జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత యువ క్రికెట్ జట్టు సెలెక్షన్ విధానంపై టీమ్ ఇండియా సీనియర్ బ్యాటర్ హనుమ విహారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్నా ఓపెనర్ అభిషేక్ శర్మకు పదే పదే అవకాశాలు ఇవ్వడంపై ఆయన ఘాటుగా స్పందించాడు. ఇదే సమయంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను ఉద్దేశిస్తూ.. టీమ్ ఇండియాలో ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన రూల్స్ ఎందుకు వర్తింపజేస్తున్నారంటూ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సెలెక్టర్లను నిలదీశాడు.
అభిషేక్ శర్మ ఫామ్‌ను ప్రశ్నిస్తూ హనుమ విహారి కీలక గణాంకాలను తెరపైకి తెచ్చాడు. యూకే సిరీస్ నుంచి ఇప్పటివరకు ఆడిన గత ఎనిమిది మ్యాచ్‌ల్లో అభిషేక్ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడని, కనీసం 20 లేదా 30 పరుగులు కూడా చేయలేకపోయినా అతనికి వరుస ఛాన్సులు ఇస్తున్నారని విమర్శించాడు. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లోనూ అభిషేక్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడని గుర్తు చేశాడు. వరల్డ్ కప్ సిరీస్‌తో కలిపితే గత 18 మ్యాచ్‌ల్లో అతనికి కేవలం మూడు అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయని, అయినా సరే అతని చుట్టూ ఉన్న హైప్ వల్ల జట్టులో కొనసాగిస్తున్నారని ఆరోపించాడు.
మరోవైపు సంజు శాంసన్ విషయంలో సెలెక్టర్లు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాన్ని హనుమ విహారి తప్పుబట్టాడు. వరల్డ్ కప్‌లో సంజు శాంసన్ కేవలం మూడు మ్యాచ్‌లు ఆడి, మూడింటిలోనూ బ్యాక్-టు-బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి అద్భుతంగా రాణించాడని పేర్కొన్నాడు. గతంలో కేవలం ఐదు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడనే కారణంతో శాంసన్‌ను జట్టు నుంచి తొలగించారని, కానీ ఇప్పుడు అంతకంటే ఘోరంగా వైఫల్యం చెందుతున్న అభిషేక్ శర్మపై ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. శాంసన్ కూడా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడని, ఒత్తిడితో కూడిన పెద్ద మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించే సత్తా అతనికి ఉందని చెప్తూ.. ఆటగాళ్లను బట్టి సెలెక్షన్ రూల్స్ మార్చడం ఎంతవరకు న్యాయమని హనుమ విహారి ప్రశ్నించాడు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి