ఏపీలో పేరుకే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇందుకు చాలా ఉదాహరణలు చెబుతున్నారు కూడా. ముఖ్యంగా ఇప్పటికీ చాలా చోట్ల వైసీపీ అభిమాన అధికారులు, పోలీసులే పని చేస్తున్నారని.. వారి వల్ల ఇప్పటికీ నానా పాట్లు పడుతున్నామనేది తెలుగు తమ్ముళ్ల ఆవేదన. తాజాగా వైసీపీ అభిమాన ఐఏఎస్ పని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి కేంద్ర హోమ్ శాఖకు కూడా ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా సరే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం.. ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఎందుకో ఆలోచిస్తున్నారనే మాట వినిపిస్తోంది.
వైసీపీ అభిమాన ఐఏఎస్ బాబు.. సీతయ్య పాత్ర పోషిస్తున్నారనే మాట సచివాలయంలో బాగా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాటి సీఎం జగన్ అభిమాన అధికారులకే చంద్రబాబు సహా పార్టీలో కీలక నేత ఒకరు పెద్ద పీట వేస్తున్నారనే ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. చివరికి వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురైన టీడీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు కూడా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆశ్చర్యంతో పాటు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో చక్రం తిప్పుతున్న నేత వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులనే ప్రొత్సహిస్తూ.. వారినే సమర్థిస్తున్నారని అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో వినిపిస్తున్న మాట.
“మాకు మా అభిమానుల కంటే కూడా.. వైసీపీ అభిమానులే ఎక్కువ.. వారినే కీలక, ప్రాధాన్యత పోస్టుల్లో నియమిస్తాం.” అనేలా పార్టీ, ప్రభుత్వ పెద్దల మాటలు, చేతలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాజాగా వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారిగా ముద్రపడిన బాబు ప్రవర్తన ఎలా ఉందంటే.. సీతయ్య సినిమాలో దివంగత మంత్రి హరికృష్ణ పోషించిన పోలీస్ పాత్రను గుర్తుకు తెస్తున్నారట . ఈ సీతయ్య ఎవరి మాట వినడు.. తోచిందే చేస్తాడు.. అనే డైలాగ్ ఆ సినిమాలో బాగా ఫేమస్. ఇప్పుడు ఇదే మాదిరిగా బాబు కూడా వ్యవహరిస్తున్నారట. “నేను ఎన్ని తప్పులు చేసినా.. నన్ను కాపాడేందుకు సీఎంవో ఐఏఎస్ అండగా ఉన్నారు” అనే ధీమాతో ఉన్నారట.
వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగటమే కాదు.. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థను దెబ్బ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశారనేది బాబుపైన ప్రధాన ఆరోపణ. అమూల్ సంస్థకు భూములు కట్టబెట్టిన ఘనుడు కూడా ఐఏఎస్ బాబు. అలాంటి వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారికే సీఎం చంద్రబాబు కీలక పోస్టు ఇచ్చారు. అయితే దీని వెనుక చక్రం తిప్పింది మాత్రం సీఎంఓలో ఓ ఐఏఎస్ అధికారి అని సచివాలయంలో జోరుగా చర్చ నడుస్తోంది. ఐఏఎస్ బాబు తీరు పై, ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబుకు ఆధారాలతో సహా పిర్యాదు చేశారు. అయినా సరే సీఎంఓ అధికారి ఆశీస్సులు ఉండటంతో ఆయన పైన ఈగ వాలటం లేదు.
ఈ ఐఏఎస్ బాబుకు రెండు ప్రాధాన్యత పోస్టులిచ్చారు కూటమి ప్రభుత్వ పెద్దలు. హెరిటేజ్ సంస్థను అన్ని విధాలుగా దెబ్బ కొట్టేందుకు ఈ ఐఏఎస్ బాబుకు అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారనేది బహిరంగ రహస్యం. ఈ వైసీపీ అభిమాన ఐఏఎస్ బాబు గురించి ఇప్పటికీ సచివాలయంలో కథలు కథలుగా చెబుతున్నారు. అయినా కూడా ఆ వైసీపీ అభిమాన ఐఏఎస్ బాబుకు రెండు ప్రాధాన్యత పోస్టులు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో సీఎం చంద్రబాబును పార్టీ నేతలు, అభిమాన అధికారులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
