టీడీపీలో క్రమ శిక్షణ తప్పుతోందా ..?

ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు!

Share this :

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యుల ప్రవర్తన ఆందోళనకరంగా మారుతోంది. గతంలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టీడీపీలో ఇప్పుడు కొందరు నేతలు మీడియా ముందుకు వస్తే తమ నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి, తమ వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత ప్రభుత్వ ప్రతిష్టను, అధిష్టానాన్ని ఇరుకున పెడుతున్నారు.

Also Read: ఉరవకొండలో వైసీపీ రచ్చ రచ్చ.!

కేడర్‌ను నడిపించాల్సిన శాసనసభ్యులే ఇలా ‘నోటి దూల’ ప్రదర్శిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వెనుక ఉన్న అంతర్గత అసంతృప్తి, లేదా అధికార అహంకారమా అనే కోణంలో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విశ్లేషణలు సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు కీలక నేతల వ్యవహార శైలి ఈ క్రమశిక్షణా రాహిత్యానికి అద్దం పడుతోంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గెలిచినప్పటి నుండి సొంత పార్టీ ఎంపీతో విభేదాల నుంచి మొదలుపెట్టి, ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టే వరకు వెళ్లారు.

మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సైతం మాజీ ఎమ్మెల్యే అనుచరులకు కాంట్రాక్టులు ఇస్తున్నారంటూ బహిరంగంగానే సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి కలకలం రేపారు. వీటికి తోడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొని విపక్ష నేతలతో వేదిక పంచుకోవడమే కాకుండా, కాపు సామాజికవర్గ సమీకరణాలను టచ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఒకరి వివాదం సద్దుమణుగుతోందనుకునే లోపే మరొకరు లైన్ దాటుతూ పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read: అర్ధమైందా రాజా..? లోకేష్, పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.!

ఈ వరుస పరిణామాలపై స్పందించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించారు. పార్టీలో ఎంతటి సీనియర్ నేత అయినా, ప్రజాప్రతినిధి అయినా సరే ‘పార్టీ క్రమశిక్షణ’ కంటే ఎవరూ ఎక్కువ కాదని, గీత దాటితే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని త్రిసభ్య క్రమశిక్షణా కమిటీ సదరు ఎమ్మెల్యేలను పిలిపించి వివరణలు సేకరించింది. ఐదేళ్ల పాటు కష్టపడి సాధించుకున్న అధికారాన్ని, కేవలం కొందరు నేతల అనాలోచిత నోటి దురుసు వల్ల మరియు అంతర్గత విభేదాల వల్ల దెబ్బతిననివ్వకూడదని, రాబోయే రోజుల్లో క్రమశిక్షణ ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని అధిష్టానం శ్రేణులకు గట్టి సంకేతాలు పంపింది.