తాజా వార్తలు

AP Politics: వైసీపీ కుట్రలకు కాపు బ్రేకులు..!

70కి పైగా నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం

Share this :

కాపులను ముక్కలు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుందా..? కాపులను ఆకర్షించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా..? అసలు కాపులు ఎటు వైపు ఉన్నారు..? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ నుంచి కాపులను దూరం చేసే ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుంది..? అసలు కాపులు.. పవన్‌ను కాదని దూరం అవుతారా..?.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు అటు పొలిటికల్ సర్కిల్‌లో, ఇటు కాపు సామాజిక వర్గంలో బాగా వినిపిస్తున్నాయి. నిజానికి కాపులను ఇప్పటి వరకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. ఇంకా చెప్పాలంటే.. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాపులను తమ రాజకీయ ఎదుగుదలకు ఒక నిచ్చెన మాదిరిగానే వాడుకున్నారు తప్ప.. వారికి సముచిత స్థానం ఇవ్వలేదనేది బహిరంగ రహస్యం.

ప్రస్తుతం కాపులంతా ఏకతాటిపైన ఉన్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఇది మొన్నటి 2024 ఎన్నికల్లో రుజువైంది కూడా. నిన్నటి వరకు తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లేదని.. అన్ని రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని కాపులు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న సమయంలో జనసేన పార్టీని పవన్ ప్రారంభించారు. దీంతో కాపులంతా తమ నాయకుడిగా పవన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పవన్ వెంట నడిచారు. పవన్‌ రాజకీయ ప్రయాణంలో అడుగులు వేశారు. అందుకే.. 2019-24 మధ్య వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే.. సైలెంట్‌గా ఎన్నికల వరకు భరించారు. సరిగ్గా ఎన్నికల్లో వైసీపీని చావు దెబ్బ తీశారు.

ఏపీలో అతి పెద్ద సామాజిక వర్గాల్లో ఒకటిగా కాపులున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సహా గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కాపులే కీలకం. దాదాపు 70కి పైగా నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాల్లో కాపుల ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అలాంటి కాపులంతా ఇప్పుడు పవన్‌ వెంట ఉన్నారు. అయితే ఇదే వైసీపీ నేతలకు మింగుడు పడని అంశం. కాపులంతా ఐక్యంగా ఉంటే.. మరోసారి తమకు ఓటమి ఖాయమనే మాట ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఆ పార్టీ అంతర్గత సమావేశంలో తన సన్నిహిత, సొంత సామాజిక వర్గం నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అందుకే.. కొందరు వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్లు పరిస్థితి అర్థం అవుతోంది.

కాపులకు అన్యాయం అని ఒక మాజీ మంత్రి అంటుంటే.. కాపులపైన మాత్రమే దాడులంటూ మరో మాజీ గగ్గొలు పెడుతున్నారు. ఇక కొందరైతే.. కాపులను ముక్కలు చేసేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగానే.. ఇప్పటి వరకు కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే పార్టీలు మారుతూ.. అధికారం అనుభవించిన తోట త్రిమూర్తులు వంటి నేతలు.. కాపు సమ్మేళనం పేరుతో ప్రత్యేక తోట సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి ఇదే తరహాలో 2014-19 మధ్య కాలంలో కూడా నాటి వైసీపీ నేతలు వ్యవహరించారు. అప్పట్లో పార్టీలతో సంబంధం లేదనే ముసుగులో టీడీపీ వ్యతిరేక నేతగా ముద్ర పడిన ముద్రగడ పద్మనాభ రెడ్డి (పవన్ గెలిచిన తర్వాత తన పేరును రెడ్డిగా మార్చుకున్నారు) తునిలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కాపుల ఐక్యత పేరుతో సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ.. వైసీపీ నేతలు మాత్రం తమ రహస్య అజెండా అమలు చేశారు. కాపులకు అన్యాయం అంటూ అక్కడికి వచ్చిన వారిని రెచ్చగొట్టారు. పక్కనే ఉన్న రైల్వేస్టేషన్‌పైన దాడికి ఉసిగొల్పారు. అటుగా వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పు పెట్టారు. దీంతో ఇది జాతీయ స్థాయిలో సంచలనం రేపింది.

ఎన్నికలకు మూడేళ ముందే కాపులను రిజర్వేషన్, గుర్తింపు పేరుతో రెచ్చగొట్టిన నాటి వైసీపీ నేతలు.. అదే టెంపోను ఎన్నికల వరకు కొనసాగించారు. చివరికి నాటి టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ కల్పించినా కూడా.. అది అసాధ్యమనే ప్రచారంతో కాపులను తప్పుదోవ పట్టించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు రిజర్వేషన్ కల్పిస్తా అంటూ హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మాట మార్చారు. టీడీపీ ఇచ్చిన రిజర్వేషన్‌ కూడా రద్దు చేశారు. అలాగే కాపుల పక్షపాతి అంటూ పైకి చెబుతూనే.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు. పదే పదే వ్యక్తిత్వ హననం.. వ్యక్తిగత విమర్శలు, నీచమైన వ్యాఖ్యలతో పవన్‌ను రెచ్చగొట్టారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను గుర్తించిన కాపులు.. జై పవన్ అన్నారు. పవన్‌కు మద్దతుగా నిలిచారు.

2024 ఎన్నికల్లో కూటమి గెలుపులో పవన్ కీలక పాత్ర పోషించారనేది బహిరంగ రహస్యం. పవన్ వల్లే భారీ మెజారిటీలు వచ్చాయని.. పవన్‌తో టీడీపీ పొత్తు వల్లే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని చంద్రబాబు ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు కూడా. ఇక లోకేష్ అయితే.. పవన్‌ను పెద్దన్న అంటూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అటు పవన్ కూడా మరో 15 ఏళ్ల పాటు టీడీపీ – జనసేన పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ప్రకటనే వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. ఈ పొత్తు కొనసాగితే.. తమకు మళ్లీ మళ్లీ ఓటమి ఖాయమని భయపడుతున్న ఆ పార్టీ నేతలు.. మరోసారి పాత ఫార్ములాను అమలు చేసేందుకు నానా పాట్లు పడుతున్నారు. కాపులను రెచ్చగొట్టి.. పవన్‌పైన, కూటమి సర్కార్‌పైన తిరుగుబాటు చేసేలా రెచ్చగొడుతున్నారు. అయితే కాపులు అమాయకులు కాదు. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం కాపులు చాలా తెలివైన వారు. అంతా చదువుకున్న వారే. వాస్తవాలు తెలుసుకున్నారు. తమకు ఎవరి వల్ల గుర్తింపు వచ్చింది.. ఎవరు తమకు న్యాయం చేశారు.. ఎవరు తమను అక్కున చేర్చుకున్నారనే విషయం అందరికీ తెలుసు. అందుకే వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను కాపు సామాజిక వర్గానికి చెందిన వారే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో వైసీపీని ఎండగడుతున్న వారిలో కాపులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికైనా కులాల మధ్య చిచ్చుపెట్టే అలవాటు మార్చుకోకపోతే.. ఆ కులాల కుంపట్లలోనే తగలబడిపోతారని హెచ్చరిస్తున్నారు. కాపుల మధ్య చిచ్చు పెట్టాలనే వైసీపీ ప్రయత్నం.. చివరికి ఆ పార్టీకే తగిలిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.