ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కుర్చీలో నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మంత్రి నారా లోకేష్ మాటే పార్టీలో ఫైనల్ అంటున్నారు పార్టీ నేతలు. పార్టీ పదవులు ఎవరికి ఇవ్వాలి.. పార్టీ టికెట్లు ఎవరికివ్వాలి.. నియోజకవర్గం ఇంఛార్జులుగా ఎవరిని నియమించాలనేది పార్టీ అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాత్రమే నిర్ణయిస్తారనేది పార్టీలో ఉన్న కింది స్థాయి నేతలకు తెలుసు. అయితే ఇది అన్ని నియోజకవర్గాలకు వర్తించదనేది పార్టీలో కొందరి మాట. ఇందుకు ప్రధానంగా చంద్రబాబు సొంత జిల్లాలో జరుగుతున్న పరిణామాలనే ఉదాహరిస్తున్నారు.
ఆ రెండు నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌ల నియామకానికి వైసీపీ మాజీ మంత్రి ఒకే అంటనే.. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. రాష్ట్రం మొత్తం రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు మరొక ఎత్తు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 ఎన్నికల్లో కూటమి గాలి బలంగా వీచినప్పటికీ.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం రెండే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే వారిద్దరినీ పరోక్షంగా టీడీపీ పెద్దలే గెలిపించారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. ఆ రెండు సీట్లలో ఒకటి పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గెలవగా… మరో నియోజకవర్గం తంబళ్లపల్లిలో పోటీ చేసిన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు.
అయితే వీరిద్దరి గెలుపు అంత సులువుగా రాలేదంటున్నారు. దీని వెనుక పెద్ద మతలబు ఉందంటున్నారు జిల్లా వాసులు. ఆ ఇద్దరు గెలవగలిగారంటే.. వారిద్దరిపై పోటీచేసిన టీడీపీ అభ్యర్థులు ఇద్దరు కూడా రాజకీయంగా బలహీనులని వ్యాఖ్యానిస్తున్నారు. ఆ ఇద్దరిని కూడా కావాలనే చంద్రబాబు ఎంపిక చేశారన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. ఆ రెండు నియోజకవర్గాల్లో గట్టి టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేసినట్లయితే.. పెద్దిరెడ్డి బ్రదర్స్ కూడా ఓడిపోయే వారని.. కానీ.. చంద్రబాబు, పెద్దిరెడ్డి మధ్య రాజకీయ రహస్య ఒప్పందం జరిగిందా అని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి కూడా.
నిజానికి ఇదంతా గతం. తాజాగా పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా కొత్తగా ఇద్దరిని చంద్రబాబు నియమించనున్నారనే మాట బాగా వినిపిస్తోంది. ఈ నియామకాలు ఎలా ఉండబోతున్నాయని ఆ రెండు నియోజకవర్గాల స్థానిక టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఆరా తీయగా.. గత ఎన్నికల్లో పెద్దిరెడ్డి సోదరులపై టీడీపీ అభ్యర్థులను ఎలా ఎంపిక చేసారో.. అదే విధంగా ఇప్పుడు కూడా ఆ రెండు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ల ఎంపిక కూడా జరుగుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దీని అర్ధం, పరమార్ధం ఏమిటంటే.. అప్పుడు వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరినట్లు టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేశారని.. ఇప్పుడు కూడా ఆ రెండు నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా పెద్దిరెడ్డి చెప్పినట్లే చంద్రబాబు ఎంపిక చేస్తారని ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. అధికారం అండతో నాలుగున్నరేళ్లు ఎన్నో విధాలుగా టీడీపీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు పెట్టారు. పోలీసులతో కొట్టించిన వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితోనే టీడీపీ పెద్దలు లాలూచి పడితే.. మేము మాత్రం ఏం చేయగలమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చివరికి పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జ్‌లుగా పెద్దిరెడ్డి తెర వెనుక చేసే సిపార్సుతోనే ఎంపిక జరుగుతుందా..? గతంలో తప్పు జరిగింది.. మళ్లీ అలాంటి తప్పు జరగకుండా వైసీపీ పెద్దిరెడ్డితో రాజకీయంగా పోరాడగల సత్తా ఉన్న నేతను ఎంపిక చేస్తారా..? అని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పటి చంద్రబాబు ఆలోచన, ఇప్పుడు మారుతుందా..? లేక కార్యకర్తలు ఆరోపిస్తున్నట్లుగా పెద్దిరెడ్డి సూచించిన వారినే మళ్లీ చంద్రబాబు ఎంపిక చేస్తారా.. అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే.. ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి