వివేకా హత్య కేసులోని ప్రధాన నిందితులను కాపాడేందుకు సర్వశక్తులూ ఒడ్డారని, ఆఖరికి సొంత తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలను కూడా దూరం పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తున్నారు. సొంత రక్తసంబంధీకులను, కుటుంబాన్ని ముక్కలు చేస్తూ, హత్య నిందితులకు అండగా నిలిచిన వ్యక్తి.. ఈరోజు ముద్రగడ అంతిమయాత్రలో కన్నీరు పెట్టుకుంటూ పాడె మోయడం చూస్తుంటే ముమ్మాటికీ రాజకీయ లబ్ధి కోసమేనని స్పష్టమవుతోందని విమర్శిస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై రాజకీయ కక్ష సాధింపునకు, కాపు ఓట్లను చీల్చేందుకు ముద్రగడను వాడుకున్న జగన్, ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ విమర్శకులు ధ్వజమెత్తుతున్నారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి