కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి దృష్టి ఇద్దరు నేతలపైనే పడింది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఫోకస్ కూడా. ఆ ఇద్దరే ఒకరు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మరొకరు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేయడంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు. అలాగే యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపారు. దీంతో ఈ ఇద్దరు నేతల పైనే అందరి దృష్టి పడింది. మరోవైపు పాలనా వ్యవహారాలను కూడా పవన్, లోకేష్ చూస్తుండటంతో.. వీరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
పవన్ తన శాఖల పరిధిలో ఎలాంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో తన పేరుతో ఎవరైనా ఏమైనా చేస్తే.. ఆ విషయం తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అటు లోకేష్ కూడా ఇదే మాదిరిగా వ్యవహరిస్తున్నారు. దీంతో చాలా మంది అధికారులు, ఉద్యోగులు ఈ ఇద్దరి మాటే ఫైనల్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కొందరు ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరి కార్యాలయాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారులు.. పవన్, లోకేష్ పేర్లు చెప్పి పైరవీలు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి లోకేష్ తన పేషిలో గతం లో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని అధికారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. అయితే నిజానికి ఆయన పేషిలోనే అవినీతి చేస్తున్నారని ఏపీ సచివాలయంలో బాగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం.. ఇక్కడ టీడీపీ అభిమానుల కన్నా.. వైసీపీ అభిమానులే ఎక్కువగా కనిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో టీడీపీ అభిమాని, లోకేష్‌కు అత్యంత విశ్వాస పాత్రుడుడైన మంత్రి గారి ఆంతరంగిక అధికారిని పధకం ప్రకారం ఒత్తిడి తెచ్చి పంపించారనేది బహిరంగ రహస్యం. నిజాయతీ గురించి పదే, పదే చెబుతున్న మంత్రి లోకేష్ కూడా.. నిజాయతీ అధికారులను గుర్తించటం లేదంటున్నారు.
ప్రస్తుత లోకేష్ ఓఎస్‌డీ గా ఉన్న అధికారి పైన వైసీపీ ప్రభుత్వం హయాంలోనే అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయని.. టీడీపీకి మద్ధతిచ్చే పత్రిక అప్పట్లోనే అన్ని ఆధారాలతో తాటికాయంత అక్షరాలతో కథనం ప్రచురించింది. లోకేష్ పేషి ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్న ఓఎస్‌డీ.. వైసీపీ ప్రభుత్వంలో ఆర్‌డీవోగా పనిచేశారు. కరుడుగట్టిన వైసీపీ అభిమానిగా పేరు. చివరకు ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు కుటుంబానికి చెందిన భూములను వైసీపీ కార్యాలయానికి కేటాయించిన అప్పటి తహసీల్దార్‌తో పాటు, లోకేష్ ఓఎస్‌డీకి సన్నిహితుడైన అప్పటి ఆర్‌డీవో హస్తం కూడా ఉందని బయట పడింది. తన ఆప్తుడిని రక్షించేందుకు మంత్రి లోకేష్ ఓఎస్‌డీ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, మంత్రి లోకేష్ పేరు చెప్పి బెదిరిస్తున్నారని ఇప్పటికే సచివాలయంలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం హయాంలో రాయలసీమ ప్రాంతంలో ఆర్‌డీవోగా పని చేశారు. అంతే కాదు చంద్రబాబుకు వ్యతిరేకి.. జగన్ మోహన్ రెడ్డికి వీర భక్తుడంటారు ఆయన సన్నిహితులు. అక్రమార్కులను కాపాడటం.. విజిలెన్స్, ఏసీబీ కేసులు ఎత్తివేయించటం, వారి పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకుండా చేయటంలో అపార అనుభవం ఉందంటున్నారు కూడా. అశోక్ గజపతి రాజు భూములను అక్రమంగా వైసీపీకి కేటాయించిన కేసులో తన మిత్రుడైన ఆర్‌డీవోను కాపాడేందుకు మంత్రి పేరుతో సీనియర్ అధికారుల పై ఒత్తిడి తెస్తున్నారని ఉన్నతాధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. తన పేరు అడ్డం పెట్టుకుని ఓఎస్‌డీ చేస్తున్న అధికార దుర్వినియోగం విషయం మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులతో పాటు పార్టీ నేతలు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
