రోజా మౌనం వెనుక సీఎంఓ అధికారి..?

వైసీపీ మాజీ మంత్రి రోజా రెడ్డి మౌనం వెనుక కారణాలేమిటి..?

Share this :

వైసీపీ మాజీ మంత్రి రోజా రెడ్డి మౌనం వెనుక కారణాలేమిటి..? అధికారంలో ఉన్నా లేకున్నా.. పార్టీలతో సంబంధం లేకుండా దూకుడుగా వ్యవహరిస్తారనేది రోజాకు ఉన్న పేరు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన రోజా.. ఏకంగా తెలుగు మహిళ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాటి కాంగ్రెస్ సర్కార్‌పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దూకుడుగా వ్యవహరించారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఒంటికాలిపై ఫైర్ అయ్యారు. చివరికి 2009 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసిన రోజా.. పంచెలూడదీస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read: సంజు శాంసన్‌కు ఒక రూల్, అభిషేక్ శర్మకు ఒక రూలా..?

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు స్పీకర్ పైన, ముఖ్యమంత్రి, మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన, తెలుగుదేశం పార్టీ నేతల పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయారు. మంత్రిగా ఉన్న సమయంలో అయితే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టులో ఆయన అభిమానులను అవమానపరిచేలా అసభ్యకరమైన సంజ్ఞలతో అత్యంత జుగుప్సాకరంగా మిడిల్ ఫింగర్ చూపించి వారిని రెచ్చగొట్టారు. చివరికి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన రోజా.. సైలెంట్‌గా అక్కడ నుంచి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పారిపోయారు. ఆ తర్వాత తనపై హత్యాయత్నం చేశారంటూ లబోదిబోమన్నారు.

అలాంటి రోజా.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ ఎత్తున అవినీతి పాల్పడినట్లు రోజా పైన ఆరోపణలు. ఈ కేసు విచారణ ఇప్పటికే కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్టు తప్పదనే భయంతోనే రోజా సైలెంట్‌గా ఉన్నారనేది అంతా అనుకుంటున్నారు. అయితే అసలు కారణం వేరే ఉందనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. రోజా మౌనం వెనుక సీఎంఓ అధికారి ఉన్నారనే మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రోజాను కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉండాలని సదరు అధికారే సలహా ఇచ్చారనేది ప్రస్తుతం వైసీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు.

ప్రస్తుత చంద్రబాబు సీఎంఓలో వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారి ఒకరున్నారని.. ఆయనను శ్రీకృష్ణుని కుమారుడు అనీ పలువురు ముద్దుగా కామెంట్ చేస్తుంటారు. ఇప్పటికీ ఆయనను వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారిగా పలువురు చెప్పుకుంటుంటారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఒక వెలుగు వెలిగారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారి నిర్వహించాల్సిన పోస్టును.. కార్యదర్శి హోదాలో ఉన్న ఈ సీఎంఓ అధికారి నిర్వహించగలిగారంటే.. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితుడో ఇట్లే అర్థమవుతుంది. ప్రస్తుతం సదరు అధికారిని గుడ్డిగా నమ్మి తన పేషీలో సీఎం చంద్రబాబు ఏరి కోరి నియమించుకున్నారనేది సన్నిహితుల మాట.

“ఆడుదాం ఆంధ్ర” కుంభకోణంలో అప్పటి వైసీపీ మంత్రి రోజాతో పాటు అనేక మంది ఐఏఎస్ అధికారులు, అప్పటి శాఫ్ చైర్మన్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉందని విజిలెన్స్ అధికారులు రిపోర్టు ఇచ్చి నెలలు గడుస్తున్నా కూడా.. పాలకులు పట్టించుకోవటం లేదు. అదిగో.. ఇదిగో.. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా రెడ్డిపై చర్యలు తీసుకోవటం ఖాయమంటూ అప్పుడప్పుడు టీడీపీ మంత్రులు, నేతలతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తమ అధినేతను బండబూతులు తిట్టిన రోజా అరెస్టు ఖాయమని బాగా నమ్మేశారు. కానీ ఇప్పుడు అసలు అరెస్టు ఉంటుందా.. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల రోజా సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే.. రోజా పైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీఎంఓ అధికారి అడ్డుపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. “సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దు..” అని ఆమె నోరును సీఎంఓ అధికారి మూయించారట. అందుకే ఇటీవల కాలంలో వైసీపీ మాజీ మంత్రి రోజా రెడ్డి మౌనవ్రతం పాటిస్తున్నారని పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు జరుగుతున్నా కూడా రోజా కనీసం స్పందించడం లేదు. ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం లేదు.

Also Read: కేబినెట్ మీటింగ్‌కు పవన్ ఎందుకు రావటం లేదు..?

అప్పట్లో ఆడుదాం ఆంధ్రలో జరిగిన కుంభకోణంలో ప్రస్తుత సీఎంఓ అధికారి ప్రమేయం కూడా ఉందని, విజిలెన్స్ రిపోర్టులో ఉందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఆ కుంభకోణంలో నిందితులను తెర వెనుక నుంచి కాపాడుతున్నారేమో అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ కుంభకోణంలో అనేక మంది అధికారుల పాత్ర స్పష్టంగా ఉందని, వారందరిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ నివేదికలో ఉండటంతో.. ముందుగా రోజా రెడ్డి పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆమెపై చర్యలు తీసుకుంటే.. ఎక్కడ తన బండారం బయట పడుతుందో అని సీఎంఓ అధికారి భయపడుతున్నారేమో..? అదే కుంభకోణంలో, మరో కీలక పాత్రధారి అయిన వైసీపీ నాయకుడైన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై విమర్శలు చేయటం లేదు. దూకుడు తగ్గించి మౌనం పాటించమని వైసీపీ నేతలు రోజా, బైరెడ్డికి సదరు సీఎంఓ అధికారే సలహా ఇచ్చారనే మాట బాగా వినిపిస్తోంది.