కేబినెట్ మీటింగ్‌కు పవన్ ఎందుకు రావటం లేదు..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి వర్గ సమావేశాలకు కావాలనే హాజరు కావటం లేదా..?

Share this :

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి వర్గ సమావేశాలకు కావాలనే హాజరు కావటం లేదా..? ఇదే అంశంపైన వైసీపీ సోషల్ మీడియా పదే పదే ఎందుకు ప్రచారం చేస్తోంది..? కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుదని.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని.. సీఎంగా చంద్రబాబు ఉంటారని అనేక సందర్భాల్లో చాలా బలంగా స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. నిజానికి ఈ మాట వైసీపీ నేతలను కొంత కలవరపాటుకు గురి చేస్తోంది కూడా. పొత్తు కొనసాగితే.. తమ గెలుపు కష్టమని ఆ పార్టీ నేతలు ఇప్పటికే నర్మగర్భంగా వ్యాఖ్యానించారు కూడా. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తన పార్టీ ముఖ్యనేతలతో జరిగిన ఆంతరంగిక సమావేశాల్లో కూడా హెచ్చరించారు.

Also Read: వైఎస్ షర్మిలకు సర్జరీ.. కనీసం పలకరించని జగన్..!

దీంతో వైసీపీ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ మీడియా, ఆ పార్టీ అనుబంధ మీడియాలు, అభిమాన సోషల్ మీడియాలు రకరకాలుగా వంకర ప్రచారం మొదలుపెట్టాయి. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే.. వైసీపీ మీడియా పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలే నమ్మటం లేదు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలున్నాయని ఒకసారి కథనాలు ప్రసారం చేశారు. ఆ తర్వాత లోకేష్ సీఎం అంటూ ఫేక్ న్యూస్ పెట్టారు. లోకేష్ సీఎం అని.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారని.. ప్రసారం చేశారు. ఇక నాలుగు రోజుల క్రితం అయితే.. పవన్ గురించి లోకేష్ ఆరా తీస్తున్నారని.. పవన్ ఎవరెవర్ని కలుస్తున్నారో లోకేష్ తెలుసుకుంటున్నారంటూ వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి కూడా. అయితే వీటిని వైసీపీ కార్యకర్తలే నమ్మలేదు.

ఇవన్నీ ఫేక్ అని తేలడంతో ఇప్పుడు మరో కొత్త ప్రచారానికి వైసీపీ మీడియాతో పాటు అనుబంధ మీడియా, వైసీపీ సోషల్ మీడియా కూడా శ్రీకారం చుట్టింది. అది ఏమిటంటే.. మంత్రి వర్గ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావాలనే దూరంగా ఉంటున్నారని… దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయంటూ ప్రచారం షురూ చేశాయి. మంత్రి వర్గ సమావేశాలకు వెళ్లకుండా.. సవాలక్ష అనారోగ్య కారణాలు చెబుతున్నారని కూడా వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. ఒకవేళ మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాకుంటే ముందుగానే సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. చంద్రబాబు అనుమతి తీసుకుంటున్నారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ సహచరులతో పాటు పవన్ అధికారులు కూడా చెబుతున్నారు.

Also Read: ఇండియా కూటమి ఎమర్జెన్సీ మీటింగ్.!

నిజానికి వైసీపీ మీడియా ప్రసారం చేస్తున్న కథనాలను ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులే నమ్మటం లేదు. సాక్షి మీడియా అంటే వైసీపీ అధికార కరపత్రం. కాబట్టి.. అందులో వైసీపీకి అనుకూలంగా, కూటమికి వ్యతిరేకంగా వార్తలు వస్తాయి తప్ప.. వాస్తవాలు రావని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు తెలుసు. అందుకే వైసీపీ నేతలతో పాటు టీడీపీ, జనసేన పార్టీల అభిమానులు కూడా సాక్షిలో వచ్చే వార్తలను నమ్మటం లేదు. అసలు ఆ పత్రికలను కూడా చదవటం లేదు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఏది ఏమైనా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ విభేదాలు సృష్టించేందుకు వైసీపీ మీడియా చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలం అయ్యాయని పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.