జిల్లా కలెక్టర్‌ను బందిపోటు దొంగ “డాకు మంగల్ సింగ్” తో పోల్చడం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్. జిల్లా కలెక్టర్ గురించి నేరుగా అవినీతి ఆరోపణలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. అక్రమాలకు పాల్పడుతున్నారని.. కమిషన్‌లు తీసుకొంటున్నారంటూ నేరుగా కలెక్టర్ పేరు చెప్పి మరీ ఆరోపణలు చేసిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ అదృష్టం ఆ కలెక్టర్ గారెకి మాత్రమే దక్కిందని పలువురు సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ ఆరోపణల వెనుక తమను చంద్రబాబు ఏమీ చేయరనే మొండి ధైర్యం బాగా ఉందేమో అని అనిపిస్తోంది.
జిల్లా కలెక్టర్ పైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. ఆ ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కూడా. అలాంటి అధికారిని “డాకు మంగల్ సింగ్” తో పోల్చటం ఏమిటి..? ఆధారాలు లేని అవినీతి ఆరోపణలు చేయటం ఏమిటి..? ఆధారాలు చూపించకుండా అక్రమాలకు పాల్పడుతున్నారనటం ఏమిటి..? జిల్లా స్థాయి జడ్జి గారిని ఇలా నోటికి వచ్చినట్లు నిందంచవచ్చా..? రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై చేసే విమర్శలు, ఆరోపణలను కలెక్టర్ పై చేయటంలో మర్మమేమిటి..? తన అధికారంతో భూముల సెటిల్‌మెంట్‌లు చేస్తూ.. కమిషన్ తీసుకుంటున్నారని, భూముల రెగ్యులరైజేషన్ ఫైల్స్ మార్చి వేస్తున్నారని.. ఆధారాలు చూపించకుండా నోటికొచ్చినట్లు కలెక్టర్ పైన ఇంకెన్నో అనరాని మాటలు అన్నారు.
ఒక జిల్లా కలెక్టర్ గురించి ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా అనని పదం “బందిపోటు” అనటం అంటే.. జిల్లా జడ్జినే అవమానించటమే. ఇది ఎక్కడో కాదు.. హిందువులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రమైన తిరుపతి నడిబొడ్డున.. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే, భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి.. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుపైన దుమ్మెత్తిపోశారు. రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్‌లతో సుమారు రెండు వేల కోట్లు లూటీ కూడా చేశారని, తిరుపతి కలెక్టర్ పైన ఆధారాలు లేని ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఇసుక అక్రమ రవాణాలో రోజుకు 50 లక్షలు, గ్రావెల్ అక్రమ రవాణాలో రోజుకు 25 లక్షలు చొప్పున రోజు వారి వాటా కొట్టేస్తున్నారని కూడా ఆరోపిస్తూ.. ఆ విధంగా అక్రమంగా సంపాదించిన సొమ్మును తన మామతో బెంగుళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తున్నారని.. కలెక్టర్ వెంకటేశ్వర్లు పైన తీవ్ర ఆరోపణలు చేశారు.
మా ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం.. కలెక్టర్ అవినీతి, అక్రమాలపై విచారణ చేయిస్తామని, భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు కూడా. మరి ఇలా ఓ కలెక్టర్‌పైన మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా.. కలెక్టర్‌పై చేసిన ఆరోపణలకు భూమన రుజువులు చూపించగలరా.. భూమన చేసిన చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే.. మాజీ ఎమ్మెల్యేపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా.. లేదా.. తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.
