ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైన చారిత్రాత్మక వేళ, ‘భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ప్రారంభోత్సవ సభ అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక ఎయిర్‌పోర్ట్ జాతికి అంకితమైన నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వ నేతలు ఉత్తరాంధ్ర ప్రగతిపై శంఖారావం పూరించారు. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సాధన, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌కు ఈ ఎయిర్‌పోర్ట్ ఒక నిలువెత్తు ప్రతిరూపమని సభా వేదికగా నేతలు కొనియాడారు.
ఈ చారిత్రాత్మక సభలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతంగా సాకారం చేస్తున్నారని ప్రశంసించారు. వికసిత్ భారత్ సాధన దిశగా ప్రధాని చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. ఇదే వేదికపై మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును స్మరించుకుంటూ.. ‘తెలుగుజాతి ఎవరికీ తలవంచదని’ నాడు అల్లూరి గర్జించారని, ఈ రోజు ఆయన పేరుతో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ రావడం గర్వకారణమన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఇక్కడి గిరిజన ప్రాంతాల ప్రగతికి ఈ ఎయిర్‌పోర్ట్ ఎంతో కీలక పాత్ర పోషించబోతోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో సభలో జోష్ నింపారు. “నాడు ఎర్రబస్సు కూడా సరిగ్గా రాదన్న చోట.. నేడు అంతర్జాతీయ ఎయిర్ బస్సు వచ్చి ల్యాండ్ అయింది” అంటూ భోగాపురం ప్రస్థానాన్ని వివరించారు. “ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.. అర్థమైందా రాజా..” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో భారీ ఈలలు, కేకలతో మారుమోగాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతం ఇకపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి ప్రధాన ‘పవర్ ఇంజిన్’గా మారబోతోందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఇంతటి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను శరవేగంగా నిర్మించిన జీఎంఆర్ సంస్థను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి